BGT 2023 IND VS AUS 3rd Test: జడ్డూ బౌలింగ్‌లో లబూషేన్‌ క్లీన్‌ బౌల్డ్‌.. తొలిసారి తప్పించుకున్నాడు, రెండోసారి..!

1 Mar, 2023 15:41 IST|Sakshi

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023లో భాగంగా ఇండోర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (మార్చి 1) ప్రారంభమైన మూడో టెస్ట్‌లో టీమిండియా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేక చతికిలపడింది. కంగారూ స్పిన్నర్ల ధాటికి భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే కుప్పకూలింది. కుహ్నేమన్‌ (5/16) టీమిండియా బ్యాటింగ్‌  లైనప్‌ను కకావికలం చేయగా.. లయోన్‌ (3/35), మర్ఫీ (1/23) భారత జట్టు పతనంలో తమవంతు పాత్ర పోషించారు.

రోహిత్‌ (12), గిల్‌ (21), శ్రీకర్‌ భరత్‌ (17), అక్షర్‌ పటేల్‌ (12 నాటౌట్‌), ఉమేశ్‌ యాదవ్‌ (17) అతికష్టం మీద రెండంకెల స్కోర్‌ సాధించగా.. విరాట్‌ కోహ్లి (22) భారత ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌.. మూడో సెషన్‌ సమయానికి 2 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్‌ పరుగు ఆధిక్యంలో కొనసాగుతుంది.

ఉస్మాన్‌ ఖ్వాజా (53) అజేయమైన హాఫ్‌సెంచరీతో బ్యాటింగ్‌ను కొనసాగిస్తుండగా.. స్టీవ్‌ స్మిత్‌ ఇప్పుడే క్రీజ్‌లోకి వచ్చాడు. ఆసీస్‌ కోల్పోయిన రెండు వికెట్లు రవీంద్ర జడేజా ఖాతాలోకే వెళ్లాయి. జడ్డూ.. ట్రవిస్‌ హెడ్‌ (9)ను ఎల్బీగా, లబూషేన్‌ (31)ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు.

తొలిసారి తప్పించుకున్నా, రెండోసారి అదే తరహాలో..
లబూషేన్‌ను జడేజా ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌ తొలి బంతికే క్లీన్‌బౌల్డ్‌ చేసినప్పటికీ.. ఆ బంతిని అంపైర్లు నోబాల్‌గా ప్రకటించడంతో లబూషేన్‌ బ్రతికిపోయాడు. అయితే ఇన్నింగ్స్‌ 35వ ఓవర్‌లో మాత్రం లబూషేన్‌ను ఏ తప్పిదం కాపాడలేకపోయింది. నో బాల్‌ బంతికి ఎలా క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడో ఈసారి కూడా అదే రీతిలో క్లీన్‌ బౌల్డయ్యాడు. 

ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 8 సార్లు లైన్‌ దాటిన జడేజా..
సాధారణంగా స్పిన్నర్లు క్రీజ్‌ బయటకు వచ్చి నో బాల్స్‌ వేయడం చాలా అరుదుగా చూస్తుంటాం. అయితే ఈ సిరీస్‌ జడ్డూ ఇప్పటివరకు ఏకంగా 8 నో బాల్స్‌ సంధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఇందులో జడ్డూ రెండుసార్లు వికెట్‌ పడగొట్టినా, నో బాల్‌ పుణ్యమా అని ప్రత్యిర్ధికి లైఫ్‌ లభించింది. ఈ మ్యాచ్‌లో లబూషేన్‌ జడ్డూ తప్పిదం కారణంగా తప్పించుకోగా, తొలి టెస్ట్‌లో స్టీవ్‌ స్మిత్‌ జడ్డూ చేసిన ఇదే తప్పిదం కారణంగా బతికిపోయాడు.  

మరిన్ని వార్తలు