Surya Kumar Yadav: ప్రపంచ రికార్డు సృష్టించిన సూర్యకుమార్‌ యాదవ్‌! మాక్సీ రికార్డు బద్దలు.. మరెన్నో!

11 Jul, 2022 14:04 IST|Sakshi
టీమిండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(PC: BCCI)

India Vs England 3rd T20- Suryakumar Yadav Records: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు శతకం బాదాడు. ఈ మ్యాచ్‌లో 55 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 117 పరుగులు సాధించాడు.

ఈ నేపథ్యంలో, ఇంగ్లండ్‌ తాజా పర్యటనలో భాగంగా ఆఖరి టీ20లో టీమిండియా ఓడినా సూర్య మాత్రం అభిమానుల మనసులు గెలిచాడు. అంతేకాకుండా టీ20 ఫార్మాట్‌లో పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు.

రోహిత్‌ తర్వాత..
ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో పొట్టి ఫార్మాట్‌లో తొలి సెంచరీ చేసిన సూర్యకుమార్ యాదవ్‌... రోహిత్‌ శర్మ తర్వాత అత్యధిక స్కోరు సాధించిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ 118 పరుగులు చేయగా.. సూర్య అత్యధిక స్కోరు 117.

ప్రపంచ రికార్డు..
అదే విధంగా పొట్టి ఫార్మాట్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్కోరు సాధించిన మొదటి బ్యాటర్‌గా సూర్య నిలిచాడు. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ పేరిట ఉండేది. టీమిండియాతో బెంగళూరులో 2019లో జరిగిన మ్యాచ్‌లో మాక్సీ 113 పరుగులతో అజేయంగా నిలిచాడు.

తాజాగా ఇంగ్లండ్‌తో ‍మ్యాచ్‌లో సూర్య 117 పరుగులు చేసి మాక్స్‌వెల్‌ రికార్డు బద్దలు కొట్టి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. దీనితో పాటు నాలుగు.. లేదంటే ఆ తర్వాతి స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ బాదిన రెండో భారత బ్యాటర్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ ఘనత సాధించాడు. సూర్య కంటే ముందు కేఎల్‌ రాహుల్‌ ఈ ఫీట్‌ నమోదు చేశాడు.

అంతేకాకుండా.. టీ20 ఫార్మాట్‌లో శతకం నమోదు చేసిన ఐదో భారత బ్యాటర్‌గా సూర్య నిలిచాడు. కాగా ఈ మ్యాచ్‌లో మొయిన్‌ అలీ బౌలింగ్‌లో సాల్డ్‌కు క్యాచ్‌ ఇచ్చి సూర్య పెవిలియన్‌ చేరాడు.

ఇండియా వర్సెస్ ఇంగ్లండ్‌ మూడో టీ20:
టాస్‌: ఇంగ్లండ్‌- బ్యాటింగ్‌
ఇంగ్లండ్‌ స్కోరు:  215/7 (20)
టీమిండియా స్కోరు: 198/9 (20)
విజేత: ఇంగ్లండ్‌.. 17 పరుగుల తేడాతో గెలుపు
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: రీస్‌ టోప్లే(4 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు)

చదవండి: Rohit Sharma- Virat Kohli: కోహ్లికి అండగా నిలిచిన రోహిత్‌ శర్మ.. అతడు చేసింది కరెక్టే! అయినా కపిల్‌ దేవ్‌...
T20 World Cup 2022: ఈసారి టీమిండియాను ఓడించడం పాకిస్తాన్‌కు అంత ఈజీ కాదు: అక్తర్‌

మరిన్ని వార్తలు