-

Ind vs Aus: గెలవడానికే వచ్చారా? టాస్‌ గెలిస్తే.. పరుగుల విందు గ్యారెంటీ.. కానీ.. డేంజర్‌ జోన్‌లో తిలక్‌

28 Nov, 2023 13:41 IST|Sakshi
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో టీమిండియా (PC: BCCI)

India vs Australia, 3rd T20I: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ ఫలితాన్ని మూడో మ్యాచ్‌తోనే తేల్చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఇందుకోసం ఇప్పటికే సన్నద్ధమైన సూర్యసేన.. మంగళవారం కంగారూ జట్టుతో గువాహటి వేదికగా పోటీపడనుంది. తొలి రెండు టీ20ల మాదిరే ఇక్కడ కూడా గెలుపొంది.. సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకోవాలని భావిస్తోంది.

గత చేదు అనుభవం మరిపించేలా
ఇక భారత్‌- ఆసీస్‌ పోరుకు వేదిక కానున్న బర్సపరా వికెట్‌ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలం. అయితే గతంలో ఇక్కడే ఆస్ట్రేలియా చేతిలో ఓడిన చేదు అనుభవం టీమిండియాకు ఉంది. కానీ.. పటిష్టమైన దక్షిణాఫ్రికాపై భారీ స్కోరు చేసి గెలవడం సానుకూలాంశం. ఇక.. ప్రస్తుత టీమిండియా ఫామ్‌ను చూస్తుంటే.. మరోసారి పరుగుల విందు గ్యారంటీగా కనిపిస్తోంది.

టాస్‌ గెలిస్తే.. తొలుత బ్యాటింగే
బర్సపరా స్టేడియంలో టాస్‌ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోవడానికి మొగ్గుచూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా మూడో టీ20లో టాస్‌ ప్రాధాన్యం, పిచ్‌ గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘ఇక్కడ టీమిండియా గెలిచి సిరీస్‌ను గెలిచే అవకాశం ఉంది. 3-0తో ప్రత్యర్థిని చిత్తు చేస్తే చాలా బాగుంటుంది.

పిచ్‌పై తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి
అయితే, బర్సపరాలో టాస్‌ అత్యంత కీలకం కానుంది. తిరునవంతపురం మాదిరే ఇక్కడ కూడా పిచ్‌పై తేమ ఉండనుంది. అక్కడితో పోలిస్తే ఇంకాస్త ఎక్కువగానే డ్యూ ఉండొచ్చు’’ అని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు. ఇక టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘యశస్వి జైశ్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌లతో టాపార్డర్‌ అద్భుతంగా కనిపిస్తోంది.

డేంజర్‌ జోన్‌లో తిలక్‌ వర్మ
అయితే, శ్రేయస్‌ అయ్యర్‌ వచ్చిన తర్వాత బయటకు ఎవరు వెళ్తారన్నది ఆసక్తికరం. ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే తిలక్‌ వర్మ డేంజర్‌ జోన్‌లో ఉన్నాడు. ఒకవేళ అతడికి తుదిజట్టులో చోటు దక్కకపోతే సూర్యకుమార్‌ యాదవ్‌ ఐదో స్థానంలో ఆడతాడో చూడాలి!’’ అని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. అదే విధంగ..  కీలక ఆటగాళ్లను ఆస్ట్రేలియా మేనేజ్‌మెంట్‌ స్వదేశానికి పంపుతున్న తరుణంలో అసలు వాళ్లు ఇక్కడికి గెలవడానికే వచ్చారా అంటూ ఆకాశ్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

యువ ఆటగాళ్ల విజృంభణ
కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టు.. కంగారూలతో టీ20 సిరీస్‌ ఆడుతోంది. రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సహా విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌ తదితరులు విశ్రాంతి తీసుకుంటుండగా.. యువ ఆటగాళ్లకు జట్టులో స్థానం దక్కింది.

సూర్యకుమార్‌ సారథ్యంలో సాగుతున్న ఈ సిరీస్‌లో.. యశస్వి జైశ్వాల్‌, రింకూ సింగ్‌ అదరగొడుతున్నారు. ఇక ఈ జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా ఉన్న శ్రేయస్‌ అయ్యర్‌ నాలుగో మ్యాచ్‌ నుంచి బరిలో దిగనున్నాడు. ఇక మాథ్యూ వేడ్‌ ఆసీస్‌ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.

ఆస్ట్రేలియాతో మూడో టీ20కి భారత తుదిజట్టు(అంచనా)
రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకు సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్‌ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిద్‌ కృష్ణ. 

చదవండి: మనుషులు దూరంగా ఉన్నా.. విరాట్‌ కోహ్లి తోబుట్టువు, వ్యాపారవేత్త భార్య!

మరిన్ని వార్తలు