Rohit Sharma: అతడు అద్భుతం.. మాకు ఇదొక గుణపాఠం.. ఓటమికి కారణం అదే!

11 Jul, 2022 10:01 IST|Sakshi
సూర్యకుమార్‌ యాదవ్‌- రోహిత్‌ వర్మ(PC: BCCI)

Ind Vs Eng 3rd T20- Rohit Sharma Lauds Surya Kumar Yadav: ‘‘లక్ష్యాన్ని ఛేదించే దిశగా మా బ్యాటింగ్‌ కొనసాగింది. గెలిచేందుకు జట్టు చేసిన పోరాడిన తీరు పట్ల గర్వంగా ఉంది. ముఖ్యంగా సూర్య అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. చాలా రోజులుగా అతడి ఆటను గమనిస్తున్నా.

ఈ ఫార్మాట్‌లో అతడు వైవిధ్యభరిత షాట్లతో విరుచుకుపడతాడు. జట్టులోకి వచ్చిన నాటి నుంచి రోజురోజుకూ ఆటకు మెరుగులు దిద్దుకుంటున్నాడు’’ అంటూ టీమిండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌పై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రశంసలు కురిపించాడు.

భారీ టార్గెట్‌..
ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 17 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. నాటింగ్‌హామ్‌ వేదికగా సాగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది.

ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(11), రిషభ్‌ పంత్‌(1), వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి(11) పూర్తిగా విఫలమయ్యారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాలుగో స్థానంలో బరిలోకి దిగిన సూర్యకుమార్‌ యాదవ్‌ వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడాడు.

పాపం సూర్య
ఆకాశమే హద్దుగా చెలరేగుతూ 55 బంతుల్లో 117 పరుగులు చేసి సత్తా చాటాడు. అయితే, శ్రేయస్‌ అయ్యర్‌ తప్ప మిగతా బ్యాటర్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే పరిమితం కావడంతో సూర్య సెంచరీ వృథాగా పోయింది. టీమిండియాకు పరాభవం తప్పలేదు.

ఇదొక గుణపాఠం
ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. సూర్య ఇన్నింగ్స్‌ను కొనియాడాడు. అదే విధంగా.. ‘ఇంగ్లండ్‌ ఆటగాళ్లు అద్భుత బ్యాటింగ్‌తో మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టారు. మంచి భాగస్వామ్యాలు నమోదు చేసి సవాల్‌ విసిరారు. ఈరోజు ఆట సాగిన విధానం మాకు గుణపాఠం నేర్పింది. బౌలింగ్‌ బెంచ్‌ బలమేమిటో మరోసారి పరిశీలించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. 

ఇలాంటి ఓటములు కచ్చితంగా గుణపాఠం వంటివే’’ అని రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. ఇప్పటి వరకు మెరుగ్గానే రాణించామని. ఇకపై ఆటను మరింత మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చాడు. బౌలింగ్‌, బ్యాటింగ్‌ రెండు విభాగాల్లోనూ రాణించాల్సి ఉందని రోహిత్‌ పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది.  

చదవండి: APL 2022: వైజాగ్‌ వారియర్స్‌ పరుగుల వరద.. రెండో విజయం! టేబుల్‌ టాపర్‌ ఎవరంటే!

మరిన్ని వార్తలు