Ind Vs Ban: పాక్ అవుట్‌.. మరి టీమిండియా? ఫైనల్‌ రేసులో నిలవాలంటే అదొక్కటే దారి!

13 Dec, 2022 10:14 IST|Sakshi
ప్రాక్టీసులో టీమిండియా (PC: BCCI)

Bangladesh vs India, 1st Test- World Test Championship 2021-23- చటోగ్రామ్‌: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనలే లక్ష్యంగా పెట్టుకున్న తమకు ప్రతీ టెస్టు మ్యాచ్‌ కీలకమని భారత తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు 14 నుంచి ఇక్కడే జరుగుతుంది. సోమవారం టెస్టు సిరీస్‌ ట్రోఫీని బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్, భారత సారథి కేఎల్‌ రాహుల్‌ ఆవిష్కరించారు.

రేసులో నిలవాలంటే..
ఈ సందర్భంగా రాహుల్‌ మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించాడు. ‘డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసులో నిలవాలంటే మేం దూకుడు కొనసాగించాలి. ప్రతీ మ్యాచే కాదు... మ్యాచ్‌లోని ప్రతీ రోజు, ప్రతీ సెషన్‌పై బేరీజు వేసుకొని ముందుకు సాగుతాము’ అని రాహుల్‌ అన్నాడు.

రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ గాయంతో దూరం కావడంపై రాహుల్‌ స్పందిస్తూ... ‘కెప్టెన్‌ రోహిత్‌ జట్టులో కీలకమే కాదు... ఎంతో అనుభవజ్ఞుడైన ఆటగాడు. తొలి టెస్టుకు అతడు లేకపోవడం లోటే! అయితే రెండో టెస్టుకల్లా అతను కోలుకుంటాడని ఆశిస్తున్నాం’ అని అన్నాడు.    

పాక్‌ అవుట్‌... మరి టీమిండియా?
వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ 2021-23 సీజన్‌లో ప్రస్తుతం భారత్‌ 52.08 శాతం పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా (75 శాతం), దక్షిణాఫ్రికా (60 శాతం) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఫైనల్‌ రేసులో నిలవాలంటే బంగ్లాదేశ్‌ పర్యటన సహా స్వదేశంలో వచ్చే ఏడాది జరుగనున్న ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లోనూ మెరుగైన ప్రదర్శన కనబరచాలి.

వరుస విజయాలు సాధిస్తే గనుక ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా టాప్‌-2కు చేరుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు.. స్వదేశంలో రెండో టెస్టులోనూ ఇంగ్లండ్‌ చేతిలో ఓటమిపాలైన పాకిస్తాన్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసు నుంచి నిష్క్రమించింది. ఇక ఇప్పటికే 2-0తో టెస్టు సిరీస్‌ గెలిచిన స్టోక్స్‌ బృందం 22 ఏళ్ల తర్వాత పాక్‌ గడ్డపై ఈ ఫీట్‌ నమోదు చేసింది.

చదవండి: బంగ్లాతో తొలి టెస్ట్‌.. పంత్‌కు భారీ షాకిచ్చిన బీసీసీఐ, అతడి స్థానంలో..!
IND vs BAN: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. అక్షర్‌కు నో ఛాన్స్‌! ఆల్‌రౌండర్‌ అరంగేట్రం

మరిన్ని వార్తలు