Virat Kohli: ధైర్యంగా ఉండు.. కోహ్లికి అండగా పాక్‌ కెప్టెన్‌! ఇంగ్లండ్‌ సారథి, రోహిత్‌ సైతం!

15 Jul, 2022 13:13 IST|Sakshi

ధైర్యంగా ఉండు కోహ్లి.. ఈ కష్టకాలం కరిగిపోతుంది: పాక్‌ కెప్టెన్‌

India Vs England- Babar Azam Support Kohli- Pic Viral: ఇంగ్లండ్‌ చేతిలో టీమిండియా వంద పరుగుల తేడాతో ఘోర పరాజయం కంటే కూడా.. భారత బ్యాటర్‌ ‘కింగ్‌’ కోహ్లి ఫామ్‌పైనే క్రీడా వర్గాల్లో చర్చ ఎక్కువ జరుగుతోందంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు పరుగుల యంత్రంగా పేరుగాంచిన విరాట్‌ కోహ్లి.. ప్రస్తుతం విషమ దశను ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా కెప్టెన్సీ చేజారిన తర్వాత అటు టీమిండియా.. ఇటు కోహ్లి.. ఇరు వర్గాల పరిస్థితి దిగజారిందనే చెప్పవచ్చు.

కోహ్లి ఉన్నపుడు ఆ సమస్యే లేదు!
ఫిట్‌గా ఉండే కోహ్లి కెప్టెన్‌గా ఉన్నన్నాళ్లూ.. భారత జట్టుకు తరచుగా సారథులను మార్చే దుస్థితి లేదు. కాగా టీ20 ప్రపంచకప్‌-2021 తర్వాత పొట్టి ఫార్మాట్‌కు కోహ్లి స్వయంగా గుడ్‌ బై చెప్పగా.. వన్డే ఫార్మాట్‌ నుంచి బీసీసీఐ అతడిని తప్పించిందన్న సంగతి తెలిసిందే. ఇక దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్‌ నేపథ్యంలో కోహ్లి తనకు తానుగా సంప్రదాయ క్రికెట్‌ కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు.

ఈ నేపథ్యంలో సుమారు ఏడు నెలల కాలంలోనే వివిధ సిరీస్‌లకు టీమిండియాకు ఏడుగురు కెప్టెన్లుగా వ్యవహరించడం గమనార్హం. గాయం కారణంగా.. విశ్రాంతి పేరిట రెగుల్యర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తరచుగా జట్టుకు దూరమవుతున్నాడు. 

కానీ కోహ్లి ఎందుకో ఇలా!
మరోవైపు.. కెప్టెన్సీ భారం తగ్గించుకున్న విరాట్‌ కోహ్లి బ్యాటర్‌గా రాణిస్తాడనుకుంటే అదీ జరగడం లేదు. ఒకటీ రెండూ మినహా కోహ్లి నుంచి గొప్ప ప్రదర్శనలేమీ రావడం లేదు. ముఖ్యంగా ఈ సెంచరీల వీరుడు శతకం బాది మూడేళ్లకు పైనే అయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ పరిణామాల నేపథ్యంలో అటు బీసీసీఐపై.. ఇటు కోహ్లిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తీరూతెన్నూ లేకుండా తరచుగా కెప్టెన్లు మార్చడం సరికాదని.. దీర్ఘకాలంలో ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని కొంతమంది బీసీసీఐ పెద్దలను హెచ్చరిస్తున్నారు. మరోవైపు.. కపిల్‌ దేవ్‌ వంటి దిగ్గజాలు కోహ్లి విఫలమైనా అవకాశాలు ఇవ్వడంపై విరుచుకుపడుతున్నారు.

కోహ్లికి మద్దతుగా బట్లర్‌, బాబర్‌
అయితే, సునిల్‌ గావస్కర్‌, బీసీసీఐ బాస్‌ సౌరవ్‌ గంగూలీ సహా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సైతం కోహ్లికి అండగా నిలవడం విశేషం. కోహ్లి తన స్థాయికి తగ్గట్లుగా రాణించలేకపోయినా.. గొప్ప బ్యాటర్‌ ఏదో ఒకరోజు ఫామ్‌ అందుకుంటాడని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ క్రమంలో విదేశీ ఆటగాళ్లు.. అది కూడా కోహ్లి సమకాలీన క్రికెటర్లు అతడికి మద్దతుగా నిలవడం పట్ల కింగ్‌ కోహ్లి ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. టీమిండియా మీద ఘన విజయం తర్వాత ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌.. ప్రపంచంలోని అత్యుత్తమ వన్డే బ్యాటర్‌ అని కోహ్లిని కొనియాడాడు. ఇక రోహిత్‌ శర్మ సైతం మరోసారి.. కోహ్లి ఫామ్‌పై ఇంత చర్చ ఎందుకో అర్థం కావడం లేదు.. ఏం చేయాలో తెలుసు అన్నట్లుగా విలేకర్లకు కౌంటర్‌ ఇచ్చాడు.

అదే విధంగా అతడిపై విమర్శలు చేస్తున్న వారిని ఉద్దేశించి.. కోహ్లి కూడా మనిషేనని, తనదైన రోజు చెలగేరి ఆడతాడని అండగా నిలిచాడు. ఇక ఇటీవలి కాలంలో వరుసగా కోహ్లి రికార్డులు బద్దలు కొడుతున్న పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం సైతం కోహ్లికి మద్దతుగా నిలవడం విశేషం.

కోహ్లితో కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేసిన బాబర్‌ ఆజం.. ఈ కష్టకాలం కరిగిపోతుంది.. ధైర్యంగా ఉండు అంటూ ట్వీట్‌ చేశాడు. అదే విధంగా టీమిండియా మాజీ బ్యాటర్‌ హేమంగ్‌ బదానీ సైతం.. ‘అతడిని కొంతకాలం ఒంటరిగా వదిలేయండి’’ అంటూ కోహ్లి విమర్శకులకు కౌంటర్‌​ ఇచ్చాడు. 

ఇలా చాలా మంది కోహ్లికి అండగా నిలవడం అతడి చరిష్మా ఏమిటో చెబుతోందని అభిమానులు అంటున్నారు. కాగా రెండో వన్డేలో కోహ్లి..  25 బంతులు ఎదుర్కొని 3 ఫోర్ల సాయంతో 16 పరగులు చేశాడు.

మరిన్ని వార్తలు