అరుదైన రికార్డును సమం చేసిన ఇంగ్లండ్‌ వికెట్‌కీపర్‌..

25 Aug, 2021 19:59 IST|Sakshi

లీడ్స్‌: టీమిండియాతో జరగుతున్న మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ జోస్‌ బట్లర్‌ ఓ అరుదైన రికార్డును సమం చేశాడు. ఓ ఇన్నింగ్స్‌ తొలి ఐదు వికెట్లలో భాగస్వామి(క్యాచ్‌ లేదా స్టంపింగ్‌) అయిన రెండో వికెట్‌కీపర్‌గా ఆసీస్‌ మాజీ వికెట్‌కీపర్‌ బ్రాడ్‌ హడిన్‌ సరసన నిలిచాడు. హడిన్‌ 2014-15 గబ్బా టెస్ట్‌లో టీమిండియాపై ఈ ఘనత సాధించాడు. ఈ టెస్ట్‌లో భారత్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుని 58 పరగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇంగ్లండ్‌ పేసర్లు ఆండర్సన్‌(3), ఒలీ రాబిన్సన్‌(2) నిప్పులు చెరిగే బంతులతో భారత టాపార్డర్‌ను కుప్పకూల్చారు.

వీరిద్దరు పడగొట్టిన 5 వికెట్లలో బట్లర్‌ కీలకపాత్ర పోషించాడు. కేఎల్‌ రాహుల్‌, పుజారా, కోహ్లి, రహానే, పంత్‌ల క్యాచ్‌లను అందుకుని టీమిండియా పతనానికి పరోక్ష కారకుడిగా నిలిచాడు. కాగా, కడపటి వార్తలు అందేసరికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే చాపచుట్టేసింది. ఇంగ్లండ్‌ పేసర్లు విశ్వరూపం ప్రదర్శించడంతో భారత్‌ కనీసం మూడంకెల స్కోర్‌ను కూడా చేరుకోలేకపోయింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆండర్సన్‌, ఓవర్టన్‌ తలో మూడు వికెట్లు పడగొట్టగా, రాబిన్సన్‌, సామ్‌ కర్రన్‌ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. భారత ఇన్నింగ్స్‌లో రోహిత్‌(19), రహానే(18) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు.
చదవండి: హార్ధిక్‌ పాండ్యా రిస్ట్‌ వాచ్‌ ధరెంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

>
మరిన్ని వార్తలు