Ind VS Ban 2nd Test: ‘సై అంటే సై’ అనేలా ఆట.. టీమిండియా ఖాతాలో అరుదైన రికార్డు

26 Dec, 2022 09:54 IST|Sakshi

Bangladesh vs India, 2nd Test: భారత్‌ లక్ష్యం 145... ఓవర్‌నైట్‌ స్కోరు 45/4... ఇంకా 100 పరుగుల గెలుపు దారిలో చేతిలో 6 వికెట్లున్న జట్టుకు లక్ష్యఛేదన ఏమంత కష్టం కాదు... కానీ అదే జట్టు 74/7 స్కోరు వద్ద కష్టాల్లో పడితే మాత్రం గెలుపు అసాధ్యం. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్‌ బంగ్లాదేశ్‌దే అవుతుంది. సిరీస్‌ 1–1తో సమం అవుతుంది.

కానీ శ్రేయస్‌ అయ్యర్, అశ్విన్‌ అసాధారణ పోరాటంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఓడిపోవాల్సిన మ్యాచ్‌ను, పంచుకోవాల్సిన సిరీస్‌ను అబేధ్యమైన భాగస్వామ్యంతో భారత్‌ వశం చేశారు.   

మిర్పూర్‌: ఇది కదా ఆటంటే! ఇదే కదా టెస్టులకు కావాల్సింది. సంప్రదాయ ఫార్మాట్‌కు ఊపిరిపోసేలా ‘సై అంటే సై’ అన్నట్లు సాగింది. బంగ్లాదేశ్‌ స్పిన్నర్‌ మెహిదీ హసన్‌ మిరాజ్‌ (5/63) వికెట్ల వేటలో ముందున్నాడు. చిన్నదే అయినా లక్ష్యఛేదనలో భారత్‌ వెనుకబడింది. ఇంకా చెప్పాలంటే ఓ దశలో ఓటమికి టీమిండియా దగ్గరైంది.

మిరాజ్‌ వన్డే సిరీస్‌లో ఎలా చెలరేగాడో (బ్యాటింగ్‌లో) కళ్లముందు మెదులుతోంది. ఈసారి బంతితో టెస్టు రాతను మార్చేపనిలో పడ్డాడు. కానీ ఇద్దరు కలిసి ఆ ఒక్కడి వేటను అడ్డుకున్నారు. శ్రేయస్‌ అయ్యర్‌ (46 బంతుల్లో 29 నాటౌట్‌; 4 ఫోర్లు), అశ్విన్‌ (62 బంతుల్లో 42 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌)ల పోరాటం... ఇరు జట్లను దోబూచులాడిన విజయాన్ని చివరకు భారత్‌వైపు మళ్లించింది.

ఇద్దరు కలిసికట్టుగా... గెలిచేదాకా మెహిదీ హసన్‌ స్పిన్‌కు ఎదురొడ్డారు. దీంతో చివరిదైన రెండో టెస్టులో భారత్‌ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సిరీస్‌ను 2–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. అశ్విన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, పుజారాకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు లభించాయి.  

మిరాజ్‌ స్పిన్‌ ఉచ్చులో... 
నాలుగో రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 45/4 వద్ద మొదలైన భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ను బంగ్లా శిబిరం అష్టకష్టాల పాలుజేసింది. తొలి అర్ధగంటలో అయితే పదేపదే అప్పీళ్లతో మన బ్యాటర్లను బెంబేలెత్తించిన ఆతిథ్య జట్టు రెండు రివ్యూలు తీసుకొని ఆ డోస్‌ పెంచింది. ఆపై స్పిన్‌ ఉచ్చులో పడేసి 3 వికెట్లను కూడా పడేసింది.

ఓవర్‌నైట్‌ బ్యాటర్లు అక్షర్‌ పటేల్‌ (88 బంతుల్లో 34; 4 ఫోర్లు), జైదేవ్‌ ఉనాద్కట్‌ (13; 1 సిక్స్‌)లతో పాటు ఆదుకుంటాడనుకొని గంపెడాశలు పెట్టుకున్న రిషభ్‌ పంత్‌ (9; 1 ఫోర్‌)ను ఆరంభంలోనే అవుట్‌ చేశారు. ఈ ముగ్గురిలో ఉనాద్కట్‌ను షకీబ్‌ పెవిలియన్‌ చేర్చగా, మిగతా రెండు వికెట్లు మెహిదీ హసన్‌ మిరాజ్‌ ఖాతాలోకే వెళ్లాయి. అప్పుడు భారత్‌ స్కోరు 74/7. ఆట మొదలైన 6.3 ఓవర్లలోనే ఇదంతా జరిగింది.

ఇక మిగిలిన వికెట్లు 3 అయితే... స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఒక్కడే! మిగతా వారు టెయిలెండర్లు! ఇలాంటి దశలో ఇంకా 71 పరుగులు భారత్‌ను ఓటమి ముంగిట నిలబెట్టాయి. బంగ్లా విజయం ఖాయం అనుకోగా... అశ్విన్, అయ్యర్‌ ఏకంగా 17.3 ఓవర్లు అసాధారణ పోరాటం చేశారు. అబేధ్యమైన ఎనిమిదో వికెట్‌కు 71 పరుగులు జోడించి బంగ్లా చేతుల దాకా వచ్చిన విజయాన్ని తమ చేతలతో లాక్కున్నారు.

ఆదివారం ఉదయం స్పిన్‌కు దాసోహమైన పిచ్‌పై అయ్యర్‌–అశ్విన్‌ బ్యాటింగ్‌ అద్భుతంగా సాగింది. వికెట్లకు నేరుగా టర్న్‌ అవుతున్న బంతుల్ని అశ్విన్‌ చక్కగా కాచుకొని బ్యాటింగ్‌ చేశాడు. మెహిదీ వేసిన 47వ ఓవర్లో సిక్స్, రెండు బౌండరీలతో అశ్విన్‌ మ్యాచ్‌ ముగించిన తీరు కూడా చూడ ముచ్చటగా ఉంది. ఈ క్రమంలో రెండో టెస్టు గెలవడం ద్వారా సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా మరో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకుంది.

మూడో జట్టుగా...
హోరాహోరీ పోరులో నాలుగు రోజుల్లోనే టెస్టు ముగించి.. క్రిస్మస్‌ పర్వదినాన టెస్టులో విజయం సాధించిన మూడో జట్టుగా భారత్‌ నిలిచింది. గతంలో వెస్టిండీస్‌ (అడిలైడ్‌లో ఆస్ట్రేలియాపై 1971లో), ఇంగ్లండ్‌ (ఢిల్లీలో భారత్‌పై 1972లో) ఈ ఘనత సాధించాయి. 

ఇక విజయవంతమైన ఛేజింగ్‌లో తొమ్మిది లేదా పదో నంబర్‌ స్థానంలో వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్‌గా అశ్విన్‌ నిలిచాడు. గతంలో ఈ రికార్డు పదో స్థానంలో వచ్చిన విన్‌స్టన్‌ బెంజమిన్‌ (వెస్టిండీస్‌; 40 నాటౌట్‌; 1988లో పాకిస్తాన్‌పై) పేరిట ఉంది. 

కాగా అశ్విన్, అయ్యర్‌ నమోదు చేసిన 71 పరుగుల భాగస్వామ్యం టెస్టు క్రికెట్‌లో ఛేజింగ్‌లో ఎనిమిదో వికెట్‌కు అత్యుత్తమం. గతంలో ఈ రికార్డు ఇంజమామ్‌ ఉల్‌ హఖ్‌–రషీద్‌ లతీఫ్‌ (పాకిస్తాన్‌; 52 పరుగులు–1994లో ఆస్ట్రేలియా) జోడీ పేరిట ఉంది

స్కోరు వివరాలు 
బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌: 227; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 314;బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌: 231; భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: గిల్‌ (స్టంప్డ్‌) నూరుల్‌ (బి) మెహిదీ హసన్‌ 7; కేఎల్‌ రాహుల్‌ (సి) నూరుల్‌ (బి) షకీబ్‌ 2; పుజారా (స్టంప్డ్‌) నూరుల్‌ (బి) మెహిదీ హసన్‌ 6; అక్షర్‌ పటేల్‌ (బి) మెహిదీ హసన్‌ 34; కోహ్లి (సి) మోమీనుల్‌ (బి) మెహిదీ హసన్‌ 1; ఉనాద్కట్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) షకీబ్‌ 13; పంత్‌ (ఎల్బీడబ్ల్యూ) మెహిదీ హసన్‌ 9; అయ్యర్‌ (నాటౌట్‌) 29; అశ్విన్‌ (నాటౌట్‌) 42; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (47 ఓవర్లలో 7 వికెట్లకు) 145. వికెట్ల పతనం: 1–3, 2–12, 3–29, 4–37, 5–56, 6–71, 7–74. బౌలింగ్‌: షకీబ్‌ 14–0–50–2, తైజుల్‌ ఇస్లాం 11–4–14–0, మెహిదీ హసన్‌ 19–4–63–5, తస్కిన్‌ అహ్మద్‌ 1–0–4–0, ఖాలిద్‌ అహ్మద్‌ 2–0–12–0.  

చదవండి: IND vs SL: శ్రీలంకతో టీ20 సిరీస్‌.. భారత కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా! విధ్వంసకర ఓపెనర్‌ రీ ఎంట్రీ
WTC 2021-23: చిన్న టార్గెట్‌కే కిందా మీదా .. ఇలాగైతే డబ్ల్యూటీసీ గెలిచేదెలా?

మరిన్ని వార్తలు