IND Vs ENG 2nd Test: తక్కువ అంచనా వేశాం.. తగిన మూల్యం చెల్లించుకున్నాం: రూట్

17 Aug, 2021 18:39 IST|Sakshi

లండన్: లార్డ్స్‌ టెస్ట్‌లో టీమిండియా లోయర్‌ ఆర్డర్‌ను తక్కువగా అంచనా వేశామని ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ తెలిపాడు. కెప్టెన్‌గా తాను కూడా కొన్ని పొరపాట్లు చేశానని అంగీకరించాడు. రెండో టెస్ట్‌లో తమ విజయం ఖాయమని ధీమాగా ఉన్నామని.. షమీ (70 బంతుల్లో 56 నాటౌట్‌; 5 ఫోర్లు, సిక్స్‌), బుమ్రా (64 బంతుల్లో 34 నాటౌట్‌; 3 ఫోర్లు)లు తమ నుంచి గెలుపును లాగేసుకున్నారని వాపోయాడు. మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. కెప్టెన్‌గా నేను కొన్ని పొరపాట్లు చేశాను. వ్యూహాత్మకంగా కొన్ని భిన్నమైన మార్పులు చేయాల్సింది. షమీ, బుమ్రాల భాగస్వామ్యం మ్యాచ్‌ను భారత్‌వైపు మలుపు తిప్పిందనడంలో ఎలాంటి సందేహం లేదు. వారిని తక్కువ అంచనా వేసి, తగిన మూల్యం చెల్లించుకున్నామని పేర్కొన్నాడు.
చదవండి: నీరజ్‌ చోప్రాకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

షమీ, బుమ్రాలపై తాము ప్రయోగించిన షార్ట్‌ బంతుల వ్యూహం విఫలమైందని, వారి జోడి కవ్వింపులకు తాళలేక తమపై ఎదురుదాడికి దిగిందని రూట్‌ అంగీకరించాడు. వాస్తవానికి టీమిండియా దూకుడులో తప్పేమీ లేదని, వారు నిజాయితీగానే ఆడారని, కోహ్లీ తన సహజ శైలిలోనే ప్రవర్తించాడని పేర్కొన్నాడు. కోహ్లి సేనను ఎక్కువగా రెచ్చగొట్టడం వల్లనే వారు రాణించారని అభిప్రాయపడ్డాడు. మొత్తంగా ఇవన్నీ ఆటలో భాగమేనని, శృతిమించనంతవరకు అన్ని బాగుంటాయని రూట్‌ చెప్పుకొచ్చాడు.

కాగా, లార్డ్స్‌ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా 151 పరుగుల తేడాతో ఆతిధ్య ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన సంగతి తెలిసిందే. కోహ్లీసేన నిర్దేశించిన 272 పరుగుల లక్ష్య ఛేదనలో రూట్ సేన 120 పరుగులకే ఆలౌటైంది. రూట్‌ (33) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. రూట్‌ తొలి ఇన్నింగ్స్‌(180 నాటౌట్‌)లోనూ భారీ శతకంతో రాణించిన విషయం తెలిసిందే. 
చదవండి: 'మీరు ఒకరి వెంటపడితే.. మేం 11 మందిమి తిరగబడతాం': కేఎల్‌ రాహుల్‌

మరిన్ని వార్తలు