‌పంత్‌ను పక్కన పెట్టారు.. మరి సూర్యను ఎందుకు తీసుకోలేదు!

23 Mar, 2021 19:31 IST|Sakshi

పుణె: తొలి వన్డేలో టీమిండియా తుదిజట్టు ఎంపిక పట్ల ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. టీ20 సిరీస్‌లో సత్తా చాటిన బ్యాట్స్‌మెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌కు చోటు ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు. కాగా పుణె వేదికగా టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య మూడు వన్డేల సిరీస్‌ మంగళవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రిషభ్‌ పంత్‌ స్థానంలో కేఎల్‌ రాహుల్‌ జట్టులోకి రాగా, కృనాల్‌ పాండ్యా, ప్రసీద్‌ కృష్ణ వన్డేల్లో అరంగేట్రం చేశారు. 

ఈ నేపథ్యంలో మైకేల్‌వాన్‌ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. ‘‘భారత జట్టు శక్తివంతమైనదని ఒప్పుకొంటాను. అయితే నేటి మ్యాచ్‌లో ఆటగాళ్ల ఎంపిక పట్ల నాకు ఆశ్చర్యం వేసింది. రిషభ్‌ పంత్‌ విరామం లేకుండా సుదీర్ఘంగా మ్యాచ్‌లు ఆడుతూనే ఉన్నాడు. కాబట్టి తనకు కాస్త విశ్రాంతినివ్వాలని భావించి పక్కన పెట్టి ఉంటారు. అదే నిజమైతే తనకు ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేదీ లేదు. అయితే, సూర్యకుమార్‌ను ఆడించాల్సి ఉండాల్సింది. అతడు టీ20 మ్యాచ్‌లలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.

తనను తాను నిరూపించుకున్నాడు. 50 ఓవర్ల క్రికెట్‌లోనూ తను రాణించగలడు. అలాంటి మంచి ఆటగాడిని పక్కన పెట్టడంతో ఆశ్చర్యానికి లోనయ్యాను’’ అని చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ ఆటతీరు తనకు ఇష్టమన్న మైకేల్‌ వాన్‌..‘‘ప్రస్తుత బ్యాటింగ్‌ లైనప్‌ బాగుంది. యువ ఆటగాళ్లు దూసుకువస్తున్నారు కాబట్టి, శిఖర్‌ ధావన్‌కు ఇది కీలకమైన మ్యాచ్‌. శుభ్‌మన్‌ గిల్‌ ప్రతిభావంతుడు. తన ఆట తీరు అద్భుతం. ఓపెనింగ్‌తో పాటు మిడిలార్డర్‌లోనూ తనను ఆడించే అవకాశాలు పరిశీలించాలి’’ అని అభిప్రాయపడ్డారు.

చదవండి: సాఫ్ట్‌ సిగ్నల్‌.. మరోసారి రాజుకున్న వివాదం!
టీ20 వరల్డ్ కప్‌ విజేత ఆ జట్టే: ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌‌

 

మరిన్ని వార్తలు