IND vs BAN 2nd Test: భారత బౌలర్లదే పైచేయి

23 Dec, 2022 05:19 IST|Sakshi
అశ్విన్, ఉమేశ్, కేఎల్‌ రాహుల్‌

తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ 227 ఆలౌట్‌

మోమినుల్‌ హక్‌ అర్ధ సెంచరీ

చెరో 4 వికెట్లు తీసిన ఉమేశ్, అశ్విన్‌

తొలి రోజు భారత్‌ 19/0  

ఒకవైపు ఉమేశ్, ఉనాద్కట్‌ పదునైన పేస్‌... మరోవైపు అనుభవజ్ఞుడైన అశ్విన్‌ స్పిన్‌ తంత్రం... వెరసి రెండో టెస్టులో తొలి రోజే బంగ్లాదేశ్‌ కుప్పకూలింది. భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేని ఆతిథ్య జట్టు కనీస స్కోరు కూడా సాధించలేక చతికిలపడింది. మోమినుల్‌ హక్‌ పోరాటం మినహా జట్టు బ్యాటింగ్‌లో చెప్పుకోదగ్గ విశేషమేమీ లేకపోయింది.

గత టెస్టుతో పోలిస్తే అశ్విన్‌ మెరుగైన ప్రదర్శన ఇవ్వగా, ఉపఖండం పిచ్‌లపై ఉమేశ్‌ మళ్లీ సత్తా చాటాడు. పుష్కరకాలం తర్వాత టెస్టు ఆడిన ఉనాద్కట్‌ కూడా రెండు వికెట్లతో సంతృప్తిగా ముగించాడు. ఆపై టీమిండియా వికెట్‌ కోల్పోకపోయినా... ఆడిన 9 ఓవర్లలోనే ఎన్నో సార్లు బంతి అనూహ్యంగా స్పందించడంతో ఓపెనర్లు ఉత్కంఠభరిత క్షణాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనిని చూస్తే రెండో రోజు ఆట భారత బ్యాటింగ్‌కు సవాల్‌ విసిరేలా ఉంది.

మిర్పూర్‌: భారత్‌తో గురువారం మొదలైన రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ పేలవ బ్యాటింగ్‌ ప్రదర్శన కొనసాగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ 73.5 ఓవర్లలో 227 పరుగులకే ఆలౌటైంది. మోమినుల్‌ హక్‌ (157 బంతుల్లో 84; 12 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. భారత్‌ బౌలర్లలో ఉమేశ్‌ యాదవ్, అశ్విన్‌ చెరో 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్‌ ఆట ముగిసే సమయానికి 8 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 19 పరుగులు చేసింది.   

షకీబ్‌ విఫలం...
బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌లో 40 పరుగులకు పైగా నమోదైన భాగస్వామ్యాలు నాలుగు కాగా, అత్యధికం 48 మాత్రమే! ఇదీ ఆ జట్టు బ్యాటింగ్‌ పరిస్థితిని చూపిస్తోంది. ఒక్కో జోడీ నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉండగానే భారత బౌలర్లు వికెట్‌ తీసి బంగ్లాకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. మొత్తంగా చూస్తే జట్టు ఇన్నింగ్స్‌ ఏ దశలోనూ భారీ స్కోరు దిశగా వెళ్లలేదు. ఓపెనర్లు నజ్ముల్‌ హొస్సేన్‌ (24), జాకీర్‌ హసన్‌ (15) ఆరంభంలో కొంత జాగ్రత్త ప్రదర్శించినా... అదీ ఎక్కువ సేపు సాగలేదు.

‘0’ వద్ద జాకీర్‌ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేసినా దాని వల్ల భారత్‌కు పెద్దగా నష్టం జరగలేదు. జాకీర్‌ను అవుట్‌ చేసి ఉనాద్కట్‌ టెస్టుల్లో తొలి వికెట్‌ సాధించాడు. అదే స్కోరు వద్ద నజ్ముల్‌ కూడా అవుట్‌ కాగా... లంచ్‌ సమయానికి బంగ్లా స్కోరు 82/2కు చేరింది. అయితే విరామం తర్వాత తొలి బంతికే చెత్త షాట్‌ ఆడిన షకీబ్‌ (16) నిష్క్రమించాడు. మరోవైపు మోమిన్‌ మాత్రం పట్టుదలగా నిలబడి కొన్ని చక్కటి షాట్లతో పరుగులు రాబట్టే ప్రయత్నం చేశాడు.

అతనికి కొద్ది సేపు ముష్ఫికర్‌ రహీమ్‌ (26) సహకరించాడు.అశ్విన్‌ ఓవర్లో ముష్ఫికర్‌ వరుసగా మూడు ఫోర్లు కొట్టడం సహా ఒక దశలో పది బంతుల వ్యవధిలో వీరిద్దరు ఆరు ఫోర్లు బాదడం విశేషం. ఈ జోడీని జైదేవ్‌ ఉనాద్కట్‌ విడదీయగా... సిరాజ్‌ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టి దూకుడు ప్రదర్శించిన లిటన్‌ దాస్‌ (25) దానిని భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యాడు.

ఆ తర్వాత కొద్ది సేపటికి 78 బంతుల్లో మోమినుల్‌ అర్ధసెంచరీ పూర్తయింది. టీ బ్రేక్‌ తర్వాత ఒకదశలో బంగ్లా 213/5తో మెరుగైన స్థితిలోనే  ఉంది. అయితే భారత బౌలర్లు చెలరేగడంతో మరో 14 పరుగులకే ఆ జట్టు తర్వాతి ఐదు వికెట్లు కోల్పోయింది. అనంతరం ఎనిమిది ఓవర్ల ఆటలో భారత్‌ వికెట్‌ తీయడంలో బంగ్లాదేశ్‌ బౌలర్లు సఫలం కాలేకపోయారు.

స్కోరు వివరాలు
బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌: నజ్ముల్‌ (ఎల్బీ) (బి) అశ్విన్‌ 24; జాకీర్‌ (సి) రాహుల్‌ (బి) ఉనాద్కట్‌ 15; మోమినుల్‌ (సి) పంత్‌ (బి) అశ్విన్‌ 84; షకీబ్‌ (సి) పుజారా (బి) ఉమేశ్‌ 16; ముష్ఫికర్‌ (సి) పంత్‌ (బి) ఉనాద్కట్‌ 26; లిటన్‌ దాస్‌ (సి) రాహుల్‌ (బి) అశ్విన్‌ 25; మెహదీ హసన్‌ (సి) పంత్‌ (బి) ఉమేశ్‌ 15; నూరుల్‌ (ఎల్బీ) (బి) ఉమేశ్‌ 6; తస్కీన్‌ (సి) సిరాజ్‌ (బి) ఉమేశ్‌ 1; తైజుల్‌ (నాటౌట్‌) 4; ఖాలెద్‌ (సి) ఉనాద్కట్‌ (బి) అశ్విన్‌ 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (73.5 ఓవర్లలో ఆలౌట్‌) 227.
వికెట్ల పతనం: 1–39, 2–39, 3–82, 4–130, 5–172, 6–213, 7–219, 8–223, 9–227, 10–227.
బౌలింగ్‌: సిరాజ్‌ 9–1–39–0, ఉమేశ్‌ యాదవ్‌ 15–4–25–4, జైదేవ్‌ ఉనాద్కట్‌ 16–2–50–2, అశ్విన్‌ 21.5–3– 71–4, అక్షర్‌ 12–3–32–0.  

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రాహుల్‌ (బ్యాటింగ్‌) 3; గిల్‌ (బ్యాటింగ్‌) 14; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (8 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా) 19.
బౌలింగ్‌: తస్కీన్‌ 4–2–8–0, షకీబ్‌ 4–2–11–0.

మరిన్ని వార్తలు