IND Vs BAN: షమీకి గాయం.. అతడి స్థానంలో యంగ్‌ బౌలర్‌.. బీసీసీఐ ప్రకటన

3 Dec, 2022 11:19 IST|Sakshi
మహ్మద్‌ షమీ

India Tour Of Bangladesh 2022: బంగ్లాదేశ్‌తో తొలి వన్డేకు ముందు భారత జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జట్టు వెటరన్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీ గాయం కారణంగా సిరీస్‌ మొత్తానికి దూరమమ్యాడు. దీంతో అతడి స్థానంలో యువ పేస్‌ సంచలనం ఉమ్రాన్ మాలిక్‌కు టీమిండియాలో చోటు దక్కింది. ఈ విషయాన్ని బీసీసీఐ శనివారం వెల్లడించింది.

బీసీసీఐ కార్యదర్శి జై షా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.  ఈ మేరకు.. "బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు ముందు ప్రాక్టీస్‌ సెషన్‌లో పేసర్‌ మహ్మద్‌ షమీ భుజానికి గాయమైంది. అతడు ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో బీసీసీఐ టీమిండియావైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు.

దీంతో అతడు బంగ్లాతో వన్డే సిరీస్‌కు దూరం కానున్నాడు. ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ షమీ స్థానంలో ఉమ్రాన్ మాలిక్‌ను ఎంపిక చేసింది" అని జై షా పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం భారత్‌లో ఉన్న మాలిక్‌ ఆదివారం జట్టుతో కలిసే అవకాశం ఉంది. ఇక గాయపడిన మహ్మద్‌ షమీ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందనున్నాడు.

ఇప్పటికే టీ20లలో టీమిండియా తరఫున ఎంట్రీ ఇచ్చిన ఉమ్రాన్‌ ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌తో వన్డేల్లో అడుగుపెట్టాడు. కివీస్‌తో మొదటి వన్డేలో రెండు వికెట్లు పడగొట్టగా.. వర్షం కారణంగా రద్దైన మూడో వన్డేలో ఒక వికెట్‌ సాధించాడు. ఇదిలా ఉంటే.. బంగ్లా పర్యటనలో భాగంగా భారత్‌తో బంగ్లాదేశ్‌ మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది.  ఆదివారం(డిసెంబర్‌ 4)న జరగనున్న తొలి వన్డేతో ఈ టూర్‌ ప్రారంభం కానుంది.
చదవండి: IND-W vs AUS-W: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌.. టీమిండియాలో ఆదోని అమ్మాయి

మరిన్ని వార్తలు