Ind Vs Aus: సచిన్‌ రికార్డును సమం చేసేందుకు.. కోహ్లి, రోహిత్‌ పోటాపోటీ! అదే జరిగితే ఇద్దరూ..

17 Mar, 2023 14:39 IST|Sakshi

India VS Australia ODI Series 2023: టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ రికార్డులు అనగానే మొదటగా గుర్తొచ్చేది సెంచరీలు. తన సుదీర్ఘ కెరీర్‌లో మాస్టర్‌ బ్లాస్టర్‌ వంద శతకాలు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. సచిన్‌కు చేరువయ్యే క్రమంలో టీమిండియా రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లి ఇప్పటి వరకు 75 సెంచరీలు బాదాడు. సెంచరీల రికార్డుల్లో సచిన్‌ తర్వాతి స్థానాన్ని ఆక్రమించి సమకాలీన క్రికెటర్లకు సాధ్యం కాని రీతిలో శిఖరాగ్రాన నిలిచాడు.

యాక్టివ్‌ ప్లేయర్లలో ఇంగ్లండ్‌ మాజీ సారథి జో రూట్‌- 45, ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌- 45, టీమిండియా రోహిత్‌శర్మ- 43, ఆసీస్‌ మాజీ సారథి స్టీవ్‌ స్మిత్‌-42 కనీసం శతకాల్లో అర్ధ సెంచరీ మార్కు కూడా అందుకోలేకపోయారు. దీంతో సచిన్‌తో పోటీపడే విషయంలో కోహ్లికి పోటినిచ్చే వాళ్లు ఎవరూ లేకుండాపోయారు.

అయితే, సచిన్‌కు సంబంధించిన ఓ రికార్డు విషయంలో మాత్రం రోహిత్‌ శర్మ కోహ్లితో పోటీపడుతున్నాడు. పటిష్ట ఆస్ట్రేలియాపై పరిమిత ఓవర్ల సిరీస్‌లో సెంచరీ చేయడం అంతతేలికేమీ కాదు. అలాంటి కంగారూ జట్టుపై క్రికెట్‌ దేవుడు సచిన్‌ వన్డేల్లో మొత్తంగా 9 శతకాలు సాధించాడు. ఇక ఆస్ట్రేలియాతో వన్డేల్లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 8, మాజీ సారథి విరాట్‌ కోహ్లి 8 సెంచరీలతో సమానంగా ఉన్నారు.

తాజాగా మార్చి 17- 22 వరకు స్వదేశంలో కంగారూలతో సిరీస్‌లో వీరు శతకం సాధిస్తే సచిన్‌ రికార్డును సమం చేస్తారు. కాగా వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఆసీస్‌తో మొదటి వన్డేకు దూరమైన రోహిత్‌ మరికొంత కాలం వేచి చూడాల్సి ఉండగా.. టెస్టుల్లో సెంచరీతో ఫామ్‌లోకి వచ్చిన కోహ్లి మరోసారి చెలరేగితే రోహిత్‌ కంటే ముందే ఈ ఫీట్‌ అందుకోగలుగుతాడు.

ఇక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023 సిరీస్‌ నేపథ్యంలో తొలి టెస్టులో రోహిత్‌ శర్మ శతకం బాదగా.. ఆఖరిదైన నాలుగో మ్యాచ్‌లో కోహ్లి 186 పరుగులతో చెలరేగిన విషయం తెలిసిందే. అదే ఊపులో తొలి వన్డేలో సెంచరీ బాది ఆసీస్‌పై సచిన్‌ రికార్డును సమం చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

చదవండి: WTC Final: అతడు అత్యుత్తమ బౌలర్‌.. డబ్ల్యూటీసీ ట్రోఫీ గెలిచేది వాళ్లే: ఆసీస్‌ మాజీ కెప్టెన్‌
Ind Vs Aus: నేనెలా అర్హుడిని అవుతాను?! అసలు జట్టులోకి వచ్చే ఆలోచనే ఇప్పట్లో లేదు!

మరిన్ని వార్తలు