-

IND Vs AUS: తిప్పేసిన టీమిండియా స్పిన్నర్లు.. 177 పరుగులకే ఆలౌట్‌

10 Feb, 2023 05:45 IST|Sakshi

తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 177 ఆలౌట్‌

రవీంద్ర జడేజాకు 5 వికెట్లు

భారత్‌ 77/1

ఆశ్చర్యమేమీ లేదు... భారత గడ్డపై టెస్టు మ్యాచ్‌లో విదేశీ బ్యాటర్ల పరిస్థితి ఏమిటో కొత్తగా చెప్పాల్సింది లేదు... అందుకు ఆస్ట్రేలియా కూడా మినహాయింపు కాదని మరోసారి రుజువైంది... అంచనాలకు అనుగుణంగానే భారత బౌలర్లు చెలరేగిపోగా, పిచ్‌ను సందేహిస్తూనే బరిలోకి దిగిన కంగారూ బ్యాటింగ్‌ లైనప్‌ కుప్పకూలింది. దాదాపు ఏడు నెలల తర్వాత టెస్టు ఆడిన జడేజా తన స్పిన్‌తో ప్రత్యర్థి పతనాన్ని శాసించగా, అశ్విన్‌ సహకరించాడు. అయితే తొలి 13 బంతుల్లోనే పేసర్లకు 2 వికెట్లు చేజార్చుకొని స్పిన్‌ రాక ముందే ఆసీస్‌ దాసోహమంది. అనంతరం దూకుడైన బ్యాటింగ్‌తో రోహిత్‌ ఆధిపత్యం ప్రదర్శించడంతో బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ తొలి రోజును టీమిండియా తమదిగా మార్చుకుంది. రెండో రోజు పిచ్‌ ఆసీస్‌ స్పిన్నర్లకు ఎలా సహకరిస్తుందో, భారత బ్యాటర్లు ఎంత భారీ స్కోరు చేస్తారనేది ఆసక్తికరం.  

నాగ్‌పూర్‌: ఆస్ట్రేలియాతో ప్రారంభమైన తొలి టెస్టులో మొదటి రోజు భారత్‌ పక్షాన నిలిచింది. ముందు బౌలింగ్‌లో, ఆపై నిలకడైన బ్యాటింగ్‌తో టీమిండియా ఆటను ముగించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 63.5 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌటైంది. మార్నస్‌ లబుషేన్‌ (123 బంతుల్లో 49; 8 ఫోర్లు) టాప్‌ స్కోర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా (5/47) ఐదు వికెట్లతో చెలరేగగా, అశ్విన్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్‌ ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోయి 77 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (69 బంతుల్లో 56 బ్యాటింగ్‌; 9 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం భారత్‌ మరో 100 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది.  

కీలక భాగస్వామ్యం...
టాస్‌ గెలిచిన ప్రయోజనాన్ని ఆస్ట్రేలియా పొందలేకపోయింది. సిరాజ్‌ తన తొలి బంతికే ఖాజా (1)ను ఎల్బీగా అవుట్‌ చేశాడు. అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించినా...రివ్యూలో భారత్‌ ఫలితం సాధించింది. ఆ తర్వాత షమీ వేసిన చక్కటి బంతి వార్నర్‌ (1) స్టంప్స్‌ను ఎగరగొట్టింది. ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్లోనే జడేజాను భారత్‌ బౌలింగ్‌కు దించింది. ఇలాంటి స్థితిలో లబుషేన్, స్టీవ్‌ స్మిత్‌ (107 బంతుల్లో 37; 7 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ కొన్ని చక్కటి షాట్లతో వీరిద్దరు స్కోరు బోర్డును నడిపించారు. లంచ్‌ సమయానికి 76/2 స్కోరుతో ఆసీస్‌ కోలుకున్నట్లుగా అనిపించింది.

టపటపా...
విరామం తర్వాత జడేజా వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి కంగారూల పని పట్టాడు. భరత్‌ చక్కటి స్టంపింగ్‌కు లబుషేన్‌ వెనుదిరగ్గా, రెన్‌షా (0) తొలి బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. లబుషేన్, స్మిత్‌ మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించారు. అక్షర్‌ ఓవర్లో 3 ఫోర్లు కొట్టి జోరు పెంచే ప్రయత్నం చేసిన స్మిత్‌ను కూడా జడేజా బౌల్డ్‌ చేయడంతో ఆసీస్‌ పరిస్థితి మరింత దిగజారింది. దాంతో అలెక్స్‌ క్యారీ (33 బంతుల్లో 36; 7 ఫోర్లు), పీటర్‌ హ్యాండ్స్‌కోంబ్‌ (84 బంతుల్లో 31; 4 ఫోర్లు) కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

ఎదురుదాడికి దిగిన క్యారీ వరుసగా స్వీప్, రివర్స్‌ స్వీప్‌షాట్లతో బౌండరీలు రాబట్టాడు. అయితే అశ్విన్‌ బౌలింగ్‌లో అదే రివర్స్‌స్వీప్‌కు ప్రయత్నించి బౌల్డ్‌ కావడంతో ఆరో వికెట్‌ భాగస్వామ్యం ముగిసింది. హ్యాండ్స్‌కోంబ్, క్యారీ 11.2 ఓవర్లలో 53 పరుగులు జోడించడం విశేషం. ‘టీ’ తర్వాత హ్యాండ్స్‌కోంబ్‌ను జడేజా అవుట్‌ చేయడంతో 200 పరుగుల స్కోరుకు ఆసీస్‌ చాలా దూరంలో ఆగిపోయింది. ఆ జట్టు  15 పరుగుల వ్యవధిలోనే చివరి 5 వికెట్లు చేజార్చుకుంది.  

రోహిత్‌ జోరు...
తొలి రోజు సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు సాధించాలనే ఉద్దేశంతో బరిలోకి దిగిన రోహిత్‌ దానిని తన బ్యాటింగ్‌లో ప్రదర్శించాడు. కమిన్స్‌ వేసిన మొదటి ఓవర్లోనే 3 ఫోర్లు కొట్టిన అతను, ఆ తర్వాత కమిన్స్‌ ఓవర్లోనే మరో 2 ఫోర్లు బాదాడు. ఆట ముగిసే వరకు భారత కెప్టెన్‌ అదే ధాటిని కొనసాగించగా, మరో ఎండ్‌లో కేఎల్‌ రాహుల్‌ (71 బంతుల్లో 20; 1 ఫోర్‌) చాలా జాగ్రత్తగా ఆడాడు. తన 55వ బంతికి గానీ రాహుల్‌ ఫోర్‌ కొట్టలేకపోయా డు. లయన్‌ బౌలింగ్‌లో బౌండరీతో 66 బంతుల్లోనే రోహిత్‌ అర్ధ సెంచరీ పూర్తయింది. అయితే చివర్లో రాహుల్‌ను వెనక్కి పంపి మర్ఫీ కెరీర్‌లో తొలి వికెట్‌ తీయగా, ఆసీస్‌కు కాస్త ఊరట లభించింది.  

స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: వార్నర్‌ (బి) షమీ 1; ఖాజా (ఎల్బీ) (బి) సిరాజ్‌ 1; లబుషేన్‌ (స్టంప్డ్‌) భరత్‌ (బి) జడేజా 49; స్మిత్‌ (బి) జడేజా 37; రెన్‌షా (ఎల్బీ) (బి) జడేజా 0; హ్యాండ్స్‌కోంబ్‌ (ఎల్బీ) (బి) జడేజా 31; క్యారీ (బి) అశ్విన్‌ 36; కమిన్స్‌ (సి) కోహ్లి (బి) అశ్విన్‌ 6; మర్ఫీ (ఎల్బీ) (బి) జడేజా 0; లయన్‌ (నాటౌట్‌) 0; బోలండ్‌ (బి) అశ్విన్‌ 1; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (63.5 ఓవర్లలో ఆలౌట్‌) 177.
వికెట్ల పతనం: 1–2, 2–2, 3–84, 4–84, 5–109, 6–162, 7–172, 8–173, 9–176, 10–177.
బౌలింగ్‌: షమీ 9–4–18–1, సిరాజ్‌ 7–3–30–1, జడేజా 22–8–47–5, అక్షర్‌ 10–3–28–0, అశ్విన్‌ 15.5–2–42–3.  

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ (బ్యాటింగ్‌) 56; రాహుల్‌ (సి) అండ్‌ (బి) మర్ఫీ 20; అశ్విన్‌ (బ్యాటింగ్‌) 0; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (24 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 77.
వికెట్ల పతనం:
1–76.
బౌలింగ్‌: కమిన్స్‌ 4–1–27–0, బోలండ్‌ 3–1–4–0, లయన్‌ 10–3–33–0,
మర్ఫీ 7–0–13–1.

టెస్టులకు ‘శ్రీకారం’
దాదాపు 15 నెలల క్రితం... కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో కోన శ్రీకర్‌ భరత్‌ సబ్‌స్టిట్యూట్‌ వికెట్‌ కీపర్‌గా వ్యవహరించాడు. రెండు క్యాచ్‌లు, ఒక స్టంపింగ్‌తో పాటు బంతి అనూహ్యంగా మలుపులు తిరుగుతున్న పిచ్‌పై అతని అద్భుత కీపింగ్‌ అందరినీ ఆకట్టుకుంది. దురదృష్టవశాత్తూ క్రికెట్‌ గణాంకాల్లో సబ్‌స్టిట్యూట్‌ ప్రదర్శనకు చోటుండదు. ఎట్టకేలకు గురువారం భరత్‌ టెస్టు క్రికెట్‌ ఆడిన 305వ భారత క్రికెటర్‌గా మైదానంలోకి అడుగు పెట్టాడు. సరిగ్గా పదేళ్ల క్రితం తొలి ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ ఆడిన అతను ఇప్పుడు టీమిండియా సభ్యుడయ్యాడు. రంజీ ట్రోఫీలో, భారత ‘ఎ’ జట్టు రెగ్యులర్‌గా అనేక సిరీస్‌లు ఆడిన తర్వాత టెస్టు బరిలోకి దిగిన భరత్‌ తొలి రోజు ఆటలోనే తనదైన ముద్ర వేశాడు. చురుకైన కదలికలతో అతను లబుషేన్‌ను మెరుపు వేగంతో స్టంపౌట్‌ చేసిన క్షణమే ఆటను మలుపు తిప్పింది. ఆంధ్ర క్రికెట్‌లో వివిధ వయో విభాగాల్లో ప్రదర్శన ద్వారా పైకి ఎదిగిన భరత్‌కు దేశవాళీ క్రికెట్‌లో గుర్తింపు తెచ్చుకునేందుకు కొంత సమయం పట్టింది. 86 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లలో ట్రిపుల్‌ సెంచరీ సహా 4707 పరుగులు చేసిన భరత్‌ 2021 ఐపీఎల్‌లో ఒక ఇన్నింగ్స్‌తో అందరి దృష్టిలో పడ్డాడు.

ఢిల్లీపై మ్యాచ్‌లో చివరి బంతికి సిక్స్‌ కొట్టి ఆర్‌సీబీని గెలిపించడం అతని దూకుడైన ఆటను పరిచయం చేసింది. అప్పటినుంచి టీమిండియాలో రెగ్యులర్‌గా మారే అవకాశం ఉన్న కీపర్‌గా అతని పేరుపై పలు మార్లు సెలక్షన్‌ సమావేశాల్లో చర్చ జరిగింది. సాహా రిటైరైతే అతనికి ప్రత్యామ్నాయంగా భరత్‌ ఖాయమని అర్థమైంది. గతంలోనూ సీనియర్‌ టీమ్‌కు ఎంపికైనా, భరత్‌కు మ్యాచ్‌ ఆడే అవకాశం రాలేదు. వికెట్‌ కీపర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ (6 టెస్టులు) తర్వాత భారత టెస్టు జట్టుకు ఎంపికైన ఆంధ్ర ఆటగాడిగా భరత్‌ నిలిచాడు. 2018లో భారత జట్టులోకి ఎంపికయ్యే సమయానికి హనుమ విహారి ఆంధ్ర తరఫున ఆడుతున్నా...అంతకు ముందే 6 సీజన్లు అతను హైదరాబాద్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. వన్డే, టి20 జట్లలో ఇప్పటికే సభ్యుడైన సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా నాగ్‌పూర్‌లో టెస్టులో అరంగేట్రం చేశాడు. మున్ముందు కోన భరత్‌ మరింత మెరుగైన ప్రదర్శనతో సత్తా చాటి జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలని ఆశిద్దాం.
 


‘ఆస్ట్రేలియాతో టెస్టులో అరంగేట్రం చేస్తున్న మన కోన భరత్‌కు నా హార్దికాభినందనలు. తెలుగు జెండా మరింత ఎత్తున రెపరెపలాడు తోంది’ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఈ సందర్భంగా ట్వీట్‌ చేశారు.  

మరిన్ని వార్తలు