IND vs AUS: ఆస్ట్రేలియాతో రెండో టెస్టు.. టీమిండియాకు బిగ్‌షాక్‌!

14 Feb, 2023 10:22 IST|Sakshi

ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న రెండో టెస్టుకు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత స్టార్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్ రెండో టెస్టుకు కూడా దూరమయ్యాడు. ప్రస్తుతం అయ్యర్‌ ఇంకా నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీలో పునరావసం పొందుతున్నాడు. అతడు ఇంకా పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ సాధించనట్లు బీసీసీఐ వైద్యబృందం వెల్లడించింది.

ఈ క్రమంలో అతడు ఓవరాల్‌గా ఆసీస్‌తో టెస్టు సిరీస్‌ మొత్తానికి దూరమమ్యే సూచనలు కన్పిస్తున్నాయి. అయితే శ్రేయస్‌ మళ్లీ తిరిగి జట్టులో చేరే ముందు  తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అతడు దేశీవాళీ టోర్నీ ఇరానీ కప్‌లో ఆడనున్నట్లు తెలుస్తోంది.  "రెండో టెస్టు జట్టు సెలక్షన్‌కు అయ్యర్‌ అందుబాటులో ఉండడు.

అతడు ఎన్సీఏలో ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అతడు ఇంకా పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించలేదు. అతడు పూర్తి ఫిట్‌నెస్‌ను తిరిగి పొందడానికి మరికొన్ని రోజులు పడుతుంది. అయితే అతడు జట్టుతో కలిసే ముందు ఇరానీ కప్‌లో ఆడే అవకాశం ఉంది. అయితే ఆ నిర్ణయం సెలక్టర్లు చేతిలో ఉంది. కానీ గాయం నుంచి కోలుకున్నాక ఏ ఆటగాడైనా దేశీవాళీ టోర్నీల్లో ఆడితే బాగుంటుంది అని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌ స్పోర్ట్‌తో పేర్కొన్నారు.

కాగా నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో అయ్యర్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఈ నేపథ్యంలో రెండు టెస్టుకు తుది జట్టులో సూర్య స్థానం ప్రశ్నర్థకంగా మారింది.  భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఢిల్లీ వేదికగా శుక్రవారం(ఫిబ్రవరి 17) నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: WPL Auction: వేలంలో అత్యధిక ధర పలికిన టాప్‌-5 క్రికెటర్లు వీరే..

మరిన్ని వార్తలు