IND Vs BAN: నిప్పులు చెరిగిన సిరాజ్‌, తిప్పేసిన కుల్దీప్‌.. ముగిసిన రెండో రోజు ఆట

15 Dec, 2022 17:04 IST|Sakshi

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో రెండు రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌ టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు 271 పరుగుల వెనుకంజలో ఉంది. మెహిది హసన్‌ (16), ఎబాదత్‌ హొస్సేన్‌ (13) క్రీజ్‌లో ఉన్నారు. కుల్దీప్‌ యాదవ్‌ (4/26), మహ్మద్‌ సిరాజ్‌ (3/14), ఉమేశ్‌ యాదవ్‌ (1/33) ధాటికి బంగ్లా ప్లేయర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.

తొలి బంతికే వికెట్‌ కోల్పోయిన బంగ్లాదేశ్‌.. ఆతర్వాత వరుస విరామాల్లో వికెట్లు చేజార్చుకుంది. 102 పరుగుల వద్ద ఆ జట్టు ఎనిమిదో వికెట్‌ కోల్పోగా.. మెహిది హసన్‌, ఎబాదత్‌ హొస్సేన్‌ 9వ వికెట్‌కు 21 పరుగులు జోడించి జట్టును గట్టెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

అంతకుముందు భారత్‌.. తమ తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులకే ఆలౌటైంది. పుజారా (90), శ్రేయస్‌ అయ్యర్‌ (86), అశ్విన్‌ (58) అర్ధసెంచరీలతో రాణించగా.. పంత్‌ (46), కుల్దీప్‌ యాదవ్‌ (40) పర్వాలేదనిపించారు.

ఆఖర్లో ఉమేశ్‌ యాదవ్‌ (15 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్‌ ఇస్లాం, మెహిది హసన్‌ తలో 4 వికెట్లు.. ఎబాదత్‌ హొస్సేన్‌, ఖలీద్‌ అహ్మద్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌ మరో 3 రోజులు మిగిలి ఉండటంతో ఫలితం తేలడం ఖాయంగా కనిపిస్తుంది. 

మరిన్ని వార్తలు