Rohit Sharma: మాది సరైన నిర్ణయం.. ముందే తెలుసు.. ఆ ఒక్కటి తప్ప శిఖర్‌ కూడా!

13 Jul, 2022 11:21 IST|Sakshi
టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(PC: BCCI)

India tour of England, 2022 - Ind Vs Eng 1st ODI: ఇంగ్లండ్‌తో మొదటి వన్డేలో అదరగొట్టిన బౌలర్లను టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రశంసించాడు. ఓవల్‌ పిచ్‌పై తమ బౌలర్లు అత్యుత్తమంగా రాణించగలరని తెలుసునని, అందుకు అనుగుణంగానే అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నారని కొనియాడాడు. ఇక అనువజ్ఞుడైన శిఖర్‌ ధావన్‌ పరిస్థితులకు తగ్గట్లుగా రాణించాడని పేర్కొన్నాడు. మొదటి బంతి మినహా తాము ఎలాంటి తప్పులు చేయలేదని రోహిత్‌ చెప్పుకొచ్చాడు.

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఓవల్‌ వేదికగా జరిగిన మొదటి వన్డేలో టాస్‌ గెలిచిన టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా 7.2 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. 

ఇక మహ్మద్‌ షమీ 7 ఓవర్ల బౌలింగ్‌ చేసి 31 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ప్రసిద్‌ కృష్ణకు ఒక వికెట్‌ దక్కింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనలో భాగంగా ఓపెనింగ్‌ జోడి రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ వరుసగా 76, 31 పరుగులు చేసి భారత్‌ను గెలిపించారు. దీంతో భారీ విజయంతో సిరీస్‌లో 1-0 తేడాతో టీమిండియా ఆధిక్యంలో నిలిచింది.

సరైన నిర్ణయం.. మాకు ముందే తెలుసు!
ఈ గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేసిన రోహిత్‌ శర్మ.. ‘‘ పిచ్‌ కండిషన్‌ను బట్టి టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుని సరైన నిర్ణయం తీసుకున్నాము. అయినా, పిచ్‌ స్వభావం కారణంగా మేమెప్పుడూ ఆందోళన చెందలేదు. ఎందుకంటే మా బౌలర్లు ఇలాంటి పరిస్థితుల్లో ఎలా రాణించగలరో మాకు తెలుసు. 

స్వింగ్‌, సీమ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌ను మేము సమర్థవంతంగా ఉపయోగించుకున్నాము. మా బౌలర్లు అత్యుత్తంగా రాణించారు. ఇక శిఖర్‌ , నేను చాలా ఏళ్లుగా కలిసి బ్యాటింగ్‌ చేస్తున్నాము. ఒకరినొకరం పరస్పరం అర్థం చేసుకోగలము. అయితే, మొదటి బంతి విషయంలో మా జడ్జిమెంట్‌ తప్పింది. 

అంతేతప్ప వన్డే ఫార్మాట్‌లో ఉన్న తనకు ఉన్న సుదీర్ఘ అనుభవం అక్కరకు వచ్చింది. గతంలో ఎన్నో మ్యాచ్‌లు గెలవడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. ఈ విజయం మాకు ఎంతో సంతోషాన్నిచ్చింది’’ అని పేర్కొన్నాడు. 

కాగా ఇంగ్లండ్‌ బౌలింగ్‌ అటాక్‌ ఆరంభించిన విల్లే బౌలింగ్‌లో రోహిత్‌ ఒక పరుగు తీశాడు. అయితే, డైరెక్ట్‌ హిట్‌ నేపథ్యంలో ధావన్‌ డైమండ్‌ డక్‌గా వెనుదిరగాల్సి వచ్చేది. కాస్తలో రనౌట్‌ ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ 2022 వన్డే సిరీస్‌- మొదటి మ్యాచ్‌:
►టాస్‌: ఇండియా- బౌలింగ్‌
►ఇంగ్లండ్‌ స్కోరు:  110 (25.2)
►ఇండియా స్కోరు: 114/0 (18.4)
►విజేత: ఇండియా- 10 వికెట్ల తేడాతో గెలుపు
►ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: జస్‌ప్రీత్‌ బుమ్రా(7.2 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు)

చదవండి: Ind Vs Eng 1st ODI: టీమిండియా ఆరేళ్ల తర్వాత.. పాపం ఇంగ్లండ్‌ సొంతగడ్డపై చెత్త రికార్డు!
Mohammed Shami: షమీ సంచలనం.. టీమిండియా తరపున తొలి బౌలర్‌గా
IND VS ENG 1st ODI: రోహిత్‌ శర్మ భారీ సిక్సర్‌.. బంతి తగిలి చిన్నారికి గాయం

మరిన్ని వార్తలు