Aakash Chopra: ఆసీస్‌తో నాలుగో టెస్ట్‌.. కేఎస్‌ భరత్‌ను పక్కకు పెట్టొద్దు, కోహ్లి, పుజారా ఏం చేశారని..?

8 Mar, 2023 13:52 IST|Sakshi

BGT 2023 IND VS AUS 4th Test: బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023లో భాగంగా భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య అహ్మదాబాద్‌ వేదికగా రేపటి నుంచి (మార్చి 9) నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టు ఎలా ఉండబోతున్నదానిపై మేనేజ్‌మెంట్‌ ఇప్పటికే కొన్ని సంకేతాలు వదిలింది. టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతుందని, సిరాజ్‌ స్థానంలో షమీ, వికెట్‌కీపర్‌ కేఎస్‌ భరత్‌ స్థానంలో ఇషాన్‌ కిషన్‌ తుది జట్టులో ఉంటారని కోచ్‌ రాహుల్‌ ద్రవిడే పరోక్షంగా క్లూ ఇచ్చాడు. 

ఈ నేపథ్యంలో వికెట్‌కీపర్‌, ఆంధ్ర ఆటగాడు కేఎస్‌ భరత్‌కు ప్రముఖ వ్యాఖ్యాత, భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అండగా నిలిచాడు. నాలుగో టెస్ట్‌లో భరత్‌ను పక్కకు పెట్టొదని జట్టు మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. ఇషాన్‌ కిషన్‌ ప్రస్తావన తేకుండా భరత్‌ను తుది జట్టులో కొనసాగించాలని కోరాడు. బ్యాట్‌తో రాణించలేదన్న కారణంగా భరత్‌ను పక్కకు పెట్టడం సహేతుకం కాదని, స్టార్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లి, పుజారా, శ్రేయస్‌ అయ్యర్‌ ఫెయిలైన చోట భరత్‌ బ్యాట్‌తో రాణించాలని ఆశించడం కరెక్ట్‌ కాదని అభిప్రాయపడ్డాడు. 

ఢిల్లీ టెస్ట్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో భరత్‌ (22 బంతుల్లో 23 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌) బ్యాట్‌ ఝులిపించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాడు. బ్యాట్‌తో ప్రతి ఇన్నింగ్స్‌లో రాణించడలేదని భరత్‌ను బెంచ్‌కు పరమితం చేస్తే, ఇంతకు మించిన అపహాస్యం ఇంకోటి ఉండదని అన్నాడు. బ్యాటింగ్‌ విషయాన్ని పక్కన పెడితే భరత్‌ వికెట్ల వెనక ఔట్‌స్టాండింగ్‌ పెర్ఫార్మెన్స్‌ కనబరుస్తున్నాడని, బ్యాట్‌తో ప్రూవ్‌ చేసుకునేందుకు అతనికి మరికొన్ని అవకాశాలు ఇస్తే మెరుగవుతాడని ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 

ఇదిలా ఉంటే, నాలుగు మ్యాచ్‌ల BGT 2023లో ఇప్పటివరకు జరిగిన 3 టెస్ట్‌ల్లో భారత్‌ 2 (తొలి రెండు), ఆసీస్‌ ఒక మ్యాచ్‌ (మూడో టెస్ట్‌) గెలుపొందిన విషయం తెలిసిందే. తొలి రెండు టెస్ట్‌ల్లో గెలిచి జోరుమీదుండిన భారత్‌.. అనూహ్యంగా మూడో టెస్ట్‌లో ఓటమిపాలై చావుదెబ్బ తినింది. ఈ మ్యాచ్‌లో నాథన్‌ లయోన్‌ 11 వికెట్లతో పేట్రేగిపోవడంతో ఆసీస్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి రెండు టెస్ట్‌ల్లో బ్యాటింగ్‌లో పర్వాలేదనిపించిన భారత్‌.. మూడో టెస్ట్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే కుప్పకూలిన రోహిత్‌ సేన, రెండో ఇన్నింగ్స్‌లో లయోన్‌ వీరలెవెల్లో విజృంభించడంతో (8/64) 163 పరుగులకే చాపచుట్టేసింది. 

భారత్‌ తరహాలోనే తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే (197) పరిమితమైన ఆసీస్‌.. టీమిండియా నిర్ధేశించిన 78 పరుగుల సునాయాస లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది. అంతకుముందు భారత్‌.. తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్‌ 132 తేడాతో, రెండో టెస్ట్‌లో 6 వికెట్ల తేడాతో ఆసీస్‌ను మట్టికరిపించింది. నాలుగో టెస్ట్‌ అనంతరం భారత్‌, ఆసీస్‌లు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడనున్నాయి. తొలి వన్డే మార్చి 17న ముంబైలో, రెండో వన్డే 19న విశాఖలో, మూడో వన్డే మార్చి 22న చెన్నైలో జరుగుతుంది.   

మరిన్ని వార్తలు