భారత్‌- ఆసీస్‌ ఉప్పల్‌ మ్యాచ్‌.. టికెట్లు అయిపోయాయి: హెచ్‌సీఏ ప్రకటన

22 Sep, 2022 16:37 IST|Sakshi

India Vs Australia 2022 3rd T20 Uppal Stadium- Tickets- HCA: భారత్‌- ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌ ప్రత్యక్షంగా వీక్షిద్దామనుకున్న చాలా మంది అభిమానులకు నిరాశే ఎదురైంది. ఉప్పల్‌ స్టేడియం చుట్టూ.. జింఖానా గ్రౌండ్‌ చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. దీంతో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ తీరుపై ఫ్యాన్స్‌ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రూ. 1200 టికెట్‌ను బ్లాక్‌లో 20 వేలకు అమ్ముకున్నారని ఆరోపిస్తున్నారు. ఇంత కష్టపడి ప్రాణాలకు మీదకు తెచ్చుకుని మరీ క్యూలో నిల్చుని ఉంటే ఆఖరికి టికెట్ల అయిపోయాయని ప్రకటించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆది నుంచి గందరగోళమే!
సెప్టెంబరు 25న ఉప్పల్‌ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మూడో టీ20 జరుగనుంది. ఇందుకు సంబంధించి టికెట్లు ఈ నెల 15 నుంచి పేటీఎం ఇన్‌సైడర్‌ యాప్‌ను అందుబాటులో ఉంచినట్లు స్వయంగా హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్‌ అజారుద్దీన్‌ చెప్పినప్పటికీ కేవలం అరగంటలోనే అన్ని టికెట్లు విక్రయించినట్లు, యాప్‌లో అవి  అందుబాటులో లేకపోవడంతో ఫ్యాన్స్‌ మండిపడ్డారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌లో ఆఫ్‌లైన్‌లో టికెట్లను విక్రయించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో గురువారం పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. ఈ ఘటనలో కొంతమంది గాయపడ్డారు. 

టికెట్ల కోసం క్యూలో నిల్చున్న మహిళలు, యువతులు ఇబ్బంది పడ్డారు. ఇంత కష్టపడ్డా చాలా మందికి టికెట్లు దొరకలేదు. టికెట్లు అయిపోయాయని ప్రకటించిన హెచ్‌సీఏ.. జింఖానా గ్రౌండ్స్‌లో టికెట్ల అమ్మకాన్ని నిలిపివేసింది. క్యూలైన్‌లో ఉన్నవాళ్లను వెళ్లిపోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. దీంతో చాలా మంది నిరాశగా వెనుదిరిగారు. మరోవైపు... జింఖానా గ్రౌండ్‌ వద్ద తొక్కిసలాటపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.

ఈ ఘటనపై హెచ్‌సీఏను వివరణ కోరింది. క్రీడా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ సంబంధిత అధికారులతో సమావేశమై సమీక్ష చేపట్టారు. కాగా మిగతా టికెట్లు ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు హెచ్‌సీఏ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

చదవండి: Ind Vs Aus 3rd T20: మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేయండి! అప్పుడే వాళ్లకు తెలిసివస్తుంది!
Ind Vs Aus: కోహ్లి, పాండ్యా మాత్రమే! మిగతా వాళ్లంతా ఆ విషయంపై దృష్టి సారించకపోతే!

>
మరిన్ని వార్తలు