Rohit Sharma:'నేనే సర్‌ప్రైజ్‌ అయ్యా; అందుకే డీకే.. పంత్‌ కంటే ముందుగా'

24 Sep, 2022 08:23 IST|Sakshi

ఆస్ట్రేలియాతో జరుగుతున్న టి20 సిరీస్‌ను టీమిండియా 1-1తో సమం చేసింది. శుక్రవారం ఆసీస్‌తో జరిగిన రెండో టి20లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం అందుకుంది. రోహిత్‌ శర్మ తన కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో చివరి వరకు నిలిచి జట్టును విజయపథంలో నడిపాడు. అయితే ఆఖర్లో టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోవడంతో కాస్త ఉత్కంఠ నెలకొంది. విజయానికి తొమ్మిది పరుగులు అవసరమైన దశలో క్రీజులోకి వచ్చిన దినేశ్‌ కార్తిక్‌ ఫోర్‌, సిక్స్‌ బాది ఫినిషర్‌ పాత్రను సమర్థంగా పోషించాడు. దీంతో మ్యాచ్‌ భారత్‌ వశమైంది. బ్యాటింగ్‌లో పంత్‌ కంటే ముందు దినేశ్‌ కార్తిక్‌ను పంపించడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. 

ఇదే విషయమై మ్యాచ్‌ విజయం అనంతరం కెప్టెన్‌ రోహిత్‌ మాట్లాడాడు. ''హార్దిక్‌ ఔట్‌ కావడంతో ఆఖరి ఓవర్లో పంత్‌ లేదా కార్తిక్‌లలో ఎవరు బ్యాటింగ్‌ రావాలనే దానిపై కాస్త కన్ఫ్యూజ్‌ అయ్యాను. కానీ చివరికి నా దృష్టి కార్తిక్‌వైపే వెళ్లింది. ఎందుకంటే టి20 ప్రపంచకప్‌లో అతను మాకు ఫినిషర్‌గా ఉపయోగపడనున్నాడు. ఈ సమయంలో కార్తిక్‌ అవసరం అనిపించింది. అందుకే పంత్‌ కంటే ముందు కార్తిక్‌ను బ్యాటింగ్‌కు రమ్మన్నా. ఈ విషయంలో పూర్తి క్లారిటీగా ఉన్నా.

ఇక నా బ్యాటింగ్‌ ప్రదర్శనపై నాకే సర్‌ప్రైజ్‌ అనిపించింది. గత 8-9 నెలలుగా ఇలాంటి హిట్టింగ్‌ కోసం ఎదురుచూశా. దూకుడుగా ఆడాలని ప్లాన్‌ చేసుకోలేదు. కాస్త కుదురుకున్నాకా బ్యాట్‌కు పని చెప్పాలనుకున్నా. కానీ 8 ఓవర్ల మ్యాచ్‌ కావడంతో ఆరంభం నుంచే ఇన్నింగ్స్‌ ధాటిగా ఆడాల్సి వచ్చింది. పరుగుల కంటే బౌండరీలు, సిక్సర్లపైనే ఎక్కువ దృష్టి పెట్టా. ఇక మ్యాచ్‌ విజయం మాకు ఊరటనిచ్చింది. సమిష్టి ప్రదర్శనతో  మా ప్రధాన ఆయుధమైన బుమ్రా మంచి కమ్‌బ్యాక్‌ ఇవ్వడం సంతోషం. అక్షర్‌ పటేల్‌ సహా మా బౌలర్లు అంతా బాగానే బౌలింగ్‌ చేశారు. ఇంకాస్త మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. మూడో టి20లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంటాం'' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: సిక్సర్ల విషయంలో రోహిత్‌ శర్మ సరికొత్త రికార్డు

'జట్టులో పంత్‌ ఎందుకు?'.. డీకే అదిరిపోయే రిప్లై

మరిన్ని వార్తలు