Virat Kohli: కోహ్లి ఖాతాలో మరో అరుదైన రికార్డు! ప్రస్తుతానికి పోటీ ఆ ఒక్కడే!

11 Mar, 2023 16:44 IST|Sakshi

India vs Australia, 4th Test- Virat Kohli: టీమిండియా స్టార్‌, అంతర్జాతీయ ‍క్రికెట్‌లో 74 సెంచరీల వీరుడు విరాట్‌ కోహ్లి ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. సొంతగడ్డపై టెస్టుల్లో 4000 పరుగులు పూర్తి చేసుకున్న ఐదో భారత బ్యాటర్‌గా రన్‌మెషీన్‌ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో సొగసరి బ్యాటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌, నయావాల్‌ ఛతేశ్వర్‌ పుజారాను కోహ్లి అధిగమించాడు. పుజారా తర్వాత ఈ జాబితాలో కోహ్లి దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. 

50వ టెస్టు మరింత ప్రత్యేకం
స్వదేశంలో 50వ టెస్టు సందర్భగా ఈ అరుదైన మైలురాయికి చేరుకుని ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టును మరింత ప్రత్యేకం చేసుకున్నాడు. కాగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023 సిరీస్‌లో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్‌ వేదికగా మార్చి 9న నాలుగో టెస్టు మొదలైంది. ఈ క్రమంలో శనివారం(మార్చి 11) నాటి మూడో రోజు ఆటలో భాగంగా 87వ ఓవర్లో కోహ్లి 4000 పరుగుల మార్కు అందుకున్నాడు.

నాథన్‌ లియోన్‌ బౌలింగ్‌లో బౌండరీ బాది ఈ మైలురాయికి చేరుకున్నాడు. శుబ్‌మన్‌ గిల్‌ శతకం(128)తో చెలరేగిన వేళ కోహ్లి సైతం నిలకడగా ఆడుతూ స్కోరు పెంచే బాధ్యత తనపై వేసుకున్నాడు. కాగా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ చేరాలంటే ఆఖరిదైన అహ్మదాబాద్‌ టెస్టులో టీమిండియా తప్పక గెలవాలి.

టెస్టుల్లో సొంతగడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు
1. సచిన్‌ టెండుల్కర్‌- 94 మ్యాచ్‌లలో 7216 పరుగులు
2. రాహుల్‌ ద్రవిడ్‌- 70 మ్యాచ్‌లలో 5598 పరుగులు
3. సునిల్‌ గావస్కర్‌- 65 మ్యాచ్‌లలో 5067 పరుగులు
4. వీరేంద్ర సెహ్వాగ్‌- 52 మ్యాచ్‌లలో 4656 పరుగులు
5. విరాట్‌ కోహ్లి- 50 మ్యాచ్‌లలో 4000+  
6. ఛతేశ్వర్‌ పుజారా- 57 మ్యాచ్‌లలో 3839.

చదవండి: Ind Vs Aus: కోహ్లికి సాధ్యం కాలేదు.. పుజారా సాధించాడు! ‘తొలి బ్యాటర్‌’గా..
Gambhir- Afridi: గంభీర్‌ దగ్గరికి వచ్చి ఆఫ్రిది ఆరా.. వీడియో వైరల్‌! ఫ్యాన్స్‌ ఏమన్నారంటే!

మరిన్ని వార్తలు