IND vs AUS: టీమిండియా ఘోర ఓటమి.. 10 వికెట్ల తేడాతో ఆసీస్ భారీ విజయం

19 Mar, 2023 17:35 IST|Sakshi

విశాఖపట్నం వేదికగా టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను ఆసీస్‌ 1-1తో సమం చేసింది. 118 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌.. వికెట్‌ నష్టపోకుండా 11 ఓవర్లలోనే చేదించింది. ఆస్ట్రేలియా ఓపెనర్లు మిచెల్‌ మార్ష్‌(66 నాటౌట్‌), ట్రావిస్‌ హెడ్‌(51 నాటౌట్‌) మ్యాచ్‌ను ఫినిష్‌ చేశారు. మిచెల్‌ మార్ష్‌ అయితే ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచే భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి.

ఇక అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. ఆసీస్‌ బౌలర్లు నిప్పులు చెరగడంతో కేవలం 117 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్  5వికెట్లతో టీమిండియా వెన్ను విరచగా.. అబాట్‌ మూడు, నాథన్ ఎల్లిస్ రెండు వికెట్లు సాధించారు. కాగా తొలి ఓవర్‌ నుంచే భారత బ్యాటర్లకు ప్రత్యర్ధి పేసర్లు చుక్కలు చూపించారు.

తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ గిల్‌ వికెట్‌ను కోల్పోయిన భారత్‌.. అనంతరం ఏ దశలోనే కోలుకోలేకపోయింది. భారత బ్యాటర్లలో విరాట్‌ కోహ్లి(31) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరిలో అక్షర్‌ పటేల్‌ (29) పరుగులతో రాణించాడు. కాగా ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్ గోల్డన్‌ డక్‌గా వెనుదిరిగాడు. ఇక సిరీస్‌ డిసైడ్‌ చేసే మూడో వన్డే మార్చి 22న చెన్నై వేదికగా జరగనుంది.
చదవండి: IND vs AUS: గోల్డన్‌ డక్‌లు.. సూర్యను పక్కన పెట్టండి!అతడిని జట్టులోకి తీసుకురండి

>
మరిన్ని వార్తలు