Ind Vs Eng 1st ODI: కోహ్లి లేడు.. బుమ్రా, సిరాజ్‌ను కాదని అర్ష్‌దీప్‌ సింగ్‌కు ఛాన్స్‌! ఇంకా..

12 Jul, 2022 12:06 IST|Sakshi
విరాట్‌ కోహ్లి- అర్ష్‌దీప్‌ సింగ్‌(PC: BCCI)

Ind Vs Eng 1st ODI: ఇంగ్లండ్‌తో టీమిండియా వన్డే సిరీస్‌ ఆరంభం కానున్న నేపథ్యంలో మొదటి మ్యాచ్‌కు తన జట్టును ప్రకటించాడు భారత మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా. విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌ అందుబాటులో లేకపోవడంతో సెలక్షన్‌ మరింత సులువైందన్నాడు. ఇంగ్లండ్‌తో మొదటి వన్డేతో యువ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌కు తాను అవకాశం ఇస్తానని పేర్కొన్నాడు. 

కాగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం(జూలై 12) ఇంగ్లండ్‌తో మొదటి వన్డే ఆడేందుకు సిద్ధమైంది రోహిత్‌ సేన. ఆఖరి టీ20 సందర్భంగా గజ్జల్లో గాయం కారణంగా కోహ్లి ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదని సమాచారం.

కోహ్లి, రాహుల్‌ లేరు కాబట్టి ఈజీ!
ఈ నేపథ్యంలో ఆకాశ్‌ చోప్రా ఓవల్‌ మైదానం వేదికగా సాగే మ్యాచ్‌కు తన జట్టును ప్రకటించాడు. ఈ మేరకు తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా మాట్లాడుతూ.. ‘‘కోహ్లి లేకుంటే జట్టు ఎంపిక ఈజీగా ఉంటుంది. శిఖర్‌ ధావన్‌.. రోహిత్‌ శర్మతో కలిసి ఓపెనింగ్‌ చేస్తాడు. లెఫ్ట్‌- రైట్‌ ఓపెనింగ్‌ కాంబినేషన్‌. కేఎల్‌ రాహుల్‌ లేడు కాబట్టి ఈ విషయంలో ఎలాంటి తలనొప్పులు ఉండవు’’ అని పేర్కొన్నాడు.

అదే విధంగా... ‘‘శ్రేయస్‌ అయ్యర్‌ను మూడో స్థాణంలో పంపాలి. నాలుగో స్థానంలో సూర్యకుమార్‌ ఉండనే ఉన్నాడు. ఇక ఆ తర్వాతి స్థానాల్లో రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్యా సరేసరి. జడ్డూ ఏడో స్థానంలో.. ఆ తర్వాతి స్థానాల్లో ప్రసిద్‌ కృష్ణ, మహ్మద్‌ షమీ..

ఇక అర్ష్‌దీప్‌ను ఈ మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేయించాలి. సిరాజ్‌ను కాకుండా అర్ష్‌దీప్‌ను తుది జట్టులోకి తీసుకోవాలి. ఇక యుజీ నా జట్టులో పదకొండో ఆటగాడు’’ అని ఆకాశ్‌ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌తో అర్ష్‌దీప్‌ సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 

ఇంగ్లండ్‌ వర్సెస్‌ ఇండియా మొదటి వన్డే- ఆకాశ్‌ చోప్రా జట్టు:
రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, ప్రసిద్‌ కృష్ణ, మహ్మద్‌ షమీ, అర్ష్‌దీప్‌ సింగ్‌, యజువేంద్ర చహల్‌.

చదవండి: Ind Vs Eng: ఓవల్‌ రికార్డు తెలుసా? రోహిత్‌ శర్మ అక్కడ టాస్‌ గెలిస్తే కచ్చితంగా...  

మరిన్ని వార్తలు