అతడు ఎన్నిసార్లు విఫలమైనా ఛాన్స్‌.. కానీ పాపం

16 Mar, 2021 21:48 IST|Sakshi
ఇషాన్‌ కిషన్‌తో సూర్యకుమార్‌ యాదవ్‌(ఫొటో కర్టెసీ: బీసీసీఐ)

అహ్మదాబాద్‌: అంతర్జాతీయ క్రికెట్‌లో తమ దేశం తరఫున కనీసం ఒక్కసారైనా ఆడాలని కోరుకుంటాడు ప్రతీ క్రికెటర్‌. ముంబై బ్యాట్స్‌మెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా అలాంటి వాడే. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడుతున్న ఈ క్రికెట్‌ స్టార్‌.. అవకాశం వచ్చినప్పుడల్లా తన ప్రతిభ నిరూపించుకుంటూనే ఉన్నాడు. ఈ క్రమంలో సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఎట్టకేలకు జాతీయ జట్టులో చోటు దక్కడంతో భావోద్వేగానికి గురయ్యాడు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడనున్న టీమిండియా ప్రాబబుల్స్‌లో తన పేరు చూసుకొని ఏడ్చేశాడు. సూర్య జాతీయ జట్టు తరఫున ఆడబోతున్నాడన్న విషయం తెలిసి అతడి కుటుంబం కూడా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. ప్రాబబుల్స్‌లో పేరు ఉన్నందుకే ఇంతలా ఎమోషనల్‌ అయ్యారు వాళ్లంతా. కేవలం వాళ్లే కాదు, సూర్య కుమార్‌ ఫ్యాన్స్‌ కూడా ఎంతో సంబరపడ్డారు.

అలాంటిది రెండో టీ20 ద్వారా అరంగేట్రం చేస్తున్నాడన్న విషయం తెలియగానే అంతా ఎగిరి గంతేశారు. అయితే, ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, మరో అరంగేట్ర ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ విశ్వరూపం ప్రదర్శించడంతో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తుదిజట్టులో చోటు దక్కినా, సూర్యకుమార్‌కు బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. ఇక మంగళవారం నాటి మూడో టీ20లోనైనా ఆడే అవకాశం వస్తుందేమోనని ఆశగా ఎదురు చూశారు అతడి అభిమానులు. కానీ నేడు కూడా వారికి నిరాశే ఎదురైంది. అసలు తుది జట్టులోనే అతడికి చోటు దక్కలేదు. టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ తిరిగి జట్టులో చేరడంతో సూర్యకు మొండిచేయి ఎదురైంది.

ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియా వేదికగా సూర్య కుమార్‌ యాదవ్‌కు సానుభూతి ప్రకటిస్తున్నారు ఫ్యాన్స్‌. ‘‘ఎంతో ప్రతిభావంతుడైన సూర్యకుమార్‌ను మరోసారి దురదృష్టం వెంటాడింది. తనకు ఒక్క అవకాశమైనా ఇవ్వండి. అరంగేట్రం చేశాడన్న ఆనందమే లేకుండా పోయింది. ఐపీఎల్‌లో ఆర్సీబీతో మ్యాచ్‌ సమయంలో కోహ్లితో గొడవ పడినందుకే ఇలా చేస్తున్నారా? రాహుల్‌ వరుసగా విఫలమవుతున్నాడు. అయినా తనకు ఛాన్స్‌ ఇస్తారు. ఏంటో ఈ జీవితం’’ అంటూ తమకు తోచినట్లుగా కామెంట్లు చేస్తున్నారు. ఇక కామెంటేటర్‌ హర్షా బోగ్లే సైతం ఈ విషయంపై స్పందించాడు. ‘‘రోహిత్‌ ఒక్కసారి జట్టులోకి తిరిగి వచ్చాడంటే సూర్యకుమార్‌ యాదవ్‌కు అవకాశాలు కష్టమైపోతాయి. వచ్చే రెండు మ్యాచ్‌లలో నైనా తనకు అవకాశం వస్తుందేమో చూడాలి’’ అని ట్వీట్‌ చేశాడు. ఇక సూర్యకుమార్‌తో అరంగేట్రం చేసిన యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ అద్భుతమైన హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

చదవండి: ‘రేపు ఇషాన్‌ కావొచ్చు.. ఆపై పంత్‌ కావొచ్చు

మరిన్ని వార్తలు