WTC: భారత్‌తో సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. మూడున్నరేళ్ల తర్వాత అతడి రీ ఎంట్రీ

11 Jan, 2023 10:26 IST|Sakshi

Ind Vs Aus- Australia Test squad: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2021-23లో భాగంగా భారత్‌తో ఆడనున్న సిరీస్‌కు ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. బోర్డర్- గావస్కర్‌ ట్రోఫీ సిరీస్‌ నేపథ్యంలో 18 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది. ఈ క్రమంలో స్పిన్నర్‌ టాడ్‌ మర్ఫీ తొలిసారి క్రికెట్‌ ఆస్ట్రేలియా బోర్డు నుంచి పిలుపు అందుకున్నాడు. 

స్టార్క్‌ అవుట్‌!
అదే విధంగా.. అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌ లాన్స్‌ మోరిస్‌ సైతం మరోసారి జట్టుకు ఎంపికయ్యాడు. మరోవైపు.. గాయం కారణంగా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ తొలి టెస్టుకు దూరమయ్యాడు. అయితే, రెండో టెస్టుకు అతడు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. స్టార్‌ ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌ సైతం వేలి గాయం కారణంగా ఇబ్బంది పడుతున్న తరుణంలో మొదటి టెస్టు ఆడే అంశంపై స్పష్టత లేదు. 

నలుగురు స్పెషలిస్టు స్పిన్నర్లతో
ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరిన ఆస్ట్రేలియా నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం భారత పర్యటనకు రానుంది. ఫిబ్రవరి 9- మార్చి 13 వరకు సిరీస్‌ ఆడనుంది. ఇక ఉపఖండ పిచ్‌లకు అనుగుణంగా కంగారూ జట్టు నలుగురు స్పెషలిస్టు స్పిన్నర్లు సహా ఆరుగురు ఫాస్ట్‌ బౌలర్లను జట్టులోకి తీసుకున్నట్లు ఆసీస్‌ చీఫ్‌ సెలక్టర్‌ జార్జ్‌ బెయిలీ పేర్కొన్నాడు. ఇక ఈ సిరీస్‌ ఆసీస్‌ కంటే కూడా టీమిండియాకు మరింత కీలకంగా మారింది. ఇందులో సత్తా చాటితేనే భారత్‌ వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరుతుంది.

మూడున్నరేళ్ల విరామం తర్వాత!
22 ఏళ్ల స్పిన్నర్‌ మర్ఫీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో విక్టోరియా, ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు తరఫున ఏడాది కాలంగా మంచి ప్రదర్శన కనబరిచాడు. ఇక ఇప్పటికే 16 టెస్టులాడిన 31 ఏళ్ల వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ హ్యాండ్స్‌కోంబ్‌ దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటి 2019 తర్వాత పునరాగమనం చేశాడు. మరోవైపు.. మాథ్యూ రేన్షా రిజర్వ్‌ బ్యాటర్‌గా సేవలు అందించనున్నాడు.

టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు
ప్యాట్‌ కమిన్స్‌(కెప్టెన్‌), స్టీవ్‌ స్మిత్‌ (వైస్‌ కెప్టెన్‌), ఆష్టన్‌ అగర్‌(లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌), స్కాట్‌ బోలాండ్‌, అలెక్స్‌ క్యారీ, కామెరాన్‌ గ్రీన్‌, పీటర్‌ హాండ్స్‌కోంబ్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, ట్రవిస్‌ హెడ్‌, ఉస్మాన్‌ ఖవాజా, మార్నస్‌ లబుషేన్‌, నాథన్‌ లియాన్‌(రైట్‌ ఆర్మ్‌ ఆఫ్‌బ్రేక్‌ స్పిన్నర్‌), లాన్స్‌ మోరిస్‌, టాడ్‌ మర్ఫీ(రైట్‌ ఆర్మ్‌ ఆఫ్‌బ్రేక్‌ స్పిన్నర్‌), మాథ్యూ రేన్షా, మిచెల్‌ స్టార్క్‌, మిచెల్‌ స్వెప్సన్‌(రైట్‌ ఆర్మ్‌ లెగ్‌బ్రేక్‌ స్పిన్నర్‌), డేవిడ్‌ వార్నర్‌.

చదవండి: IND VS SL 1st ODI: నిప్పులు చెరిగిన ఉమ్రాన్‌.. ఫాస్టెస్ట్‌ డెలివరీ రికార్డు నమోదు
IND Vs SL: కోహ్లి కమాల్‌.. భారత్‌ 'టాప్‌'గేర్‌

మరిన్ని వార్తలు