IND Vs AUS T20 Series: టీమిండియాకు ఆరో బౌలర్ దొరికేశాడు.. ఎవరంటే?!

20 Sep, 2022 11:18 IST|Sakshi

ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. మొహలీ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌కు ఇప్పటికే అంతా సిద్ధమైంది. ఇరుజట్ల ఆటగాళ్లు తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆసీస్‌తో సిరీస్‌కు ముందు సోమవారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. ఆసీస్‌, సౌతాఫ్రికాలతో జరిగే టి20 సిరీస్‌ల్లో ఐదుగురు రెగ్యులర్‌ బౌలర్లను కాకుండా ఆరు లేదా ఏడుగురితో బౌలింగ్‌ చేయించే అవకాశం ఉందని తెలిపాడు.

వచ్చే నెలలో జరగనున్న టి20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ తరహా బౌలింగ్‌కు సిద్ధమవుతున్నామని పేర్కొన్నాడు. రోహిత్‌ అన్నట్లుగానే టీమిండియాకు ఆరో బౌలర్‌ దొరికేశాడు. ఆ ఆరో బౌలర్‌ ఎవరో తెలుసా.. మన విరాట్‌ కోహ్లినే. అవును మీరు వింటున్నది నిజమే. ఆస్ట్రేలియాతో తొలి టి20 మ్యాచ్‌ పురస్కరించుకొని విరాట్‌ కోహ్లి బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌ను ప్రాక్టీస్‌ చేశాడు.

బుమ్రా, ఉమేశ్‌ యాదవ్‌ల షార్ట్‌పిచ్‌ బంతులను చాలాసేపు ప్రాక్టీస్‌ చేసిన కోహ్లి.. ఆ తర్వాత దాదాపు 30 నిమిషాల పాటు కంటిన్యూగా బౌలింగ్‌ చేయడం విశేషం. దీన్ని బట్టి టీమిండియాకు కోహ్లి రూపంలో ఆరో బౌలర్‌ దొరికేసినట్లేనని క్రికెట్‌ అభిమానులు సరదాగా కామెంట్‌ చేశారు. ఇటీవలే ఆసియా కప్‌లో హాంకాంగ్‌తో మ్యాచ్‌లో కోహ్లి బౌలింగ్‌ చేసిన సంగతి తెలిసిందే. వికెట్లేమి తీయకపోయినా.. కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మాత్రం కోహ్లి బౌలింగ్‌ను పరిశీలించడం విశేషం.

ఇక  రవీంద్ర జడేజా స్థానంలో ఆసియా కప్‌కు ఎంపికైన అక్షర్‌ పటేల్‌ తుది జట్టులోకి అవకాశం రాలేదు. అయితే ఆస్ట్రేలియాతో సిరీస్‌లో అక్షర్‌ పటేల్‌ తన ఆఫ్‌స్పిన్‌ బౌలింగ్‌తో కీలకం కానున్నాడు. అందుకే బ్యాటింగ్‌పై ఎక్కువ ఫోకస్‌ పెట్టిన అక్షర్‌ పటేల్‌.. చహల్‌, అశ్విన్‌ బౌలింగ్‌లో సుధీర్ఘ ప్రాక్టీస్‌ చేశాడు. ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌ ముగిసిన అనంతరం టీమిండియా సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ ఆడనుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్‌కు బయల్దేరి వెళ్లనుంది. 

చదవండి: T20 World Cup 2022: టి20 ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించిన కివీస్‌

Kohli-Ricky Ponting: 'మూడేళ్ల క్రితం ఈ ప్రశ్న అడిగి ఉంటే..'

మరిన్ని వార్తలు