Ind Vs Aus 3rd Test: షేన్‌ వార్న్‌ రికార్డు బద్దలు.. నాథన్‌ లియోన్‌ అరుదైన ఘనత.. అగ్రస్థానంలో..

1 Mar, 2023 10:52 IST|Sakshi

Ind Vs Aus 3rd Test Indore Day 1 Nathan Lyon Record: బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023 సిరీస్‌లో భాగంగా టీమిండియాతో మూడో టెస్టులో ఆస్ట్రేలియా స్పిన్నర్లు విజృంభిస్తున్నారు. ఇండోర్‌లో మొదలైన బుధవారం నాటి తొలి రోజు ఆటలో.. ఆరంభంలో పేస్‌కు అనుకూలిస్తుందనుకున్న పిచ్‌పై స్పిన్‌ బౌలర్లు చెలరేగుతున్నారు. స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌, కామెరాన్‌ గ్రీన్‌ ప్రభావం చూపలేకపోయిన వేళ.. మాథ్యూ కుహ్నెమన్‌, నాథన్‌ లియోన్‌ వరుస విరామాల్లో వికెట్లు పడగొడుతున్నారు.

స్పిన్నర్ల విజృంభణ
వీరిద్దరు చెలరేగడంతో మొదటి రోజు ఆటలో 12 ఓవర్లలో టీమిండియా 46 పరుగులు మాత్రమే చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మను అవుట్‌ చేసి కుహ్నెమన్‌ ఆసీస్‌కు శుభారంభం అందించగా.. లియోన్‌ దానిని కొనసాగించాడు. 

వార్న్‌ రికార్డు బద్దలు.. లియోన్‌ అరుదైన ఘనత
భారత ఓపెనర్లు రోహిత్‌, శుబ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ వికెట్లను కుహ్నెమన్‌ తన ఖాతాలో వేసుకోగా.. నాథన్‌ లియోన్‌ ఛతేశ్వర్‌ పుజారా, రవీంద్ర జడేజా వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో జడ్డూను అవుట్‌ చేయడం ద్వారా లియోన్‌ అరుదైన ఘనత సాధించాడు.

ఆసియాలో అత్యధిక వికెట్లు తీసిన పర్యాటక బౌలర్‌గా చరిత్ర సృష్టించాడీ వెటరన్‌ స్పిన్నర్‌. తొలి రెండు మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించిన జడేజా వికెట్‌ తీసి రికార్డు సృష్టించాడు. కాగా ఆసియాలో లియోన్‌కు ఇది 128వ వికెట్‌. ఈ క్రమంలో అతడు ఆసీస్‌ దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు.

ఆసియాలో అత్యధిక వికెట్లు తీసిన విదేశీ బౌలర్లు(ఇప్పటి వరకు)
►నాథన్‌ లియోన్‌ (ఆస్ట్రేలియా స్పిన్నర్‌)- 128
►షేన్‌ వార్న్‌(ఆస్ట్రేలియా స్పిన్నర్‌) 127
►డానియెల్‌ వెటోరీ(న్యూజిలాండ్‌ స్పిన్నర్‌)- 98
►డెయిల్‌ స్టెయిన్‌(సౌతాఫ్రికా పేసర్‌)-92
►జేమ్స్‌ ఆండర్సన్‌(ఇం‍గ్లండ్‌ పేసర్‌)- 82
►కోర్ట్నీ వాల్ష్(వెస్టిండీస్‌ పేసర్‌)- 77

చదవండి: పుజారా చెత్త రికార్డు.. భారత్‌ తరపున రెండో క్రికెటర్‌గా
Steve Smith: 'లెక్క సరిచేస్తా'.. నీకంత సీన్‌ లేదు!

>
మరిన్ని వార్తలు