Virat Kohli- Steve Smith: కోహ్లి విషయంలో స్మిత్‌ మొన్న అలా.. నిన్న ఇలా! బీసీసీఐ ట్వీట్‌ వైరల్‌

13 Mar, 2023 11:46 IST|Sakshi
కోహ్లిని అభినందించిన స్మిత్‌ (PC: BCCI)

India vs Australia, 4th Test: టీమిండియా- ఆస్ట్రేలియా మ్యాచ్‌ అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇరు జట్ల మధ్య పోటాపోటీ క్రికెట్‌ ప్రేమికులకు మజా అందిస్తుంది. ఇక బోర్డర్‌- గావస్కర్‌ ప్రతిష్టాత్మక ట్రోఫీ గురించి చెప్పేదేముంది. సంప్రదాయ క్రికెట్‌లో ఇరు మేటి జట్లు తలపడుతుంటే ముచ్చటగా ఉంటుంది.

అయితే, అదే సమయంలో స్లెడ్జింగ్‌ చేస్తూ శ్రుతిమించే ఆటగాళ్లను చూస్తే కాస్త చిరాకేస్తుంది. కానీ.. ఈసారి టీమిండియా- ఆసీస్‌ టెస్టు సిరీస్‌లో పిచ్‌ గురించి మినహా పెద్దగా మాటల యుద్ధాలు కనిపించలేదు. అందుకు భిన్నంగా టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి- ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ మధ్య ‘బ్రొమాన్స్‌’ సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తున్నాయి.

మొన్న అలా
చాలా కాలం తర్వాత టెస్టుల్లో కోహ్లి అర్ధ శతకం నమోదు చేసిన తర్వాత స్మిత్‌ అతడికి దగ్గరికి వచ్చి బ్యాట్‌ చెక్‌ చేస్తూ.. ఆ తర్వాత ఇద్దరూ నవ్వుకుంటున్న దృశ్యాలు వైరల్‌ అయిన విషయం తెలిసిందే. బీజీటీ- 2023లో ఆఖరిదైన అహ్మదాబాద్‌ టెస్టు మూడో రోజు ఆట సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇక ఆదివారం నాటి నాలుగో రోజు ఆటలో రన్‌మెషీన్‌ కోహ్లి హాఫ్‌ సెంచరీని శతకంగా మలిచిన సంగతి తెలిసిందే. కెరీర్లో 75వ అంతర్జాతీయ సెంచరీ నమోదు చేసిన కోహ్లి.. డబుల్‌ సెంచరీ దిశగా పయనించగా టాడ్‌ మర్ఫీ బౌలింగ్‌లో 186 పరుగుల వద్ద బ్రేక్‌ పడింది.

వెన్నుతట్టి..
దీంతో కోహ్లి పెవిలియన్‌ చేరుతున్న సమయంలో అతడిని అభినందించిన స్మిత్‌.. కోహ్లి చేతిలో చెయ్యి వేసి శభాష్‌ అన్నట్లుగా వెన్నుతట్టాడు. తన పట్ల స్మిత్‌ ఆప్యాయతకు బదులుగా కోహ్లి చిరునవ్వులు చిందించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను.. ‘‘పరస్పర గౌరవం.. ఆరాధ్య భావన’’ అంటూ బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేయగా వైరల్‌ అవుతోంది. 

ఫొటో ఎంత బాగుందో!
ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘‘స్మిత్‌ నిన్ను ఇలా చూస్తుంటే బాగుంది. కింగ్‌ కోహ్లిని నువ్వు అభినందించిన తీరు మా హృదయాలు గెలుచుకుంది. ఆటలో మాత్రమే ప్రత్యర్థులు.. ఆటగాళ్లంతా ఒక్కటే అని మరోసారి నిరూపితమైంది. ఈ ఫొటో ఎంత బాగుందో!’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా భారత్‌- ఆస్ట్రేలియా మధ్య 75 ఏళ్ల అనుబంధాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటూ మార్చి 9న అహ్మదాబాద్‌ టెస్టు ఆరంభమైన విషయం తెలిసిందే.

తొలి రోజు ఆట సందర్భంగా ఇరు దేశాల ప్రధానులు నరేంద్ర మోదీ- ఆంటోనీ ఆల్బనీస్‌ స్టేడియానికి విచ్చేసి ఆటగాళ్లను కలిసి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ఈ నేపథ్యంలో కోహ్లి- స్మిత్‌ ఫొటో నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. ఇదిలా ఉంటే.. 1205 రోజుల తర్వాత... అహ్మదాబాద్‌ టెస్టులో శతకం బాదిన కోహ్లి పలు రికార్డులు సృష్టించాడు. ఈ క్రమంలో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 

చదవండి: 21 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. ఎట్టకేలకు అనుకున్నది సాధించిన సంజూ శాంసన్‌
Ind vs Aus- Ahmedabad Test: ఆస్ట్రేలియా రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా! ఇంకా మరెన్నో..

మరిన్ని వార్తలు