టీమిండియాను ఆదుకున్న రవీంద్ర జడేజా.. బాధ్యతాయుతమైన సెంచరీ

15 Feb, 2024 17:17 IST|Sakshi

రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా బ్యాట్‌తో విజృంభించాడు. ఈ మ్యాచ్‌లో జట్టు కష్టాల్లో (33/3) ఉన్నప్పుడు బరిలోకి దిగిన జడేజా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో కలిసి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ క్రమంలో జడ్డూ కెరీర్‌లో నాలుగో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జడేజా 198 బంతుల్లో 7 ఫోర్లు, 2స సిక్సర్ల సాయంతో సెంచరీ మార్కును తాకాడు.

జడ్డూ బాధ్యతాయుతమైన సెంచరీతో కదంతొక్కడంతో టీమిండియా పటిష్ట స్థితి​​కి చేరింది. 85 ఓవర్లు ముగిసే సమయానికి భారత జట్టు స్కోర్‌ 324/5గా ఉంది. జడ్డూ.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో కలిసి నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయిలో 234 పరుగులు జోడించాడు. జడ్డూకు ముందు రోహిత​ శర్మ సైతం బాధ్యతాయుతమైన సెంచరీతో (131) మెరిశాడు. వీరిద్దరు నిలబడకపోయుంటే ఈ మ్యాచ్‌లో టీమిండియా పరిస్థితి దయనీయంగా ఉండేది.

జడేజా పొరపాటు వల్ల..
సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉన్నప్పుడు జడ్డూ ఓ తప్పు చేశాడు. అప్పటికి మాంచి టచ్‌లో ఉన్న అరంగేట్రం ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌ను లేని పరుగుకు పిలిచి రనౌట్‌ చేయించాడు. సర్ఫరాజ్‌ను అనవసరంగా ఔట్‌ చేయించానన్న బాధలో జడేజా సెంచరీ సెలబ్రేషన్స్‌ కూడా చేసుకోలేదు. జడేజా వల్ల సర్ఫరాజ్‌ అనవసరంగా ఔట్‌ కావడంతో డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్న రోహిత్‌ శర్మ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. కోపంతో ఊగిపోతూ క్యాప్‌ను నేలకేసి కొట్డాడు.

అనుభవజ్ఞుడిలా రెచ్చిపోయిన సర్ఫరాజ్‌..
సర్ఫరాజ్‌ ఖాన్‌ అరంగేట్రం మ్యాచ్‌ అన్న విషయాన్ని మరిచిపోయి అనుభవజ్ఞుడిలా యధేచ్ఛగా షాట్లు ఆడాడు. సర్ఫరాజ్‌ కేవలం​ 66 బంతుల్లోనే 9 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 62 పరుగులు చేసి సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే దురదృష్టవశాత్తు జడ్డూ పొరపాటు వల్ల రనౌటయ్యాడు. 

కాగా, 326/5 స్కోర్‌ వద్ద తొలి రోజు ఆట ముగిసింది. జడేజా (110), కుల్దీప్‌ యాదవ్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు.  భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ (10), శుభ్‌మన్‌ గిల్‌ (0), రజత్‌ పాటిదార్‌ (5) నిరాశపరిచగా.. కెప్టెన్‌ రోహిత్‌ సెంచరీతో కదంతొక్కాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో మార్క్‌ వుడ్‌ 3, టామ్‌ హార్ల్టీ ఓ వికెట్‌ పడగొట్టారు.

whatsapp channel

మరిన్ని వార్తలు