Ind Vs Ban: టీమిండియా అంటే ఆ మాత్రం ఉండాలి! వాళ్లు రాణిస్తేనే..! కనీసం 300 స్కోరు చేసి

21 Nov, 2022 14:28 IST|Sakshi
మెహదీ హసన్‌ మిరాజ్‌ (PC: Mehidy Hasan Miraz Twitter)

India tour of Bangladesh, 2022: ‘‘అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్‌ ఆడటం ఎల్లప్పుడూ సవాలుతో కూడుకున్నదే! నా వరకైతే సవాళ్లు ఎదుర్కోవడం ఎంతో ఇష్టం. ఇక ఇండియాతో మ్యాచ్‌ అంటే మేము మానసికంగా కూడా మరింత బలంగా తయారవ్వాలి. ఒక బౌలర్‌కు ఉండాల్సిన ముఖ్య లక్షణం ఏమిటంటే.. ఒత్తిడిని అధిగమించడమే! 

మేము కొన్ని విభాగాల్లో వెనుకబడి ఉన్న మాట వాస్తవం. ఆ సమస్యలను అధిగమించి.. మా ఆట తీరు మెరుగపరచుకుంటే కచ్చితంగా ఈ సిరీస్‌లో విజయవంతమవుతాం’’ అని బంగ్లాదేశ్‌ యువ ఆల్‌రౌండర్‌ మెహదీ హసన్‌ మిరాజ్‌ అన్నాడు.

బంగ్లా పర్యటనకు టీమిండియా
కాగా డిసెంబరు 4 నుంచి స్వదేశంలో టీమిండియాతో మొదలుకానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు బంగ్లాదేశ్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో బంగ్లా చానెల్‌తో ముచ్చటించిన మిరాజ్‌.. పటిష్టమైన భారత జట్టును ఢీకొట్టాలంటే బ్యాటర్లు రాణించాల్సిన ఆవశ్యకతను నొక్కి వక్కాణించాడు.

బాధ్యత వాళ్లదే
కనీసం 280కి పైగా స్కోరు చేయనట్లయితే.. వన్డే మ్యాచ్‌లో గెలుపుపై ఆశలు పెట్టుకోకూడదని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. ‘‘ఈ రోజుల్లో వన్డే ఫార్మాట్‌లో 280- 300 వరకు స్కోర్‌ చేస్తేనే బౌలర్ల పని కాస్త సులువవుతుంది.

నిజానికి మా జట్టు గత కొన్ని రోజులుగా మేము 300 వరకు స్కోర్‌ చేస్తుండటం సానుకూల అంశం. బ్యాటర్లు మరింత బాధ్యతగా వ్యవహరించాలి. ముఖ్యంగా టాప్‌-5లో బ్యాటింగ్‌కు దిగే వాళ్లు త్వరగా వికెట్లు పారేసుకోకూడదు. అప్పుడే 300 స్కోరు చేయడం సాధ్యమవుతుంది’’ అని చెప్పుకొచ్చాడు.

ఇక టీమిండియాతో మ్యాచ్‌ అంటే ఆ మాత్రం ఉండాలని.. మానసికంగా కూడా మేటి జట్టును ఎదుర్కోనేందుకు సన్నద్ధమవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. కాగా మిరాజ్‌ ప్రస్తుతం బంగ్లాదేశ్‌ క్రికెట్‌ లీగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇక టీమిండియా మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడే నిమిత్తం బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లనుంది. ప్రస్తుతం కివీస్‌ పర్యటనతో బిజీగా గడుపుతోంది.

చదవండి: ఇదేం బాదుడు రా బాబు.. వన్డేల్లో 277 పరుగులు.. రోహిత్‌ శర్మ రికార్డు బ్రేక్‌
Suryakumar Yadav: సూర్య అత్యుత్తమ టీ20 బ్యాటర్‌ కాదా!? కివీస్‌ బౌలర్‌ సంచలన వ్యాఖ్యలు

>
మరిన్ని వార్తలు