IND VS ENG 2nd Test: ఆ ఇద్దరూ లేకుండా టీమిండియా.. 4464 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత..!

31 Jan, 2024 13:47 IST|Sakshi

ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా వైజాగ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగబోయే రెండో టెస్ట్‌లో టీమిండియా కీలక ఆటగాళ్లు లేకుండా బరిలోకి దిగనుంది. వ్యక్తిగత కారణాల చేత విరాట్‌, గాయం కారణంగా మొహమ్మద్‌ షమీ సిరీస్‌ ప్రారంభానికి ముందే జట్టు నుంచి తప్పుకోగా.. తొలి టెస్ట్‌ సందర్భంగా కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా గాయాల బారిన పడి జట్టుకు దూరమయ్యారు. ఈ నలుగురు కీలక ఆటగాళ్లు లేకుండా ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం కాబోయే వైజాగ్‌ టెస్ట్‌లో టీమిండియా ఏమేరకు రాణిస్తుందో వేచి చూడాలి. 

ఇదిలా ఉంటే విరాట్‌ కోహ్లి, రవీంద్ర జడేజా లేకుండా టీమిండియా సుదీర్ఘ విరామం తర్వాత స్వదేశంలో ఓ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతూ రికార్డుల్లోకెక్కింది. ఈ ఇద్దరూ లేకుండా భారత్‌ జట్టు 12 ఏళ్ల 3 నెలల విరామం తర్వాత (4464 రోజుల) స్వదేశంలో టెస్ట్‌ మ్యాచ్‌ ఆడనుంది. దశాబ్ద కాలానికిపైగా టీమిండియాలో కీలక ఆటగాళ్లుగా చలామణి అవుతున్న విరాట్‌, జడ్డూ వేర్వేరు కారణాల చేత జట్టుకు దూరం కావడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వీరిద్దరూ లేకపోవడం టీమిండియా విజయావకాశాలను సైతం ప్రభావితం చేస్తుంది. 

కోహ్లి లాంటి అనుభవజ్ఞుడైన బ్యాటర్‌ లేక తొలి టెస్ట్‌లో ఓటమిపాలైన భారత్‌.. రెండో టెస్ట్‌లో రాహుల్‌, జడ్డూ సేవలను కూడా కోల్పోనుండటంతో భారత అభిమాని మ్యాచ్‌ ప్రారంభానికి ముందే ఓటమి బెంగ పెట్టుకున్నాడు. సీనియర్ల గైర్హాజరీలో టీమిండియా యువ ఆటగాళ్లతో ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కోహ్లి, రాహుల్‌ లేకపోవడంతో టీమిండియా బ్యాటింగ్‌ విభాగంలో లోటు కొట్టొచ్చినట్లు కనిస్తుంది. వీరి స్థానాల్లో రెండో టెస్ట్‌లో రజత్‌ పాటిదార్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ బరిలోకి దిగే అవకాశం ఉంది. వీరిద్దరికీ ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడిన అనుభవం కూడా లేదు. బ్యాటింగ్‌ పరిస్థితి ఇలా ఉంటే, రెండో టెస్ట్‌లో టీమిండియా బౌలింగ్‌కు సంబంధించి భారీ ప్రయోగాలకు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ మ్యాచ్‌లో టీమిండియా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. 

రెగ్యులర్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజా గాయపడిన నేపథ్యంలో అశ్విన్‌తో పాటు అక్షర్‌ పటేల్‌ భారత స్పిన్‌ విభాగాన్ని లీడ్‌ చేసే అవకాశం ఉంది. వీరిద్దరితో పాటు జడ్డూకు రీప్లేస్‌మెంట్‌గా వచ్చిన వాషింగ్టన్‌ సుందర్‌, కుల్దీప్‌ యాదవ్‌ తుది జట్టులో ఉంటారని సోషల్‌మీడియాలో భారీ ఎత్తున ‍ప్రచారం జరుగుతుంది. సుందర్‌, కుల్దీప్‌ తుది జట్టులో చేరే క్రమంలో తొలి టెస్ట్‌లో ఆశించినంత ‍ప్రభావం చూపలేకపోయిన మొహమ్మద్‌ సిరాజ్‌పై వేటు పడనుందని ప్రచారం జరుగుతుంది.

whatsapp channel

మరిన్ని వార్తలు