IND VS BAN 1st ODI: చెత్త ఫామ్‌ను కొనసాగిస్తున్న రోహిత్‌.. వన్డే వరల్డ్‌కప్‌ వరకైనా ఉంటాడా..?

4 Dec, 2022 15:52 IST|Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇటీవలి కాలంలో వరుసగా విఫలమవుతుండటం భారత క్రికెట్‌ అభిమానులకు చెడ్డ చిరాకు తెప్పిస్తుంది. పేరుకు కెప్టెన్‌ కానీ.. ఈ బాధ్యతలు చేపట్టాక అతని వైఫల్యాల రేటు మరింత పెరిగింది. ఈ ఫార్మాట్‌, ఆ ఫార్మాట్‌ అని తేడా లేకుండా అన్నింటిలోనూ హిట్‌మ్యాన్‌ దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ ఏడాది అతని ట్రాక్‌ రికార్డు చూస్తే ఈ విషయం ఇట్టే అర్ధమవుతుంది. 

ఈ ఏడాది 3 టెస్ట్‌ ఇన్నింగ్స్‌లు (శ్రీలంక) ఆడిన హిట్‌మ్యాన్‌.. 30 సగటున కేవలం 90 పరుగులు (29, 15, 46) మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క అర్ధసెంచరీ కూడా లేదు. వన్డేల విషయానికొస్తే.. ఈ ఏడాది (ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి వన్డే కలుపుకుని) ఇప్పటివరకు 8 వన్డేలు ఆడిన రోహిత్‌.. 32 సగటున 235 పరుగులు (27, 17, 0, 76, 13, 5, 60, 37) చేశాడు. ఇందులో రెండు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

ఈ ఏడాది పొట్టి క్రికెట్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన హిట్‌మ్యాన్‌.. ఈ ఫార్మాట్‌లో మరింత​ చెత్త గణాంకాలు నమోదు చేశాడు. తాజాగా ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌తో కలుపుకుని ఈ ఏడాది మొత్తం 29 మ్యాచ్‌లు ఆడిన అతను.. 134 స్ట్రయిక్‌ రేట్‌తో 656 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో మూడు సార్లు మాత్రమే హాఫ్‌ సెంచరీ మార్కు దాటాడు. వరల్డ్‌కప్‌లో నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ మినహాయించి అన్ని మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. 

ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి వన్డేలోనూ తన వైఫల్యాల పరంపరను కొనసాగించిన టీమిండియా కెప్టెన్‌.. ఈ మ్యాచ్‌లో 31 బంతులను ఎదుర్కొని 4 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 27 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ వరుస వైఫల్యాల నేపథ్యంలో హిట్‌మ్యాన్‌ దారణమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాడు. కెప్టెన్సీ కథ దేవుడెరుగు, వన్డే వరల్డ్‌కప్‌ వరకు కనీసం జట్టులోనైనా కొనసాగుతాడా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు అన్న పేరుతో ఇప్పటికే టీ20ల్లో హిట్‌మ్యాన్‌ స్థానానికి ఎసరుపెట్టిన బీసీసీఐ.. ఇదే ఫామ్‌ కొనసాగిస్తే వన్డేలు, టెస్ట్‌ల నంచి కూడా తప్పించి ఇంట్లో కూర్చోబెడుతుందని ఫ్యాన్స్‌ హెచ్చరిస్తున్నారు. అయితే, కెప్టెన్సీ విషయంలో, జట్టులో స్థానం విషయంలో రోహిత్‌ అభిమానులు మాత్రం అతనికి అండగా ఉన్నారు. అతను ఎంత​ చెత్త ఫామ్‌లో ఉన్నా అతనికి మద్దతు కొనసాగిస్తున్నారు. త్వరలో హిట్‌మ్యాన్‌ కూడా కోహ్లి లాగే పుంజుకుంటాడని, రోహిత్‌ ఫామ్‌లోకి వస్తే అతన్ని ఆపడం ఎవ్వరి తరం కాదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, 3 వన్డేల సిరీస్‌లో భాగంగా ఢాకాలోని షేర్‌ ఏ బంగ్లా స్టేడియంలో బంగ్లాదేశ్‌తో ఇవాళ (డిసెంబర్‌ 4) జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా బ్యాటింగ్‌లో ఘోర వైఫల్యం చెందింది. టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. బంగ్లా బౌలర్లు షకీబ్‌ అల్‌ హసన్‌ (5/36), ఎబాదత్‌ హొస్సేన్‌ (4/47) దెబ్బకు 186 పరుగులకే (41.2 ఓవర్లలో) చాపచుట్టేసింది.

భారత బ్యాటర్లలో కేఎల్‌ రాహుల్‌ (70 బంతుల్లో 73; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మినహా అందరూ దారుణంగా విఫలమయ్యారు. శిఖర్‌ ధవన్‌ (7), కోహ్లి (9), షాబాజ్‌ అహ్మద్‌ (0), శార్ధూల్‌ ఠాకూర్‌ (2), దీపక్‌ చాహర్‌ (0), సిరాజ్‌ (9) పెవిలియన్‌కు క్యూ కట్టారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (27), శ్రేయస్‌ అయ్యర్‌ (24), వాషింగ్టన్‌ సుందర్‌ (19) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేయగలిగారు.

మరిన్ని వార్తలు