Ind Vs Aus: ఆస్ట్రేలియాతో భారత్‌ మూడో టెస్టు.. వేదిక మారింది: బీసీసీఐ ప్రకటన.. వాళ్లకు బ్యాడ్‌న్యూస్‌

13 Feb, 2023 11:16 IST|Sakshi

India Vs Australia 3rd Test: టీమిండియా- ఆస్ట్రేలియా జట్ల మధ్య ధర్మశాలలో జరగాల్సిన మూడో టెస్టు వేదిక మారింది. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా మార్చి 1 నుంచి ఆరంభం కానున్న ఈ మ్యాచ్‌కు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ వేదిక కానుంది. హోల్కర్‌ స్టేడియంలో రోహిత్‌ సేన- ప్యాట్‌ కమిన్స్‌ బృందంతో తలపడనుంది.

అందుకే మార్చారు
ఈ విషయాన్ని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి సోమవారం ధ్రువీకరించింది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా హిమాచల్‌ ప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌పీసీఏ)కు చెందిన ధర్మశాల మైదానంలో పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఈ స్టేడియంలోని అవుట్‌ ఫీల్డ్‌ సహా పిచ్‌పై పచ్చికను కొత్తగా పరిచారు. 

వాళ్లకు బ్యాడ్‌ న్యూస్‌
పిచ్‌ పరీక్షించడం సహా మరికొన్ని పనులు ఇంకా పూర్తి కాలేదు. దీంతో ఇక్కడ టెస్టు మ్యాచ్‌ నిర్వహణ సమంజసం కాదని భావించిన బోర్డు.. వేదికను మారాల్చని నిర్ణయించుకుంది. ధర్మశాలకు ప్రత్యామ్నాయంగా వైజాగ్‌, బెంగళూరు, ఇండోర్, రాజ్‌కోట్‌లను పరిశీలించిన బీసీసీఐ.. ఆఖరికి ఇండోర్‌ వైపే మొగ్గు చూపింది.

హిమాచల్‌ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు, పిచ్‌ పూర్తిస్థాయిలో రూపొందని నేపథ్యంలో వేదికను మార్చినట్లు తెలిపింది. దీంతో ప్రతిష్టాత్మక మ్యాచ్‌ ప్రతక్ష్యంగా చూడాలని భావించిన వైజాగ్‌, బెంగళూరు, గుజరాత్‌ ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది.

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరువగా
ఇదిలా ఉంటే.. నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో వరుస విజయాలతో జోరు మీదున్న ఆస్ట్రేలియాను ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. అంతేగాక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు మరింత చేరువైంది.

మిగిలిన టెస్టులు ఎక్కడంటే
మొదటి టెస్టు విజయంలో స్పిన్‌ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ సహా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కీలక పాత్ర పోషించారు. ఇక ఇరు జట్ల మధ్య ఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 17 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. మూడో టెస్టు ఇండోర్‌, నాలుగో టెస్టు అహ్మదాబాద్‌లో జరుగనున్నాయి. 

చదవండి: Ind Vs Aus: ‘డూప్లికేట్‌’కు.. అసలుకు తేడా తెలిసిందా? ఈసారి జడ్డూ కోసమైతే: భారత మాజీ బ్యాటర్‌
ILT20 2023 Winner: ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 తొలి చాంపియన్‌గా అదానీ గ్రూప్‌ జట్టు
Ind Vs Pak: ప్రపంచకప్‌లో పాక్‌పై ఇదే అత్యధిక ఛేదన.. మహిళా జట్టుపై కోహ్లి ప్రశంసలు

మరిన్ని వార్తలు