IND VS BAN 1st Test: బంగ్లాదేశ్‌కు భారీ షాక్‌

13 Dec, 2022 18:21 IST|Sakshi

2 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా చట్టోగ్రామ్‌ వేదికగా భారత్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య రేపటి (డిసెంబర్‌ 14) నుంచి తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభంకానుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌ ఉదయం 9 గంటలకు స్టార్ట్‌ అవుతుంది. వన్డే సిరీస్‌ గెలిచిన ఉత్సాహంలో ఆతిధ్య బంగ్లాదేశ్‌ ఉరకలేస్తుండగా.. ఎలాగైనా టెస్ట్‌ సిరీస్‌ గెలిచి పరువు కాపాడుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది.

ఈ మ్యాచ్‌లో టీమిండియా కేఎల్‌ రాహుల్‌ నేతృత్వంలో బరిలోకి దిగుతుండగా, బంగ్లాదేశ్‌.. షకీబ్‌ అల్‌ హసన్‌ సారధ్యంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇవాళ జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌ సందర్భంగా బంగ్లా కెప్టెన్‌ గాయపడినప్పటికీ, అతని గాయం అంత తీవ్రమైందని కాదని తేలడంతో బంగ్లా అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. 

షకీబ్‌ గాయంపై క్షేమ సమాచారం అందుకున్న బంగ్లా అభిమానులకు ఈ వార్త తెలిసే లోపే మరో షాకింగ్‌ న్యూస్‌ అందింది. ఆ జట్టు స్టార్‌ ఫాస్ట్‌ బౌలర్‌ టస్కిన్‌ అహ్మద్‌ తొలి టెస్ట్‌కు అందుబాటులో ఉండడని ఆ జట్టు కోచ్‌ రస్సెల్‌ డొమింగో స్పష్టం చేశాడు. టీమిండియాతో వన్డే సిరీస్‌ సందర్భంగా గాయపడిన టస్కిన్‌ పూర్తిగా కోలుకోలేదని, ఈ పరిస్థితుల్లో అతన్ని బరిలోకి దించే రిస్క్‌ చేయలేమని డొమింగో తెలిపాడు. 

ఇటీవలి కాలంలో టస్కిన్‌.. బంగ్లాదేశ్‌ కీలక బౌలర్‌గా ఎదిగాడు. బంగ్లా తరఫున 11 టెస్ట్‌లు, 52 వన్డేలు, 46 టీ20లు ఆడిన టస్కిన్‌.. మొత్తం 130 వికెట్లు పడగొట్టాడు. 

ఇదిలా ఉంటే, ఇవాళ జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌ సందర్భంగా టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ దెబ్బకు బంగ్లా కెప్టెన్‌ షకీబ్‌ అల్ హసన్‌ ఆసుపత్రి బాట పట్టాడు. ప్రాక్టీస్‌లో భాగంగా ఉమ్రాన్ వేసిన ఓ బంతి షకీబ్‌ ఛాతికి బలంగా తాకడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆ సమయానికి స్టేడియంకి సంబంధించిన ఎలాంటి వాహనాలు లేకపోవడంతో షకీబ్‌ను ఆంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. 

భారత్‌: శుభ్‌మన్‌ గిల్‌, అభిమన్యు ఈశ్వరన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, చతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లి, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, సౌరభ్‌ కుమార్‌, కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), శ్రీకర్‌ భరత్‌ (వికెట్‌కీపర్‌), రిషబ్‌ పంత్‌, కుల్దీప్‌ యాదవ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, నవ్‌దీప్‌ సైనీ  

బంగ్లాదేశ్‌: మహ్మదుల్‌ హసన్‌ జాయ్‌, మొమినుల్‌ హాక్‌, నజ్ముల్‌ హొసేన్‌ షాంటో, యాసిర్‌ అలీ, షకీబ్‌ అల్‌ హసన్‌ (కెప్టెన్‌), లిట్టన్‌ దాస్‌, నురుల్‌ హసన్‌, జాకీర్‌ హసన్‌, మెహిది హసన్ మీరజ్‌, అనాముల్‌ హాక్‌, తైజుల్‌ ఇస్లాం, టస్కిన్‌ అహ్మద్‌, ఖలీద్‌ అహ్మద్‌, షొరీఫుల్‌ ఇస్లాం, ఎబాదత్‌ హొస్సేన్‌, రహ్మాన్‌ రజా 
 

మరిన్ని వార్తలు