Ind Vs Ban: మర్యాదపూర్వక పదం వాడలేకపోతున్నా.. టీమిండియా దిగ్గజం ఘాటు వ్యాఖ్యలు! అప్పుడు తెలుస్తుంది మీకు..

23 Dec, 2022 08:39 IST|Sakshi
టీమిండియా

Bangladesh vs India, 2nd Test: ‘‘గత టెస్టులో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన ఆటగాడిని తప్పించడం నమ్మశక్యంగా లేదు. నిజానికి.. ఈ విషయం గురించి మాట్లాడటానికి కఠిన పదజాలాన్ని వాడాలనుకున్నా. కానీ.. ఇలా మర్యాదపూర్వకమైన పదంతో సరిపెడుతున్నా. 20 వికెట్లలో 8 వికెట్లు తన ఖాతాలో వేసుకున్న బౌలర్‌ను అసలు అలా ఎలా తప్పిస్తారు’’ అంటూ టీమిండియా దిగ్గజ ప్లేయర్‌ సునిల్‌ గావస్కర్‌ మేనేజ్‌మెంట్‌ తీరుపై మండిపడ్డాడు.

వాళ్లను తప్పించాల్సింది!
ఒకవేళ ఇద్దరు స్పిన్నర్లతో మాత్రమే ఆడాలనుకుంటే.. అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌లలో ఎవరో ఒకరిని తప్పించాల్సిందని అభిప్రాయపడ్డాడు. నిజానికి ఇలాంటి పిచ్‌పై అతడు ఇంకా మెరుగ్గా రాణించేవాడు అని గావస్కర్‌ పేర్కొన్నాడు. కాగా బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో కుల్దీప్‌ యాదవ్‌ను తప్పించి.. అతడి స్థానంలో పేసర్‌ జయదేవ్‌ ఉనాద్కట్‌ను తుది జట్టులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఉనాద్కట్‌ కోసం కుల్దీప్‌ను పక్కనపెట్టిన నేపథ్యంలో సెలక్టర్ల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. 

పిచ్‌ పేస్‌కు అనుకూలంగా మూడో పేసర్‌ను తీసుకున్నామని భారత జట్టు తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ చెప్పినా, అది సంతృప్తికరమైన వివరణగా అనిపించలేదంటూ క్రీడా విశ్లేషకులు పెదవి విరిచారు. ఈ నేపథ్యంలో గావస్కర్‌ సైతం మేనేజ్‌మెంట్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

కాగా మిర్పూర్‌ టెస్టులో భాగంగా... టీమిండియా బౌలర్లలో ఉమేశ్‌ యాదవ్, అశ్విన్‌ చెరో 4 వికెట్లు పడగొట్టగా... ఉనాద్కట్‌ రెండు వికెట్లు తీశాడు. అక్షర్‌ పటేల్‌ వికెట్‌ తీయలేకపోయినప్పటికీ పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. 12 ఓవర్లలో 32 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ నేపథ్యంలో బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ 227 ఆలౌట్‌ అయింది. అనంతరం భారత్‌ ఆట ముగిసే సమయానికి 8 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 19 పరుగులు చేసింది. 

కుల్దీప్‌ లేని లోటు.. అప్పుడు తెలుస్తుంది!
కాగా లెఫ్టార్మ్‌ పేసర్‌ జయదేవ్‌ ఉనాద్కట్‌ డిసెంబర్‌ 16, 2010న తన తొలి టెస్టు మ్యాచ్‌ బరిలోకి దిగాడు. అందులో ఒకే ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ చేయగా 26 ఓవర్లలో 101 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. దాంతో టెస్టు టీమ్‌లో మళ్లీ చోటు దక్కలేదు. వరుసగా దేశవాళీ క్రికెట్‌లో చక్కటి ప్రదర్శనలతో పాటు కాస్త అదృష్టం కూడా కలిసి రావడంతో బంగ్లాతో సిరీస్‌కు మళ్లీ టెస్టు పిలుపు లభించింది.

తద్వారా 12 ఏళ్ల తర్వాత అతను ఈ మ్యాచ్‌తో టెస్టు క్రికెట్‌లో పునరాగమనం చేశాడు. ఈ రెండు టెస్టుల మధ్య భారత జట్టు 118 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. తమ కెరీర్‌ రెండు మ్యాచ్‌ల మధ్య ఇంత విరామం ఉన్న ఆటగాళ్ల జాబితాలో ఉనాద్కట్‌ రెండో స్థానంలో నిలిచాడు.

ఇంగ్లండ్‌కు చెందిన గారెత్‌ బ్యాటీ తొలి టెస్టు, రెండో టెస్టు మధ్య ఇంగ్లండ్‌ జట్టు 142 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. ఇక తొలి రోజు ఉనాద్కట్‌ రాణించినా... రెండో ఇన్నింగ్స్‌లో మూడో స్పిన్నర్‌ అవసరం అనిపిస్తే మాత్రం కుల్దీప్‌ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది.

చదవండి: IPL 2023 Auction: గ్రీన్‌కు 20, కర్రన్‌కు 19.5, స్టోక్స్‌కు 19 కోట్లు..! 
IND vs PAK: భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక సిరీస్‌లపై పీసీబీ కొత్త చీఫ్‌ కీలక వాఖ్యలు

>
మరిన్ని వార్తలు