IND VS AUS 3rd ODI: రోహిత్‌ శర్మ ప్రపంచ రికార్డు

27 Sep, 2023 18:52 IST|Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రాజ్‌కోట్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో వరుస సిక్సర్లతో విరుచుకుపడిన హిట్‌మ్యాన్‌ స్వదేశంలో అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్లు (259) బాదిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అర్ధసెంచరీ అయ్యేలోపు 5 సిక్సర్లు బాదిన హిట్‌మ్యాన్‌ న్యూజిలాండ్‌ ఆటగాడు మార్టిన్‌ గప్తిల్‌ (256) ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి స్వదేశంలో సిక్సర్ల కింగ్‌గా అవతరించాడు.

మరోవైపు అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్ల రికార్డుకు కూడా రోహిత్‌ చేరువవుతున్నాడు. అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్ల రికార్డు విండీస్‌ దిగ్గజం​, యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ (553) పేరిట ఉండగా.. అతని రికార్డు బద్దలు కొట్టేందుకు రోహిత్‌ కేవలం 4 సిక్సర్ల దూరంలో (550) ఉన్నాడు. ఈ విభాగంలో ప్రస్తుత క్రికెటర్లలో ఎవరూ రోహిత్‌కు దరిదాపుల్లో కూడా లేరు. మార్టిన్‌ గప్తిల్‌ 383 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ 312 సిక్సర్లతో 10వ స్థానంలో, విరాట్‌ కోహ్లి 282 సిక్సర్లతో 11వ స్థానంలో ఉన్నారు. 

ఇదిలా ఉంటే, టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. టాప్‌ 4 బ్యాటర్లు వార్నర్‌ (56), మార్ష్‌ (96), స్టీవ్‌ స్మిత్‌ (74), లబూషేన్‌ (72) మెరుపు అర్ధసెంచరీలతో చెలరేగడంతో ఆసీస్‌ టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లలో బుమ్రా 3, కుల్దీప్‌ 2, సిరాజ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ తలో వికెట్‌ పడగొట్టారు. 

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (38 బంతుల్లో 57 నాటౌట్‌; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), వాషింగ్టన్‌ సుందర్‌ (18) తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించారు. అనంతరం సుందర్‌ ఔట్‌ కాగా.. విరాట్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. 12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 78/1గా ఉంది. భారత్‌ లక్ష్యానికి మరో 275 పరుగుల దూరంలో ఉంది. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. 

మరిన్ని వార్తలు