-

Virat Kohli: ఆసీస్‌తో టీ20 సిరీస్‌.. నెట్స్‌లో చెమటోడుస్తున్న కోహ్లి! బలహీనత అధిగమించేలా

19 Sep, 2022 13:37 IST|Sakshi

India Vs Australia T20 Series- Virat Kohli- Mohali: ఆస్ట్రేలియాతో టీమిండియా టీ20 సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. మొహాలీ వేదికగా మంగళవారం(సెప్టెంబరు 20) ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆటగాళ్లంతా మొహాలీ చేరుకున్నారు.

ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఆసీస్‌తో సిరీస్‌కు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నాడు. ఇందుకోసం నెట్స్‌లో చెమటోడుస్తున్నాడు. ముఖ్యంగా పుల్‌షాట్ల విషయంలో తన బలహీనతను అధిగమించేలా కోహ్లి ప్రాక్టీసు సాగినట్లు సమాచారం.

45 నిమిషాల పాటు..
ఇందుకు సంబంధించిన వీడియోను పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది. కాగా కోహ్లి దాదాపు 45 నిమిషాల పాటు నెట్స్‌లో గడిపినట్లు తెలుస్తోంది. ఫాస్ట్‌బౌలర్లను ఎదుర్కొంటూ.. పుల్‌షాట్లు ఆడేందుకు కోహ్లి ప్రయత్నించాడు. ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది.

ఇక గత కొన్నాళ్లుగా నిలకడలేమి ఫామ్‌తో ఇబ్బంది పడిన కోహ్లి ఆసియాకప్‌-2022 టీ20 టోర్నీలో అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా అంతర్జాతీయ కెరీర్‌లో 71వ సెంచరీ.. టీ20 ఫార్మాట్‌లో తొలి శతకం సాధించాడు. అదే విధంగా ఈ ఈవెంట్‌లో టీమిండియా తరఫున టాప్‌ స్కోరర్‌(276 పరుగులు)గా నిలిచాడు. ఇదే జోష్‌లో టీ20 వరల్డ్‌కప్‌-2022కు సన్నద్ధమవుతున్నాడు.

అంతకంటే ముందు.. ఈ మెగా టోర్నీ సన్నాహకాల్లో భాగంగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగనున్న టీ20 సిరీస్‌లో ఆడనున్నాడు కోహ్లి. ఇక అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌-2022 ఈవెంట్‌ జరుగనుంది.

చదవండి: Yuvraj Singh Six 6s: యువీ సిక్స్‌ సిక్సర్ల విధ్వంసానికి 15 ఏళ్లు.. కన్నార్పకుండా చూస్తూ మరీ!

మరిన్ని వార్తలు