బట్లర్‌పై గంభీర్‌ ప్రశంసలు: రోహిత్‌తో పాటు అతడు కూడా

17 Mar, 2021 20:22 IST|Sakshi
జోస్‌ బట్లర్‌- రోహిత్‌ శర్మ(ఫొటో కర్టెసీ: బీసీసీఐ)

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ జోస్‌ బట్లర్‌పై భారత మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ ప్రశంసలు కురిపించాడు. అతనొక అసాధారణ ఆటగాడు అని, ఫాంలో ఉంటే తనను ఏ బౌలర్‌ కూడా అడ్డుకోలేడని పేర్కొన్నాడు. టీమిండియాతో అహ్మదాబాద్‌లో జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 8 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన బట్లర్‌ (52 బంతుల్లో 83 నాటౌట్‌; 5 ఫోర్లు, 4 సిక్సర్లు)  ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. అతడి మెరుపు ఇన్నింగ్స్‌కు తోడు బెయిర్‌ స్టో (28 బంతుల్లో 40 నాటౌట్‌; 5 ఫోర్లు) జతకావడంతో ఇంగ్లండ్‌ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది.

ఈ నేపథ్యంలో గౌతం గంభీర్‌ ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘తన ఆట అద్భుతం. అసాధారణం. నాకు తెలిసి రోహిత్‌ శర్మతో పాటు వరల్డ్‌ టీ20 బెస్ట్‌ బ్యాటర్లలో బట్లర్‌ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ఇయాన్‌ బెల్‌ ఇప్పుడే చెప్పారు.. బట్లర్‌ ఒక మంచి ఇంగ్లిష్‌ వైట్‌బాల్‌(పరిమిత ఓవర్ల క్రికెట్‌) బ్యాట్స్‌మన్‌ అని.. నిజానికి తను ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ అని నా అభిప్రాయం. ఫాస్ట్‌ బౌలర్లు అయినా, స్పిన్నర్లు అయినా తను వెనక్కి తగ్గడు. తను ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే ఆపడం ఏ బౌలర్‌ తరం కాదు’’ అని ప్రశంసల జల్లు కురిపించాడు. ఇక మూడో టీ20లో టీమిండియా స్టార్‌ ఫాస్ట్‌బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించిందని, శార్దూల్‌ ఠాకూర్‌, భువనేశ్వర్‌ కుమార్‌ వంటి బౌలర్లకు బట్లర్‌ను ఆపడం అంత తేలికేమీ కాదని పేర్కొన్నాడు.  

చదవండి: వైరల్‌: శార్దూల్‌పై కోహ్లి సీరియస్!‌‌
వుడ్‌ బౌలింగ్‌తో... బట్లర్‌ బ్యాటింగ్‌తో...

మరిన్ని వార్తలు