IND vs BAN 1st ODI: బంగ్లాదేశ్‌తో తొలి వన్డే.. పంత్‌కు నో ఛాన్స్‌.. ఆ ఆటగాడి అరంగేట్రం!

3 Dec, 2022 14:32 IST|Sakshi

న్యూజిలాండ్‌ పర్యటన ముగిసిన వెంటనే  బంగ్లాదేశ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. బంగ్లా పర్యటనలో భాగంగా భారత జట్టు మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఇప్పటికే బంగ్లా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా.. ప్రా‍క్టీస్‌ సెషన్స్‌లో బిజీబిజీగా గడుపుతోంది.

ఇక మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే డిసెంబర్‌ 4న ఢాకా వేదికగా జరగనుంది. కాగా న్యూజిలాండ్‌ పర్యటనకు దూరమైన టీమిండియా రెగ్యూలర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌ తిరిగి జట్టులోకి వచ్చారు. మరోవైపు ఈ సిరీస్‌కు టీమిండియా వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్థానంలో యువ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది.

ఇక తొలి వన్డేలో భారత తరపున రజిత్‌ పాటిదర్‌ అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అదే విధంగా వరుసగా విఫలమవుతున్న పంత్‌ స్థానంలో పాటిదర్‌ అవకాశం ఇవ్వాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు సమాచారం. వికెట్‌ కీపర్‌ బాధ్యతలు భారత వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

అదే విధంగా రాహుల్‌ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. రోహిత్‌ శర్మ, ధావన్‌ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నారు. ఇక ఫస్ట్‌ డౌన్‌లో విరాట్‌ కోహ్లి, సెకెండ్‌ డౌన్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌కు వచ్చే ఛాన్స్‌ ఉంది. బౌలింగ్‌ విషయానికి వస్తే ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేస్‌ బౌలర్లతో భారత్‌ బరిలోకి దిగే అవకాశం ఉంది. షమీ స్థానంలో జట్టులోకి వచ్చిన ఉమ్రాన్‌ మాలిక్‌కు తుది జట్టులో ఛాన్స్‌ ఉంది. 

భారత తుది జట్టు (అంచనా)
శిఖర్ ధావన్, రోహిత్ శర్మ (కెప్టెన్‌), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్(వికెట్‌ కీపర్‌), రజిత్‌ పాటిదర్‌, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, ఉమ్రాన్‌ మాలిక్‌, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్
చదవండి: IND vs BAN: దీపక్‌ చాహర్‌కు చేదు అనుభవం.. కనీసం ఫుడ్‌ కూడా లేదంటూ మండిపాటు

మరిన్ని వార్తలు