మెరుపు వేగంతో కదిలి.. జైస్వాల్‌ క్యాచ్‌.. అతడు ఊహించలేదు!

17 Feb, 2024 10:39 IST|Sakshi
మెరుపు వేగంతో కదిలిన జైస్వాల్‌.. క్యాచ్‌ (PC: BCCI/JIO Cinema X)

India vs England, 3rd Test Day 3: ఇంగ్లండ్‌తో మూడో టెస్టు మూడో రోజు ఆటలో టీమిండియాకు శుభారంభం లభించింది. ఆట మొదలైన కాసేపటికే జో రూట్‌ రూపంలో కీలక వికెట్‌ దక్కింది. కాగా రెండో రోజు ఆటలో టీమిండియా 445 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టింది.

ఇక శుక్రవారం నాటి ఆట ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ మెరుపు సెంచరీ కారణంగా ఈ మేరకు స్కోరు చేసింది. ఈ క్రమంలో 207/2తో శనివారం ఆట ఆరంభించిన ఇంగ్లండ్‌(డకెట్‌, రూట్‌ క్రీజులో)కు ఆదిలోనే షాకిచ్చాడు భారత పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా. 40వ ఓవర్‌ ఐదో బంతికి జో రూట్‌ రూపంలో టీమిండియాకు మూడో వికెట్‌ అందించాడు.

కాగా అవుట్‌ సైడ్‌ ఆఫ్‌ దిశగా బుమ్రా వేసిన బంతిని రివర్స్‌ ల్యాప్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన రూట్‌.. బంతిని గాల్లోకి లేపాడు. అయితే, సెకండ్‌ స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న యశస్వి జైస్వాల్‌ మెరుపు వేగంతో కదిలి బంతిని క్యాచ్‌ పట్టాడు.

ఫలితంగా తాను అవుట్‌ కావడంతో జో రూట్‌ అసహనంగా మైదానం వీడాడు. మొత్తంగా 31 బంతులు ఎదుర్కొన్న అతడు 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌ చేరాడు. భారత గడ్డపై తన బ్యాటింగ్‌ వైఫల్యాన్ని కొనసాగిస్తూ మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. మరోవైపు.. రూట్‌ స్థానంలో క్రీజులోకి వచ్చిన జానీ బెయిర్‌ స్టోను.. భారత స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ డకౌట్‌గా వెనక్కి పంపాడు.

ఆరంభంలోనే  ఇలా రెండు వికెట్లు దక్కడంతో భారత శిబిరంలో ఉత్సాహం నెలకొంది. ఇదిలా ఉంటే.. బుమ్రా బౌలింగ్‌లో జో రూట్‌ ఇచ్చిన క్యాచ్‌ను జైస్వాల్‌ అందుకున్న వీడియో అభిమానులను ఆకర్షిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ చూసేయండి!

చదవండి: CSK: ఆడుదాం–ఆంధ్రా నుంచి ఐపీఎల్‌కు.. విజయనగరం కుర్రాడు!

whatsapp channel

మరిన్ని వార్తలు