Innings Defeat: మూడేళ్ల తర్వాత మళ్లీ ఇంగ్లండ్ చేతిలోనే.. అప్పుడు, ఇప్పుడు అండర్సనే

28 Aug, 2021 21:01 IST|Sakshi

లీడ్స్: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో అన్ని రంగాల్లో దారుణంగా విఫలమైన కోహ్లీసేన.. మూడేళ్ల తర్వాత మళ్లీ అదే జట్టు చేతిలో ఇన్నింగ్స్‌ ఓటమిని చవిచూసింది. 2018 లార్ట్స్‌ టెస్ట్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఇన్నింగ్స్ 159 పరుగుల తేడాతో ఓటమి పాలైన భారత్‌.. మూడో టెస్ట్‌లో మళ్లీ అంతటి ఘోర పరాభవాన్ని రుచి చూసింది. నాడు తొమ్మిది వికెట్ల ప్రదర్శనతో టీమిండియా పతనాన్ని శాసించిన అండర్సనే.. మరోసారి భారత జట్టు పాలిట సింహస్వప్నం అయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఆండర్సన్‌ నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టినప్పటికీ.. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 78 పరుగులకే చాపచుట్టేయడానికి ప్రధాన కారణమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆండర్సన్‌ ఆదిలోనే కేఎల్‌ రాహుల్‌, కోహ్లి, పుజారా వికెట్లు తీసి టీమిండియాను కోలుకోలేని దెబ్బతీశాడు.

కాగా,  215/2 వద్ద నాలుగో రోజు ఆటను ఆరంభించిన భారత్‌.. ఇంగ్లండ్‌ బౌలర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆతిధ్య జట్టు భారత ఆధిక్యాన్ని 1-1కి తగ్గించి సిరీస్‌ను సమం చేసింది. అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకు ఆలౌట్‌ కాగా, ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 432 పరుగులు చేసింది. ఓలి రాబిన్సన్‌(5/65), క్రెయిగ్‌ ఒవర్టన్‌(3/47) రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియాను దారుణంగా దెబ్బకొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కలిపి మ్యాచ్‌ మొత్తంలో 7 వికెట్లు పడగొట్టిన రాబిన్సన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్ట్‌ కెన్నింగ్స్టన్‌ ఓవల్‌ వేదికగా సెప్టెంబర్‌ 2 నుంచి ప్రారంభంకానుంది. 
చదవండి: ఆండర్సన్‌ బౌలింగ్ చేస్తుంటే పంత్ ఏం చేస్తున్నాడో చూడండి..

>
మరిన్ని వార్తలు