మూడో టెస్ట్‌ ‌: 10 వికెట్ల తేడాతో టీమిండియా విజయం

25 Feb, 2021 21:28 IST|Sakshi

టీమిండియా ఘన విజయం
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్ 112 ఆలౌట్‌, రెండో ఇన్నింగ్స్‌ 81 ఆలౌట్‌ 
టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ 145 ఆలౌట్‌‌,  రెండో ఇన్నింగ్స్‌ 49/0

పింక్‌ బాల్‌ టెస్టులో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 49 పరుగులు స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. విజయానికి 10 పరుగులు అవసరమైన దశలో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఫోర్‌, సిక్స్‌ కొట్టి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ విజయంతో టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఐదు రోజులు జరగాల్సిన మూడో టెస్టు ఆట రెండు రోజుల్లోనే ముగిసిపోవడం విశేషం.

తొలి రోజు ఆటలో రెండో సెషన్‌లోనే ఇంగ్లండ్‌ 112 పరుగులకే ఆలౌట్‌ కావడం.. ఆ తర్వాత భారత్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 99 పరుగులు వద్ద ముగించింది. రెండో రోజు ఆటలో తొలి సెషన్‌లోనే టీమిండియా మిగతా 7 వికెట్లు కోల్పోయి 145 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆ తర్వాతి సెషన్‌లో ఇంగ్లండ్‌ టీమిండియా స్పిన్నర్ల దాటికి రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకే కుప్పకూలింది. పిచ్‌ పరిస్థితి అర్థం కాక బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేయడానికి తంటాలు పడితే బౌలర్లు మాత్రం వికెట్ల పండగ చేసుకున్నారు. ముఖ్యంగా స్పిన్నర్లు రెచ్చిపోయారు. మొత్తం వికెట్లలో 27 వికెట్లు స్పిన్నర్లే తీయగా... పేసర్లు మూడు వికెట్లు మాత్రమే తీయగలిగారు.

విజయానికి 21 పరుగులు దూరంలో నిలిచింది. ప్రస్తుతం టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 28 పరుగుల చేసింది. 49 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ భోజన విరామ సమయానికి వికెట్‌ నష్టపోకుండా 11 పరుగులు చేసింది. 

ఇంగ్లండ్‌ ఆలౌట్‌.. భారత్‌ లక్ష్యం 48
పింక్‌ బాల్‌ టెస్టులో ఇంగ్లండ్‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకే కుప్పకూలింది. దీంతో 49 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా ముందుంచింది. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్లలో స్టోక్స్‌ 25 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిస్తే.. రూట్‌ 19 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ 5 వికట్లు, అశ్విన్‌ 4, సుందర్‌ ఒక వికెట్‌ తీశాడు.

అశ్విన్‌ ఖాతాలో 400 వికెట్లు
ఇంగ్లండ్‌ జట్టును అశ్విన్‌ తన రెండు వరుస ఓవర్లలో దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్‌ 23వ ఓవర్‌ తొలి బంతికే ఆర్చర్‌ను ఎల్బీగా వెనక్కి పంపిన  అశ్విన్ టెస్టుల్లో 400 వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఇంగ్లండ్‌ 68 పరుగుల వద్ద ఏడో వికెట్‌ నష్టపోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ కేవలం 35 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది.అంతకముందు‌ అశ్విన్‌ బౌలింగ్‌లోనే 21వ ఓవర్‌ చివరి బంతికి ఓలీ పోప్‌ ఎల్బీగా వెనుదిరగడంతో ఆరో వికెట్‌ నష్టపోయింది.

రూట్‌ అవుట్‌.. ఇంగ్లండ్‌ ఐదో వికెట్‌ డౌన్
ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ 11 పరుగులు చేసి అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరగడంతో 56 పరుగుల వద్ద ఐదో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 5 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. కాగా ఇంగ్లండ్‌ 23 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అక్షర్‌ పటేల్‌ అరుదైన ఘనత సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన అక్షర్‌  రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసి మొత్తం 10 వి​కెట్లు సాధించాడు. 

11వ సారి అశ్విన్‌ చేతిలోనే
ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరగడంతో ఇంగ్లండ్‌ 50 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. కాగా టెస్టుల్లో అశ్విన్‌ బౌలింగ్‌లో స్టోక్స్‌ అవుటవడం ఇది 11 సారి కావడం విశేషం.

మెరిసిన అక్షర్‌..ఇంగ్లండ్‌ 19/3
పింక్‌ బాల్‌ టెస్టులో ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో మూడో వికెట్‌ కోల్పోయింది. అక్షర్‌ పటేల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ మూడో బంతిని ఫ్లిక్‌ చేయగా రిషబ్‌ పంత్‌ క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో ఇంగ్లండ్‌ 19 పరుగుల వద్ద మూడో వికెట్‌ నష్టపోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 12 పరుగులు వెనుకబడి ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో మూడో వికెట్లు అక్షర్‌ పటేల్‌ ఖాతాలోకి వెళ్లాయి.

సున్నాకే రెండు వికెట్లు
► తొలి సెషన్‌ విరామం అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. అక్షర్‌ పటేల్‌ వేసిన తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లతో దెబ్బతీశాడు. ఓవర్‌ తొలి బంతికే ఓపెనర్‌ జాక్‌ క్రాలేను గోల్డెన్‌ డక్‌గా అవుట్‌ చేయగా.. మూడో బంతికి జానీ బెయిర్‌ స్టోను అద్భుత బంతితో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. దీంతో ఖాతా తెరవకుండానే ఇంగ్లండ్‌ రెండు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 2 వికెట్ల నష్టానికి 5 పరుగులు చేసింది. 

145 పరుగులకు టీమిండియా ఆలౌట్‌
► పింక్‌ బాల్‌ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 145 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ 5 వికెట్లు తీసి టీమిండియా నడ్డి విరిచాడు. కాగా టీమిండియా చివరి వికెట్‌గా జస్‌ప్రీత్‌ బుమ్రా వెనుదిరిగాడు. కాగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 33  పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది. టీమిండియా బ్యాటింగ్‌లో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 66 మినహా మరే ఆటగాడు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడలేదు. ఇంగ్లండ్‌ బౌలర్లలో రూట్‌ 5 వికెట్లు తీయగా.. జాక్‌ లీచ్‌ 4, జోఫ్రా ఆర్చర్‌ 1 వికెట్‌ తీశాడు.

అశ్విన్‌ అవుట్‌.. ఆలౌట్‌కు ఒక వికెట్‌ దూరంలో
► టీమిండియా ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ 17 పరుగులు చేసి జో రూట్‌ బౌలింగ్‌లో క్రాలేకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 134 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. జట్టు స్కోరు 143/9గా ఉంది. కాగా టీమిండియా ప్రస్తుతం 31 పరుగుల ఆధిక్యంలో ఉంది. అశ్విన్‌ అవుట్‌ చేయడం ద్వారా రూట్‌ నాలుగో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

టీమిండియాకు రూట్‌ దెబ్బ
పింక్ బాల్‌ టెస్టులో టీమిండియా వికెట్ల పరంపర కొనసాగుతుంది. తాజాగా ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ భారత్‌ను దెబ్బతీశాడు. రూట్‌ తాను వేసిన రెండు ఓవర్లలో మూడు వికెట్లు తీశాడు. ఇన్ని‍ంగ్స్‌ 45వ ఓవర్‌ మొదటి బంతికి సుందర్‌ను పెవిలియన్‌కు పంపిన రూట్‌ మూడో బంతికి అక్షర్‌పటేల్‌ను డకౌట్‌ చేశాడు. ప్రస్తుతం టీమిండియా 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. అశ్విన్‌ 15, ఇషాంత సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా టీమిండియా ఇప్పటివరకు 18 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది. అంతకముందు 41 ఓవర్ వేసిన రూట్‌‌ మొదటి బంతినే వికెట్‌గా మల్చుకున్నాడు. 8 పరుగులు చేసిన పంత్‌ ఫోక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 117 పరుగుల వద్ద ఆరో వికెట్‌ కోల్పోయింది. 

ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ లీచ్‌ మరోసారి టీమిండియాను దెబ్బ కొట్టాడు. ఇప్పటికే కీలక ఆటగాళ్లు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, పుజారా వికెట్లు తీసిన లీచ్‌ రహానే (7)ను, ఆ వెంటనే మెరుగ్గా రాణిస్తున్న రోహిత్‌ శర్మ (66)ను ఔట్‌ చేశాడు. ప్రస్తుతం భారత్‌ స్కోరు 117/5. క్రీజులో పంత్‌ (1), అశ్విన్‌ (2) క్రీజులో ఉన్నారు.



► పింక్‌ బాల్‌ టెస్టులో టీమిండియా తడబడుతుంది. మొదటిరోజు ఆటలో పూర్తిగా ఆధిపత్యం చెలాయించిన టీమిండియా రెండోరోజు ఆటలో మాత్రం ఇంగ్లండ్‌ బౌలర్ల దాటికి పరుగులు చేయడానికి  అవస్థలు పడుతుంది, ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఆండర్సన్‌ బౌలింగ్‌లో రెండో బౌండరీలు బాది 66 పరుగుల వద్ద ఉన్నాడు. మరో ఎండ్‌లో అజింక్య రహానే(1) హిట్‌మ్యాన్‌కు సహకారం అందిస్తున్నాడు. టీమిండియా ప్రస్తుత స్కోరు108/3.


 అహ్మదాబాద్‌: భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య నరేంద్ర మోదీ క్రికెట్‌ స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్ట్‌ మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. మొదటి రోజే ఇంగ్లీషు టీమ్‌ను టీమిండియా బౌలర్లు 112 పరుగులకే ఆలౌట్‌ చేశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ కూడా 3 వికెట్లు కోల్పోవడంతో ఉత్కంఠ పెరిగింది. భారత్‌ బ్యాట్స్‌మన్‌ ఎంతవరకు ఇంగ్లండ్‌ బౌలర్లను కాచుకుంటారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2.30కు మ్యాచ్‌ ప్రారంభమైంది. 99/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో టీమిండియా రెండో రోజు గురువారం ఆట ప్రారంభించింది. 

మొదటి రోజు ఆటలో హైలైట్స్‌
 ► భారత్‌ తరఫున 100 టెస్టులు ఆడిన 11వ క్రికెటర్‌గా ఇషాంత్‌ శర్మ గుర్తింపు పొందాడు. కపిల్‌ దేవ్‌ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో పేస్‌ బౌలర్‌గా ఇషాంత్‌ నిలిచాడు.

► అన్ని ఫార్మాట్‌లలో కలిపి అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో జహీర్‌ ఖాన్‌ (597 వికెట్లు)ను ఐదో స్థానానికి నెట్టి అశ్విన్‌ (598 వికెట్లు) నాలుగో స్థానానికి ఎగబాకాడు. అనిల్‌ కుంబ్లే (953), హర్భజన్‌ సింగ్‌ (707), కపిల్‌ దేవ్‌ (687) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.

చదవండి: 
ఇంగ్లండ్‌పై అక్షరాస్త్రం

పాపం కోహ్లి.. భయపడి పారిపోయాడు

మరిన్ని వార్తలు