Ind Vs Eng 4th Test: బుమ్రాను రిలీజ్‌ చేసిన బీసీసీఐ.. అతడికి గ్రీన్‌ సిగ్నల్‌!

21 Feb, 2024 12:12 IST|Sakshi
బుమ్రాకు విశ్రాంతి (PC: BCCI)

Ind vs Eng Test Series 2024- 4th debutant in 4th match?: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ సందర్భంగా ఇప్పటికే ఇద్దరు యువ క్రికెటర్లు టీమిండియా తరఫున అరంగేట్రం చేశారు. మధ్యప్రదేశ్‌ ఆటగాడు రజత్‌ పాటిదార్‌, ముంబై బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌, ఉత్తరప్రదేశ్‌ వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టారు.

విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో రజత్‌కు జహీర్‌ ఖాన్‌, రాజ్‌కోట్‌ మ్యాచ్‌లో సర్ఫరాజ్‌కు అనిల్‌ కుంబ్లే, జురెల్‌కు దినేశ్‌ కార్తిక్‌ టీమిండియా క్యాప్‌లు అందించారు. తాజాగా నాలుగో టెస్టు సందర్భంగా మరో ఆటగాడి అరంగేట్రానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

నాలుగో టెస్టులో.. ‘నాలుగో ఆటగాడి’ అరంగేట్రం?
బెంగాల్‌ పేసర్‌ ఆకాశ్‌ దీప్‌నకు తుదిజట్టులో చోటు ఇచ్చేందుకు మేనేజ్‌మెంట్‌ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. కాగా ఇంగ్లండ్‌తో తొలి మూడు టెస్టుల్లో అదరగొట్టిన టీమిండియా పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతినిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ ఫాస్ట్‌బౌలర్‌కు పనిభారం తగ్గించే దృష్ట్యా నాలుగో టెస్టు జట్టు నుంచి అతడిని రిలీజ్‌ చేస్తున్నట్లు బోర్డు తెలిపింది. అదే విధంగా.. అతడి స్థానంలో ముకేశ్‌ కుమార్‌ను మళ్లీ జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించింది.

అతడి వైపే మొగ్గు
అయితే, తుదిజట్టులో మాత్రం ముకేశ్‌ను కాకుండా ఆకాశ్‌ దీప్‌ను ఆడించాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు బీసీసీఐ వర్గాల సమాచారం. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సైతం ఈ ఇద్దరు బెంగాల్‌ పేసర్లలో ఆకాశ్‌ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

బుమ్రా గైర్హాజరీలో మహ్మద్‌ సిరాజ్‌ ప్రధాన పేసర్‌గా వ్యవహరించనుండగా.. అతడికి డిప్యూటీగా ఆకాశ్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. కాగా ఇప్పటి వరకు టీమిండియా తరఫున మూడు టెస్టులు ఆడిన ముకేశ్‌ కుమార్‌ ఏడు వికెట్లు మాత్రమే తీశాడు.

తండ్రి ప్రోత్సాహం కరువైనా
ఇక దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటిన రైటార్మ్‌ పేసర్‌ ఆకాశ్‌ దీప్‌.. ఇటీవల  ఇంగ్లండ్‌ లయన్స్‌(ఇంగ్లండ్‌-ఏ)తో ముగిసిన అనధికారిక టెస్టు సిరీస్‌లో అదరగొట్టాడు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని మొత్తంగా 13 వికెట్లు పడగొట్టాడు. కాగా బిహార్‌లోని దెహ్రీలో 1996లో జన్మించిన ఆకాశ్‌ దీప్‌ క్రికెటర్‌గా ఎదిగేందుకు బెంగాల్‌కు మకాం మార్చాడు.

తండ్రి నుంచి ప్రోత్సాహం కరువైనప్పటికీ అంచెలంచెలుగా ఎదిగి టీమిండియాకు ఆడే స్థాయికి చేరుకున్నాడు. బెంగాల్‌ తరఫున 2019లో అరంగేట్రం చేసిన అతడు.. 30 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లలో కలిపి 104 వికెట్లు తీశాడు.

ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు భారత జట్టు(అప్‌డేటెడ్‌):
రోహిత్ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్‌ కీపర్‌), కేఎస్‌ భరత్ (వికెట్‌ కీపర్‌), దేవదత్ పడిక్కల్, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాశ్‌ దీప్.

చదవండి: SRH: చిక్కుల్లో సన్‌రైజర్స్‌ ఆల్‌రౌండర్‌ అభిషేక్‌ శర్మ.. ఆమె ఆత్మహత్య కేసులో..

whatsapp channel

మరిన్ని వార్తలు