Virat Kohli: ఆసీస్‌తో టీ20 సిరీస్‌.. అరుదైన రికార్డుల ముంగిట కోహ్లి! అదే జరిగితే తొలి భారత క్రికెటర్‌గా..

17 Sep, 2022 09:47 IST|Sakshi
విరాట్‌ కోహ్లి

India Vs Australia T20 Series- Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్‌, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి సాధించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే 71 అంతర్జాతీయ శతకాలు నమోదు చేసిన ఈ రన్‌మెషీన్‌.. మరెన్నో అరుదైన ఘనతలు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవల ముగిసిన ఆసియా కప్‌-2022లో భాగంగా అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌ ద్వారా.. టీ20 ఫార్మాట్‌లో సెంచరీ నమోదు చేసిన ఏడో భారత బ్యాటర్‌గా నిలిచాడు.

సురేశ్‌ రైనా, కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ హుడా, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ల తర్వాత ఈ ఘనత అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీకి ముందు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో స్వదేశంలో టీమిండియా వరుస సిరీస్‌లు ఆడనున్న విషయం తెలిసిందే.

అరుదైన రికార్డుల ముంగిట కోహ్లి
ఐసీసీ మెగా ఈవెంట్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో నిర్వహిస్తున్న ఈ సిరీస్‌ నేపథ్యంలో విరాట్‌ కోహ్లి మరో రెండు అరుదైన రికార్డులను సాధించే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో గనుక అతడు.. 98 పరుగులు సాధిస్తే.. టీ20 ఫార్మాట్‌లో 11 వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి భారత బ్యాటర్‌గా నిలుస్తాడు.

తాజా ఫామ్‌ దృష్ట్యా కోహ్లి ఈ రికార్డును సులువుగానే సాధించే అవకాశం ఉంది. కాగా కోహ్లి ఇప్పటి వరకు మొత్తంగా ఈ ఫార్మాట్‌లో 349 మ్యాచ్‌లు ఆడి 10902 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు, 80 అర్ధ శతకాలు ఉన్నాయి. స్ట్రైక్‌ రేటు 132.95.

రాహుల్‌ ద్రవిడ్‌ను అధిగమించే అవకాశం
33 ఏళ్ల ఈ ఢిల్లీ బ్యాటర్‌.. మరో 63 పరుగులు సాధిస్తే టీమిండియా వాల్‌, ప్రస్తుత హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ వ్యక్తిగత పరుగుల రికార్డు(24064)ను అధిగమించే అవకాశం ఉంది. 

తద్వారా టీమిండియా తరఫున సచిన్‌ టెండుల్కర్‌(34357) తర్వాత.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌గా నిలుస్తాడు. కాగా కోహ్లి ఇప్పటి వరకు 468 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 24002 పరుగులు చేశాడు. ఇందులో 71 శతకాలు.. 124 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఇక సెప్టెంబరు 20 నుంచి 25 వరకు భారత్‌- ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌ జరుగనున్న విషయం తెలిసిందే.

చదవండి: Ind Vs Aus: భారత్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా.. పూర్తి షెడ్యూల్‌, జట్లు.. ఇతర వివరాలు!
కడసారి చూపులకు 13 గంటలు నిరీక్షించిన మాజీ కెప్టెన్‌

  

మరిన్ని వార్తలు