రోహిత్‌, జడ్డూ శతకాలు.. మెరుపు అర్ధసెంచరీతో ఆకట్టుకున్న సర్ఫరాజ్‌ 

15 Feb, 2024 18:06 IST|Sakshi

రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌ తొలి రోజు ఆటలో టీమిండియా పైచేయి సాధించింది. సీనియర్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ (131), రవీంద్ర జడేజా (110 నాటౌట్‌) బాధ్యతాయుతమైన సెంచరీలు చేసి భారత జట్టును ఆదుకున్నారు. వీరికి అరంగేట్రం ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌ మెరుపు అర్దశతకం తోడైంది.

ఈ ముగ్గురు కలిసి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోర్‌ ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగులుగా ఉంది. యువ బ్యాటర్లు, రెండో టెస్ట్‌ హీరోలు యశస్వి జైస్వాల్‌ (10), శుభ్‌మన్‌ గిల్‌ (0) నిరాశపరిచారు.

మరో యువ ఆటగాడు రజత్‌ పాటిదార్‌ (5) అందివచ్చిన అవకాశాన్ని జార విడుచుకున్నాడు. జడేజాతో పాటు కుల్దీప్‌ యాదవ్‌ (1) క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో మార్క్‌ వుడ్‌ 3, టామ్‌ హార్ల్టీ ఓ వికెట్‌ పడగొట్టగా.. సర్ఫరాజ్‌ ఖాన్‌ రనౌటయ్యాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. 

హిట్‌మ్యాన్‌ షో..
33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను రోహిత్‌ శర్మ బాధ్యతాయుతమైన సెంచరీతో ఆదుకున్నాడు. హిట్‌మ్యాన్‌ 157 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసి ఔటయ్యాడు. రోహిత్‌ చాలాకాలం తర్వాత టెస్ట్‌ల్లో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. అతనికిది 11వ టెస్ట్‌ సెంచరీ.

హిట్‌మ్యాన్‌ దాదాపు ఏడాది తర్వాత స్వదేశంలో టెస్ట్‌ సెంచరీ చేశాడు. రోహిత్‌ ఈ సెంచరీతో భారత్‌ తరఫున సెంచరీ చేసిన అత్యంత పెద్ద వయస్కుడైన సారధిగా రికార్డుల్లోకెక్కాడు. హిట్‌మ్యాన్‌ 36 ఏళ్ల 291 రోజుల వయసులో సెంచరీ చేశాడు.

మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న సర్ఫరాజ్‌ ..
ఈ మ్యాచ్‌తో టెస్ట్‌ అరంగేట్రం చేసిన సర్ఫరాజ్‌ ఖాన్‌ తొలి ఇన్నింగ్స్‌లోనే మెరుపు అర్దశతకం బాది ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఔటయ్యాక ఆరో స్థానంలో బరిలోకి దిగిన సర్ఫరాజ్‌ కేవలం 48 బంతుల్లోనే అర్దసెంచరీ బాది అభిమానులకు కనువిందు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్‌ 7 ఫోర్లు, సిక్సర్‌ బాదాడు.

దేశవాలీ టోర్నీల్లో ఘనమైన రికార్డు ఉన్న సర్ఫరాజ్‌.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకుని, తొలి ఇన్నింగ్స్‌లోనే తన మార్కు ప్రభావం చూపాడు. సర్ఫరాజ్‌కు దేశవాలీ క్రికెట్‌లో చిచ్చరపిడుగుగా పేరుంది. ఆ బిరదును సర్ఫరాజ్‌ తన తొలి టెస్ట్‌ ఇన్నింగ్స్‌లోనే నిజం​ చేశాడు. సర్ఫరాజ్‌ క్రీజ్‌లోకి వచ్చినప్పటి నుంచి ఏమాత్రం బెరుకు లేకుండా షాట్లు ఆడి, అనుభవజ్ఞుడైన ఆటగాళ్లను తలపించాడు.

జడ్డూ బాధ్యతాయుతమైన సెంచరీ..
జట్టు కష్టాల్లో (33/3) ఉన్నప్పుడు కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో జతకట్టిన జడ్డూ.. కెరీర్‌లో నాలుగో సెంచరీతో చెలరేగాడు. 198 బంతుల్లో 7 ఫోర్లు, 2స సిక్సర్ల సాయంతో సెంచరీ మార్కును తాకాడు. జడ్డూ బాధ్యతాయుతమైన సెంచరీతో కదంతొక్కడంతో టీమిండియా పటిష్ట స్థితి​​కి చేరింది. జడ్డూ.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో కలిసి నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయిలో 234 పరుగులు జోడించాడు. 

పాపం సర్ఫరాజ్‌..
అరంగేట్రం మ్యాచ్‌లోనే ఏ బెదురు లేకుండా యదేచ్చగా షాట్లు ఆడుతూ మెరుపు వేగంతో అర్దసెంచరీ పూర్తి చేసుకున్న సర్ఫరాజ్‌ ఖాన్‌.. జడేజా చేసిన పొరపాటు కారణంగా రనౌటయ్యాడు. జడేజా 99 పరుగుల వద్ద ఉన్నప్పుడు లేని పరుగుకు కోసం సర్ఫరాజ్‌ను పిలిచి రనౌట్‌ చేయించాడు. సర్ఫరాజ్‌ను అనవసరంగా ఔట్‌ చేయించానన్న బాధలో జడేజా సెంచరీ సెలబ్రేషన్స్‌ కూడా చేసుకోలేదు. 

కోపంతో ఊగిపోయిన హిట్‌మ్యాన్‌..
జడేజా కారణంగా సర్ఫరాజ్‌ ఖాన్‌ అనవసరంగా రనౌట్‌ కావడంతో డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్న రోహిత్‌ శర్మ కోపంతో ఊగిపోయాడు. క్యాప్‌ను నేలకేసి కొట్టి తన అసహనాన్ని ప్రదర్శించాడు. రోహిత్‌ కోపపడిన విధానాన్ని చూస్తే అతనికి సర్ఫరాజ్‌పై భారీ అంచనాలు ఉన్నాయన్న విషయం అర్దమవుతుంది. 
 

whatsapp channel

మరిన్ని వార్తలు