IND vs BAN 1st ODI: బార్బర్‌ కుటుంబంలో పుట్టి అంతర్జాతీయ క్రికెటర్‌గా.. ఎవరీ కుల్దీప్‌ సేన్‌?

4 Dec, 2022 16:22 IST|Sakshi

ప్రపంచ క్రికెట్‌లో భారత్‌కు అంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎంతో మంది మట్టిలో మాణిక్యాలను ప్రపంచానికి భారత క్రికెట్‌ పరిచయం చేసింది. ఇప్పుడు మరో నిరుపేద కుటంబం నుంచి వచ్చిన ఓ యువకుడు భారత క్రికెట్‌ చరిత్రలో తన పేరును లిఖించేందుకు సిద్దమయ్యాడు.

మధ్యప్రదేశ్‌కు చెందిన యువ పేసర్‌ కుల్దీప్‌ సేన్‌ భారత్‌ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో తొలి వన్డేకు భారత తుది జట్టులో కుల్దీప్‌ సేన్‌కు చోటు దక్కింది. ఒక బార్బర్‌ కుటంబంలో పుట్టి అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగిన కుల్దీప్‌ సేన్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

ఎవరీ కుల్దీప్‌ సేన్‌?
26 ఏళ్ల కుల్దీప్‌ సేన్‌ మధ్యప్రదేశ్‌లో రెవా జిల్లాలోని చిన్న గ్రామం హరిహర్‌పూర్‌లో జన్మించాడు. కుల్దీప్‌ తండ్రి రాంపాల్‌ సేన్‌ తన గ్రామంలోనే చిన్న హెయిర్‌ సెలూన్‌ నడుపుతూ కుటంబాన్ని పోషిస్తున్నాడు. రాంపాల్‌కు ఐదుగురు సంతానం. వారిలో కుల్దీప్‌ సేన్‌ మూడవ వాడు. కుల్దీప్‌ చిన్నతనంలో తినడానికి తిండి కూడా సరిగ్గా లేకపోయేది.

కాగా చిన్నతనం నుంచి కుల్దీప్‌కు క్రికెట్‌ అంటే పిచ్చి. అయితే అతడికి కనీసం క్రికెట్‌ కిట్‌ కూడా కొనిచ్చే స్థోమత తన తండ్రికి లేదు. ఈ సమయంలో కుల్దీప్‌కు క్రికెట్‌పై ఉన్న ఇష్టాన్ని చూసిన ఆంథోనీ అనే కోచ్‌ అతడికి అన్ని విధాలుగా అండగా నిలిచాడు.

కుల్దీప్‌ సేన్‌కు శిక్షణ ఇచ్చేందుకు  ఎలాంటి రుసుము కూడా ఆంథోనీ వసులు చేయలేదు. అతడికి క్రికెట్‌ కిట్స్‌తో పాటు మంచి ఆహారాన్ని కూడా ఆంథోనీ అందించేవాడు. ఇలా ఒక యువ ఫాస్ట్‌ బౌలర్‌ భారత క్రికెట్‌లోకి ఎంట్రీ ఇవ్వడంలో ఆంథోనీ కీలక పాత్ర పోషించాడు.

కుల్దీప్‌ క్రికెట్‌ కెరీర్‌..
కుల్దీప్‌ సరిగ్గా ఒక దశాబ్దం క్రితం వింధ్య క్రికెట్ అకాడమీ క్లబ్‌లో క్రికెట్‌ ఆడటం ప్రారంభించాడు. వింధ్య క్రికెట్ అకాడమీ నిర్వహకులు కూడా కుల్దీప్‌ కుటంబ పరిస్థితి చూసి ఎటువంటి ఫీజ్‌లు  తీసుకోలేదు. ఇక 2018 రంజీట్రోఫీ సీజన్‌లో మధ్యప్రదేశ్‌ తరపున కుల్దీప్‌ ఫస్ల్‌ క్లాస్‌ క్రికెట్‌ అరంగేట్రం చేశాడు. డెబ్యూ సీజన్‌లోనే ఏకంగా 25 వికెట్లు పడగొట్టాడు.

ఇప్పటి వరకు 17 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన కుల్దీప్‌ 52 వికెట్లు సాధించాడు. కుల్దీప్‌ అద్భుతమైన ఔట్‌ స్వింగ్‌ డెలివిరిలను సందించగలడు. గంటకు 140  కి.మీ పైగా వేగంతో కుల్దీప్‌ బౌలింగ్‌ చేయగలడు.  అదే విధంగా అతడు 13 లిస్ట్-ఎ మ్యాచ్‌లు, 30 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. లిస్ట్-ఎ కెరీర్‌లో 25 వికెట్లు, టీ20ల్లో 22 వికెట్లు పడగొట్టాడు.

ఐపీఎల్‌లో ఎంట్రీ
ఇక దేశీవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన కుల్దీప్‌ సేన్ను ఈ ఏడాది ఐపీఎల్‌ మెగా వేలంలో రూ. 20 లక్షలకు రాజస్తాన్‌ రాయల్స్‌ కొనుగోలు చేసింది. అరంగేట్ర సీజన్‌లోనే కుల్దీప్‌ అకట్టుకున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన అతడు 8 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ముఖ్యంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన సేన్‌.. తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక యువ బౌలర్‌కు భారత జట్టులో అవకాశం ఇవ్వడం పట్ల అభిమానులు సంతోషం ‍వ్యక్తం చేస్తున్నారు.


చదవండిND VS BAN 1st ODI: చెత్త ఫామ్‌ను కొనసాగిస్తున్న రోహిత్‌.. వన్డే వరల్డ్‌కప్‌ వరకైనా ఉంటాడా..?

మరిన్ని వార్తలు