Ind Vs Ban: ఈజీగా గెలుస్తామనుకున్నాం.. కానీ సిరాజ్‌, శార్దూల్‌ వల్ల..

5 Dec, 2022 15:29 IST|Sakshi
భారత జట్టు- లిటన్‌ దాస్‌

India tour of Bangladesh, 2022- Bangladesh vs India, 1st ODI: బంగ్లాదేశ్‌ లక్ష్యం 187 పరుగులు... ఒకదశలో 136/9... మరో వికెట్‌ తీస్తే తొలి వన్డే భారత్‌దే. కానీ మెహదీ హసన్, ముస్తఫిజుర్‌ టీమిండియాకు షాక్‌ ఇచ్చారు. 41 బంతుల్లోనే అభేద్యంగా 51 పరుగులు జోడించి తమ జట్టును గెలిపించారు.

బౌలర్లు చివరి వికెట్‌ తీయలేకపోయినా... బ్యాటింగ్‌ వైఫల్యమే భారత్‌ పరాజయానికి కారణం. పేలవ ఆటతో పూర్తి ఓవర్లు కూడా ఆడలేక 186 పరుగులకు కుప్పకూలడంతో ఓటమికి బాట పడింది. కేఎల్‌ రాహుల్‌ మినహా ఏ ఒక్కరూ ప్రభావం చూపలేకపోగా, షకీబ్‌ 5 వికెట్లతో, ఇబాదత్‌ 4 వికెట్లతో భారత జట్టును పడగొట్టారు.   

తద్వారా ఈ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో బంగ్లాదేశ్‌ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం బంగ్లా కెప్టెన్‌ లిటన్‌ దాస్‌ మాట్లాడుతూ.. భారత బౌలర్లపై ప్రశంసలు కురిపించడం విశేషం. లక్ష్య ఛేదన సులువు అనుకున్న తరుణంలో టీమిండియా బౌలర్లు మహ్మద్‌ సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌ రాణించిన తీరును అమోఘమంటూ కొనియాడాడు.

‘‘ఈ మ్యాచ్‌ గెలవడం చాలా సంతోషంగా ఉంది. ఆటలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. నేను, షకీబ్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో సులభంగానే విజయం సాధిస్తామని భావించాను. అయితే, సిరాజ్‌, శార్దూల్‌ మిడిల్‌ ఓవర్లలో మ్యాచ్‌ను వాళ్లవైపు తిప్పేశారు.

మేమిద్దరం అవుటైన తర్వాత గెలుపు కష్టమనిపించింది. భారత బౌలర్లు విజృంభించిన తీరు టెన్షన్‌కు గురిచేసింది. అయితే, మెహదీ అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఆఖర్లో 6-7 ఓవర్లలో అతడు బ్యాటింగ్‌ చేస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయా’’ అని లిటన్‌ దాస్‌ చెప్పుకొచ్చాడు. కాగా ఈ మ్యాచ్‌లో సిరాజ్‌ 3, శార్దూల్‌ ఠాకూర్‌ ఒకటి, వాషింగ్టన్‌ సుందర్‌ 2, అరంగేట్ర బౌలర్‌ కుల్దీప్‌ సేన్‌ 2, దీపక్‌ చహర్‌ ఒక వికెట్‌ తీశారు.

మ్యాచ్‌ సాగిందిలా...
రాహుల్‌ మినహా... 
అటు స్పిన్‌కు, ఇటు బౌన్స్‌కు అనుకూలించిన పిచ్‌ పై బంగ్లా బౌలర్లు షకీబ్, ఇబాదత్‌ పండగ చేసుకున్నారు. ముస్తఫిజుర్‌ వేసిన ‘మెయిడిన్‌’తో భారత ఇన్నింగ్స్‌ మొదలు కాగా, శిఖర్‌ ధావన్‌ (7) వైఫల్యం కొనసాగింది. మరో ఎండ్‌లో రోహిత్‌ శర్మ (31 బంతుల్లో 27; 4 ఫోర్లు, 1 సిక్స్‌) కొన్ని చక్కటి షాట్లు ఆడటంతో పవర్‌ప్లేలో భారత్‌ స్కోరు 48 పరుగులకు చేరింది. అయితే షకీబ్‌ తన తొలి ఓవర్లోనే రోహిత్, కోహ్లి (9)లను అవుట్‌ చేసి భారత్‌ను దెబ్బ కొట్టాడు. 

ఈ దశలో జట్టును రాహుల్‌ ఆదుకున్నాడు. అయ్యర్‌ (39 బంతుల్లో 24; 2 ఫోర్లు), సుందర్‌ (19) కొద్దిసేపు అతనికి సహకరించారు. మిరాజ్‌ ఓవర్లో వరుస బంతుల్లో 4, 6 బాదిన రాహుల్, ఇబాదత్‌ వేసిన తర్వాతి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి 49 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే వరుస ఓవర్లలో సుందర్, షహబాజ్‌ (0) వెనుదిరగ్గా, ఆ తర్వాత షకీబ్‌ మరోసారి ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఇబాదత్‌ ఓవర్లో సిక్స్, ఫోర్‌ కొట్టిన అనంతరం 9వ వికెట్‌గా రాహుల్‌ అవుట్‌ కావడంతో భారత్‌ 200 పరుగుల మార్క్‌ను కూడా చేరలేకపోయింది.  

రాణించిన సిరాజ్‌... 
ఇన్నింగ్స్‌ తొలి బంతికే నజ్ముల్‌ (0)ను అవుట్‌ చేసి చహర్‌ శుభారంభమిచ్చాడు. అయితే తర్వాతి బ్యాటర్లు తలా ఓ చేయి వేయడంతో బంగ్లా సులువుగానే లక్ష్యం దిశగా సాగుతున్నట్లు అనిపించింది. దాస్, షకీబ్‌ (38 బంతుల్లో 29; 3 ఫోర్లు) బాధ్యత గా ఆడారు.

వీరిద్దరిని సుందర్‌ అవుట్‌ చేసినా... ఒకదశలో 128/4తో బంగ్లా సురక్షిత స్థితిలోనే ఉంది. చేతిలో 6 వికెట్లతో మరో 91 బంతుల్లో 59 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. అయితే ఈ దశలో సిరాజ్, శార్దుల్, కుల్దీప్‌ సేన్‌ ఒక్కసారిగా విజృంభించడంతో బంగ్లాదేశ్‌ 26 బంతుల వ్యవధిలో 8 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లు కోల్పోయింది.  

అద్భుత భాగస్వామ్యం... 
బంగ్లా 9వ వికెట్‌ కోల్పోయాక గెలుపు సమీకరణం 63 బంతుల్లో 51 పరుగులుగా ఉంది. చివరి వికెట్‌ కాబట్టి భారత్‌ గెలుపు లాంఛనమే అనిపించింది. అయితే మెహదీ అపార పట్టుదలను కనబర్చాడు. కీలక సమయంలో ముస్తఫిజుర్‌ (11 బంతుల్లో 10 నాటౌట్‌; 2 ఫోర్లు) నుంచి అతనికి సరైన సహకారం లభించింది.

సేన్‌ ఓవర్లో రెండు సిక్సర్లతో ఆశలు పెంచిన మెహదీ, చహర్‌ ఓవర్లోనూ 3 ఫోర్లు కొట్టి లక్ష్యానికి చేరువ చేశాడు. చహర్‌ తర్వాతి ఓవర్‌ చివరి బంతికి సింగిల్‌ రావడంతో బంగ్లా శిబిరం సంబరాల్లో మునిగిపోయింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే బుధవారం జరుగుతుంది.  

చదవండి: KL Rahul: అతడిని ఎందుకు తప్పించారో తెలీదు! పంత్‌ దరిద్రం నీకు పట్టుకున్నట్టుంది! బాగా ఆడినా.. ఇదేం పోయే కాలమో!
Saina Nehwal: తన మొహం కూడా చూడనంటూ పెదవి విరుపులు! నాడు భోరున ఏడ్చేసిన సైనా! రూ. 2500 కూడా..

మరిన్ని వార్తలు