క్రికెటర్‌ కంటే ముందు ఫాస్ట్‌ బౌలింగ్‌ అభిమానిని.. నాకు ఎవరితో పోటీ లేదు: బుమ్రా

5 Feb, 2024 20:32 IST|Sakshi

వైజాగ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో తొమ్మిది వి​కెట్లు తీసి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించిన జస్ప్రీత్‌ బుమ్రా మ్యాచ్‌ అనంతరం జరిగిన ప్రజెంటేషన్‌ సెర్మనీలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో ప్రదర్శన కారణంగా ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్న బుమ్రా ఈ సందర్భంగా మాట్లాడుతూ..

నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. వికెట్ల సంఖ్య, గణాంకాలను నేను ఎప్పుడూ పట్టించుకోను. యువకుడిగా ఉన్నప్పుడు అలా చేశాను. అప్పుడు అవి నన్ను ఉత్తేజపరిచేవి. ఇప్పుడు పరిస్థితి వేరు. సీనియర్‌గా నాపై అదనపు బాధ్యతలు ఉన్నాయి. యుక్త వయసులో నేను నేర్చుకున్న మొదటి డెలివరీ యార్కర్.

ఆటలోని దిగ్గజాలను చూశాను. వకార్, వసీం, జహీర్ ఖాన్.. ఇలా చాలామంది బౌలింగ్‌ను చూస్తూ పెరిగాను. జట్టుగా మేము పరివర్తన దశలో పయనిస్తున్నాము. జట్టు కోసం నేను చేయగలిగినదంతా చేస్తాను. అది బాధ్యతగా భావిస్తాను. జట్టు అవసరాల పరంగా రోహిత్‌తో చాలా విషయాలు చర్చిస్తాను. అతనితో చాలా కాలంగా కలిసి ఆడుతున్నాను కాబటి​ మా ఇద్దరి మధ్య చాలా సాన్నిహిత్యం ఉంది.

ఇంగ్లండ్‌ వెటరన్‌, దిగ్గజ పేసర్‌ జిమ్మీ ఆండర్సన్‌తో పోటీపై స్పందిస్తూ.. క్రికెటర్ కంటే ముందు నేను ఫాస్ట్ బౌలింగ్ అభిమానిని. ఏ ఫాస్ట్‌ బౌలర్‌ రాణించినా ముందుగా నేనే వారిని అభినందిస్తాను. మ్యాచ్‌ సమయంలో వ్యూహ రచనపై స్పందిస్తూ.. పరిస్థితిని, వికెట్‌ను చూసి ఎలా ముందుకు వెళ్లాలో ఆలోచిస్తాను. ముందుగా ఏదో ప్రణాళికలు అనుకుని అలా వెళ్లాలని అనుకోనని అన్నాడు. 

కాగా, బుమ్రాతో పాటు యశస్వి జైస్వాల్‌ (209), శుభ్‌మన్‌ గిల్‌ (104) అద్భుత ప్రదర్శనలతో చెలరేగడంతో రెండో టెస్ట్‌లో టీమిండియా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్‌ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమానంగా నిలిచింది. 

ఇదిలా ఉంటే, మ్యాచ్‌ విన్నింగ్‌ పెర్ఫార్మెన్స్‌తో టీమిండియాను గెలిపించిన బుమ్రాను మూడో టెస్ట్‌కు దూరంగా ఉంచనున్నారన్న ప్రచారం జరుగుతుంది. వర్క్‌లోడ్‌ కారణంగా మూడో టెస్ట్‌లో బుమ్రాకు విశ్రాంతి కల్పించనున్నట్లు సమాచారం. తిరిగి అతన్ని నాలుగు, ఐదు టెస్ట్‌లకు జట్టులోకి ఆహ్వానిస్తారని తెలుస్తుంది.  


 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega