Ind Vs Aus: మ్యాచ్‌కు ముందు కడుపునొప్పి, జ్వరం! లెక్కచేయని సూర్య! ఇదే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ అయితే!

26 Sep, 2022 12:20 IST|Sakshi

Ind Vs Aus 3rd T20 Hyderabad- Suryakumar Yadav: ఆస్ట్రేలియాతో సిరీస్‌ ఫలితం తేల్చే ఆఖరి టీ20లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు టీమిండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌. ఆదిలోనే ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌(1), రోహిత్‌ శర్మ(17) పెవిలియన్‌ చేరిన వేళ.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లితో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.

అనారోగ్యం బారిన పడినా..
కోహ్లితో కలిసి మూడో వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు ఈ ముంబై బ్యాటర్‌. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డుఅందుకున్నాడు. అయితే, కీలక మ్యాచ్‌కు ముందు సూర్యకుమార్‌ యాదవ్‌ అనారోగ్యం బారిన పడ్డాడు.

అయినప్పటికీ ఎలాగైనా మ్యాచ్‌ ఆడి జట్టును గెలిపించాలన్న దృఢ సంకల్పమే అతడిని కోలుకునేలా చేసింది. ఈ విషయం గురించి మ్యాచ్‌ అనంతరం అక్షర్‌ పటేల్‌తో మాట్లాడిన సూర్య.. ఆట ఆరంభానికి ముందు తనకు ఎదురైన అసౌకర్యం గురించి చెప్పుకొచ్చాడు.

కడుపునొప్పి, జ్వరం అయినా కూడా!
ఉదయం మూడు గంటలకే ఎందుకు నిద్రలేవాల్సి వచ్చిందన్న అక్షర్‌ ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ప్రయాణ బడలిక.. అంతేగాకుండా రాత్రి వాతావరణంలో మార్పు.. ఈ పరిణామాలతో నాకు ముందుగా కడుపు నొప్పి వచ్చింది. ఆ తర్వాత జ్వరం కూడా!

ఒకవేళ ఇదే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ అయితే!
అయితే, ఈ మ్యాచ్‌ మనకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు. అందుకే డాక్టర్‌, ఫిజియోతో ఒక్కటే మాట చెప్పాను. ఒకవేళ ఇది వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ అయితే.. మీరెలా స్పందిస్తారని అడిగాను. అనారోగ్య కారణాల వల్ల బెంచ్‌ మీద కూర్చోవడానికి నేను సిద్ధంగా లేనని చెప్పాను.

సూర్య అంకితభావానికి ఫ్యాన్స్‌ ఫిదా!
నాకు ఎలాంటి మెడిసిన్‌ ఇస్తారో తెలియదు.. ఇంజక్షన్‌ అయినా పర్లేదు.. ఏం చేసైనా సరే మ్యాచ్‌ సమయానికి నన్ను సిద్దం చేయండి అని చెప్పాను. ఇక ఒక్కసారి జెర్సీ వేసుకుని మైదానంలో అడుగుపెట్టిన తర్వాత నన్ను చుట్టుముట్టే భావోద్వేగాల గురించి వర్ణించలేను’’ అంటూ సూర్యకుమార్‌ యాదవ్‌ చెప్పుకొచ్చాడు. వీరిద్దరి సంభాషణకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేయగా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.

అనారోగ్యం బారిన పడినా జట్టు గురించి ఆలోచించిన సూర్యకు అభిమానలు హాట్సాఫ్‌ చెబుతున్నారు. నీలాంటి ఆటగాళ్లు జట్టుకు అవసరం అంటూ కొనియాడుతున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో సూర్య బ్యాటింగ్‌(36 బంతుల్లో 69 పరుగులు)తో అదరగొడితే.. అక్షర్‌ పటేల్‌ 3 వికెట్లు తీసి టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక మూడో టీ20లో విజయంతో రోహిత్‌ సేన సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. 

చదవండి: Rohit Sharma- Virat Kohli: పట్టరాని సంతోషం.. కోహ్లి- రోహిత్‌ ఆలింగనం.. వీడియో వైరల్‌
Ind Vs Aus 3rd T20: ద్రవిడ్‌ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. సచిన్‌ తర్వాత రెండో భారత బ్యాటర్‌గా..

మరిన్ని వార్తలు