WTC- Ind VS Aus 4th Test: టీమిండియాకు ఊహించని షాక్‌!

12 Mar, 2023 10:31 IST|Sakshi

India vs Australia, 4th Test: ఆస్ట్రేలియాతో నిర్ణయాత్మక నాలుగో టెస్టు నేపథ్యంలో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారత కీలక బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు గాయం తిరగబెట్టినట్లు సమాచారం. అహ్మదాబాద్‌ టెస్టులో మూడో రోజు ఆట సందర్భంగా వెన్నునొప్పితో అతడు విలవిల్లాడిపోయిట్లు తెలుస్తోంది. దీంతో.. అయ్యర్‌ను బీసీసీఐ వైద్యబృందం పరీక్షించి స్కానింగ్‌కు పంపినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

ఆ రెండు టెస్టుల్లో
కాగా వెన్నునొప్పి కారణంగా బోర్డర్‌- గావస్కర్‌ తొలి టెస్టుకు అయ్యర్‌ దూరమైన విషయం తెలిసిందే. దీంతో అతడి స్థానంలో టీ20 స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ నాగ్‌పూర్‌ మ్యాచ్‌ సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఈ క్రమంలో అయ్యర్‌ కోలుకుని రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చాడు. ఢిల్లీ టెస్టులో 16, మూడో టెస్టులో 26 పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచాడు.

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కీలకం
ఈ క్రమంలో కనీసం ఆఖరి టెస్టులోనైనా ఈ మిడిలార్డర్‌ బ్యాటర్‌ రాణిస్తాడని ఆశిస్తే వెన్నునొప్పి కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. ఇదిలా ఉంటే ఆసీస్‌తో ఆఖరిదైన అహ్మదాబాద్‌ టెస్టులో టీమిండియా తప్పక గెలవాలి.

అలా అయితేనే ఆస్ట్రేలియాతో పాటు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో నేరుగా అడుగుపెడుతుంది. లేదంటే న్యూజిలాండ్‌- శ్రీలంక టెస్టు సిరీస్‌ ఫలితం తేలేదాకా ఎదురుచూడాలి. ఇలాంటి కీలక సమయంలో అయ్యర్‌ వంటి కీలక ఆటగాడు దూరమైతే పరిస్థితి చేజారిపోతుంది.

దీటుగా బదులిస్తున్న టీమిండియా
ఇక ఇప్పటికే నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్‌ బృందం 480 పరుగుల భారీ స్కోరు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ క్రమంలో 289-3 స్కోరు వద్ద టీమిండియా ఆదివారం నాలుగో రోజు ఆటను ఆరంభించింది. తొలి సెషన్‌ డ్రింక్స్‌ బ్రేక్‌ సమాయనికి 116 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 323 పరుగులు చేసింది. శుబ్‌మన్‌ గిల్‌ శతకాని(128)కి తోడు విరాట్‌ కోహ్లి రాణిస్తుండటంతో ఆసీస్‌కు దీటుగా బదులిస్తోంది. ఇలాంటి సమయంలో అయ్యర్‌ సేవలు కోల్పోవడం గట్టి ఎదురుదెబ్బలాంటిదే.

చదవండి: Virat Kohli- Steve Smith: విరాట్‌ కెరీర్‌లో ఇదే తొలిసారి! కోహ్లి బ్యాట్‌ చెక్‌ చేసిన స్మిత్‌.. వైరల్‌

మరిన్ని వార్తలు